కరోనా అనంతర భారతావని

ABN , First Publish Date - 2020-04-21T11:08:58+05:30 IST

‘రక్షణ రంగంలో పరిశోధనలు, వినూత్న ఆవిష్కారాలు జరిపేందుకు ప్రత్యేకంగా అయిదు ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. ఆ ప్రయోగశాలల్లో 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న శాస్త్రవేత్తలకు అవకాశం కల్పించాలి. పరిశోధనల్లో ఈ యువ వైజ్ఞానికులకు...

కరోనా అనంతర భారతావని

కొవిడ్ -19 విలయానంతరం వివిధ సమస్యలను అవకాశాలుగా మలుచుకోవడం గురించి ఒక దార్శనిక నాయకుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నారు. ఎటువంటి సమస్యలనైనా ముందుగానే ఊహించి పరిష్కార మార్గాలను సూచించగల మోదీ, నేటి పరిస్థితుల్లో ‘భారత భాగ్య విధాత’గా ఉండడం ఈ దేశ ప్రజల అదృష్టం. కరోనా సంక్షోభంతో వసుధైక కుటుంబం, సర్వమానవ సౌభ్రాతృత్వం అనే భారతీయ ఆదర్శాలకు సార్థకత సిద్ధిస్తున్నది. కనీవినీ ఎరుగని ఒక సవాల్‌ను మనమందరమూ కలిసికట్టుగా ఎదుర్కొనేలా అది పురిగొల్పుతోంది.


‘రక్షణ రంగంలో పరిశోధనలు, వినూత్న ఆవిష్కారాలు జరిపేందుకు ప్రత్యేకంగా అయిదు ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. ఆ ప్రయోగశాలల్లో 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న శాస్త్రవేత్తలకు అవకాశం కల్పించాలి. పరిశోధనల్లో ఈ యువ వైజ్ఞానికులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి’ ఇవి, 2014లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో డిఆర్‌డివో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించిన మాటలు. మోదీ కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యే నేత కాదు. అతి పిన్న వయస్సులో దేశానికి రక్షణ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సతీష్ రెడ్డికే ఆయన డిఆర్‌డివో బాధ్యతల్ని అప్పజెప్పారు. సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కారాల విషయంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ వెలుగొందాలని మోదీ ప్రగాఢంగా ఆశిస్తున్నారు. ఆయన అభీష్టానికి అనుగుణంగా బెంగ ళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ ‌లలో యువ పరిశోధకులకోసం ప్రయోగశాలల నేర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాం టమ్ టెక్నాలజీ, కాగ్నిటివ్ టెక్నాలజీ నుంచి స్మార్ట్ మెటీరియల్స్ వరకు వివిధ రంగాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. డిఆర్‌డీవోకు చెందిన 52 ప్రయోగశాలల్లోనూ యువ పరిశోధకులను పెద్ద సంఖ్యలో నియమించారు. ఈ ఏడాది జనవరి 2న బెంగళూరులో ప్రధాని మోదీ, డిఆర్ డీవో చైర్మన్ సతీష్ రెడ్డి సమక్షంలో ఈ ప్రయోగశాలలను జాతికి అంకితం చేశారు. ‘పనిచేసే సామర్థ్యం ఉన్న వారివైపే దేశం చూస్తుందని, హనుమంతుడికి తన శక్తి తెలియని విధంగా డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు తమ శక్తి సామర్థ్యాలు తెలియవని’ ఆ సందర్భంగా మోదీ చమత్కరించారు.‘మీరే నిర్ణయాలు తీసుకుని స్వేచ్ఛగా పరిశోధనలు, ఆవిష్కారాలు జరపండి. మీకు ఎటువంటి ప్రతిబంధకాలు ఉండవు. ఈ దేశ ప్రధానమంత్రిగా నేను మీకు అన్ని అండదండలిస్తాన’ని ఆయన చెప్పినప్పుడు యువ శాస్త్రవేత్తలు హర్షాతిరేకంతో చేసిన కరతాళ ధ్వనులు మిన్నంటాయి.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకున్నందువల్లే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను మాత్రమే కాకుండా, కరోనా వైరస్‌ను తట్టుకునే సామర్థ్యం గల (పూర్తి శరీరాన్ని కప్పే) సూట్లను, పేషంట్లకు అత్యవసరమయ్యే వెంటిలేటర్లను, మాస్కులను, శానిటైజర్లను డిఆర్‌డివో పెద్ద ఎత్తున రూపొందించగలుగుతోంది. సబ్ మెరైస్‌ల లోనూ, పారా చూట్‌లలోనూ ఉపయోగించే పదార్థాల ద్వారా ప్రత్యేక సూట్లను అతి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి వైద్య సిబ్బందికి అందిస్తున్న ఘనత డీఆర్‌డీవోకు దక్కింది. పరిశ్రమలకు ఉచితంగా టెక్నాలజీని బదిలీ చేసి వారానికి 20వేల సూట్లను తయారు చేయగలుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో నలుగురి నుంచి 8 మందికి ఒక సారి ఉపయోగపడే వెంటిలేటర్లను డిఆర్ డివో ఉత్పత్తి చేయగలుగుతోంది. ప్రధానమంత్రి ఆలోచనా విధానం ఎంత దూర దృష్టితో కూడుకున్నదో, యువ భారతీయ వైజ్ఞానికుల ప్రతిభాపాటవాల పట్ల ఆయన అంచనా ఎంత ఖచ్చితమైనదో డీఆర్ డీవో విజయగాథ స్పష్టం చేసింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ దేశ జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాలలోపు వయస్సులో వున్నారు. జాతినిర్మాణంలో యువ శక్తి ప్రాధాన్యత కీలకమైనదని చెప్పిన స్వామి వివేకానంద మాటల్ని  విశ్వసించినందువల్లే యువత ఆకాంక్షలను, స్వప్నాలను నెరవేర్చే దిశగా ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 


ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా భారత దేశం రూపుదిద్దుకుంటున్నందువల్లే, కరోనా వైరస్ మనకు ఎంతగా క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తున్నప్పటికీ ఆ సమస్యలను మనం సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాం. ‘ఈ రోజుల్లో ఇల్లే ఒక కొత్త కార్యాల యం, ఇంటర్నెట్ ఒక కొత్త సమావేశ మందిరం. సమాజంలోని వివిధ వర్గాలతో నేను ఇంటినుంచే సమావేశం కాగలుగుతున్నాన’ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు సామాజిక మాధ్యమమైన ‘లింక్డ్ ఇన్’లో పం చుకున్న భావాల్లో భావి భారత్ గురిం చి తన ఆకాంక్షలను విస్పష్టం చేశారు. భారత దేశంలో అసమానతల అడ్డుగోడలను టెక్నాలజీయే తొలగిస్తున్న విషయాన్ని ఆయన అందరికీ అర్థమయ్యే భాషలో వివరించారు. టెక్నాలజీ వల్ల అన్ని కార్యకలాపాలూ డిజిటల్ రూపంలోనే జరుగుతుండడం, మధ్యదళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా ప్రయోజనాలను అందేలా చేయడం ప్రధాని మాటల్లోని వాస్తవికతను తేటతెల్లం చేస్తున్నది.


