కరోన శతకం

ABN , First Publish Date - 2020-04-05T07:21:34+05:30 IST

ఒక్క సూక్ష్మజీవి ఊహానులో పుట్టి విశ్వమంత నేడు విస్తరించి, మరణశాసనాలు విరచించుచుండెను నేటి నిజము వినర!సాటి మనిషి! చాలు చాలు బాబు! ఆలింగ నాలింక...

కరోన శతకం

ఒక్క సూక్ష్మజీవి ఊహానులో పుట్టి

విశ్వమంత నేడు విస్తరించి,

మరణశాసనాలు విరచించుచుండెను

నేటి నిజము వినర!సాటి మనిషి!


చాలు చాలు బాబు! ఆలింగ నాలింక

చేయి కలుపవద్దు చెంత జేరి 

అఖిలజనుల కెప్పుడభివాదమే లెస్స

నేటి నిజము వినర!సాటి మనిషి!


కుల మతాలు విడిచి కలిమిలేములు మర్చి

ఏకమాయె నిపుడు లోకమంత

సూక్ష్మజీవి తెచ్చె సోషలిజమ్మును

నేటి నిజము వినర!సాటిమనిషి!


పత్రికంటుకున్న ప్రబలు కరోనంటు

వ్యాప్తిచేయు గాలివార్తలెన్నొ

వెర్రి ముదిరినట్టి విజ్ఞాన హంతకుల్

నేటి నిజము వినర! సాటి మనిషి!


చావుతొ నిరతమ్ము సహవాసమును జేసి

ధీరుడై కరోన పోరు చేయు

సాటిలేని వేల్పు సర్కారు వైద్యుడే 

నేటి నిజము వినర!సాటిమనిషి!


బ్రతుకు పరుగులోన భార్యబిడ్డలతోడ

మాటలాడ లేదు మనసు విప్పి

జనత కర్ఫ్యుతెచ్చె ఎనలేని ముచ్చట్లు

నేటి మాట వినర!సాటిమనిషి!


వలస కూలి జనుల వలపోత గమనించి

కడుపు నింప వలెను కరుణ తోడ

మానవత్వసిరులు మహినిండ పండాలి

నేటి నిజము వినర!సాటిమనిషి


సరుకు దాచిపెట్టి కరువును సృష్టించి

డబ్బుగుంజు, పిదప డాబు సరిగ

వెల్లువాయె నిపుడు నల్ల బజారులు 

నేటి నిజము వినర!సాటి మనిషి!


జ్వరము, దగ్గు, జలుబు దరిచేరినంతనే

చావు మూడెననుచు సణుగుచుంద్రు 

భయమె ముప్పుతెచ్చు వైరస్సుకంటేను

నేటి నిజము వినర!సాటి మనిషి


కీడు చేయునట్టి, క్రిమి తోడ పోరాడి

మురికినంత కడుగు, ముందు కురికి

కార్మికుల ఋణమ్ముకడతేర దెపుడైన

నేటి నిజము వినర!సాటిమనిషి!

కోటేశు 

Updated Date - 2020-04-05T07:21:34+05:30 IST