ఇవాళ ఆఫీసులో ఎన్ని గంటల సమయం గడిపామన్నది ముఖ్యం కాదు. అది  సమర్థతకు గీటురాయి కాదు. ఎక్కడున్నా, ఎంత కృషి చేశామన్నది ప్రధానం. అందుకే ఉత్పాదకత, ప్రాధాన్యత, నిర్ణీత వ్యవధిలో పనిని పూర్తి చేయగల నమూనాల గురించి ఆలోచించాలని మోదీ అంటున్నారు. వీధిలో అడుగుపెట్టకుండానే మనం చేయగల పనులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అభ్యాసాలను అభివృద్ధి చేయడానికే మంచి భవిష్యత్ ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. రహదారులు, ఓడ రేవులు వంటి భారీ మౌలిక సదుపాయాలు అవసరమే. కాని ఇంటినుంచే ప్రపంచ సరఫరా వ్యవస్థను మనం నిర్దేశించగలిగితే అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఒక కీలక కూడలిగా మారుతుంది. టెక్నాలజీ శక్తి ఏమిటో ప్రధానికి బాగా తెలుసు. బీజేపీ కార్యదర్శిగా ఉన్నప్పుడే అత్యంత ఆధునిక ఉపకరణాలను మోదీ ఉపయోగించేవారు. సులభంగా, సమ ర్థంగా, వేగంగా, చాలా సరళంగా, తక్కువ ఖర్చుతో సేవలందించడంలో టెక్నాలజీ పాత్రను ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు. కనుకనే ప్రధానమంత్రిగా అధికారంలోకి రాగానే ఆయన తన ఎజెండాలో నైపుణ్య భారత్, డిజిటల్ ఎజెండాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. దేశంలోని వివిధ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షించడమే కాక, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ‘ప్రగతి’ అనే టెక్నాలజీ ఆధారిత ప్లాట్ ఫారమ్‌ను ఆయన ప్రారంభించారు. ప్రతి బుధవారం ‘ప్రగతి’ ద్వారానే ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఆరోగ్య, విద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీని మోదీ ప్రభుత్వం ఉపయోగించినంతగా మరే ప్రభుత్వమూ ఉపయోగించలేదనడం అతిశయోక్తి కాదు.


టెక్నాలజీని ప్రజల ప్రయోజనాలకోసం ఏ విధంగా ఉపయోగించవచ్చునో అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆచరణలో పెట్టిన విశిష్ట నాయకుడు నరేంద్ర మోదీ. 135 కోట్ల మంది భారతీయులను టెక్నాలజీతో అనుసంధానం చేసి ఒక నవ్య, భవ్య భారత దేశ నిర్మాణంలో వారందరినీ భాగస్వాములను చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. కొవిడ్ -19 అనంతరం మన సమస్యలను అవకాశాలుగా మలుచుకోవడం గురించి ఒక దార్శనిక నాయకుడుగా మోదీ యోచిస్తున్నారు. ఎటువంటి సమస్యలనైనా ముందుగానే ఊహించి పరిష్కార మార్గాలను సూచించగల నరేంద్రమోదీ, నేటి పరిస్థితుల్లో ‘భారత భాగ్య విధాత’గా ఉండడం మన అదృష్టమే అని  చెప్పాలి. కరోనా విలయంతో వసుధైక కుటుంబం, సర్వమానవ సౌభ్రాతృత్వం అనే భారతీయ ఆదర్శాలకు సార్థకత సిద్ధిస్తున్నది. అది కుల మతాలు, జాతి, వర్గం, చిన్నా-పెద్దా, పేద- ధనిక అంతరాలు, సరిహద్దుల తేడా లేకుండా కరోనా ప్రతి ఒక్కరిపై తీవ్రంగా దాడి చేసింది. అందర్నీ ఇళ్లలో బంధించింది. అయితేనేం, కనీవినీ ఎరుగని ఒక సవాల్‌ను మనమందరమూ కలిసికట్టుగా ఎదుర్కొనేలా అది పురిగొల్పుతోంది. టెక్నాలజీ ద్వారా ఒకరినొకరు అప్రమత్తం చేసుకునేందుకు ఒకరికొకరు సలహాలు, సూచనలు పంపుకునేందుకు తోడ్పడింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రేరేపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఈ విషమ సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని భారత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు మనలను సమాయత్తం చేస్తోంది.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-04-21T11:08:58+05:30 IST