కార్పొరేట్లకు ప్రత్యామ్నాయంగా కో ఆపరేటివ్‌లు

ABN , First Publish Date - 2020-12-25T06:14:35+05:30 IST

కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ కంపెనీలను బలోపేతం చేస్తాయని, వాటి కబంధ హస్తాల్లోకి...

కార్పొరేట్లకు ప్రత్యామ్నాయంగా కో ఆపరేటివ్‌లు

కొత్త సాగుచట్టాల ప్రభావంతో రైతుల జీవితాలు మరింత సంక్షోభానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు, మహిళ, ఇతర ప్రజల సహకారసంఘాలను సమన్వయపరిచి బలోపేతం చేయాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన మార్గదర్శనం చేయాలి. కార్పొరేట్లపై ఆధారపడకుండా సదా ప్రజలు సహకారసంఘాలపై ఆధారపడడమే అన్ని విధాల శ్రేయస్కరం. 


కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ కంపెనీలను బలోపేతం చేస్తాయని, వాటి కబంధ హస్తాల్లోకి దేశ వ్యవసాయరంగం వెళుతుందని రైతులు, రైతు సంఘాల కార్యకర్తలు భావిస్తున్నారు. భారత రాజ్యాంగం, రాష్ట్రాలకు ఇచ్చిన సంపూర్ణ అధికారాలను కూడా ఈ చట్టాలు తుడిచిపెడతాయని రాజ్యాంగ కోవిదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఈ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నది. రాజ్యసభలో ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడి ఓటింగ్ కోసం పట్టు పట్టింది. డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా జరిగిన భారత్‌బంద్‌లో సైతం పాల్గొన్నది. దరిమిలా కేంద్రం నుంచి ఏ ఒత్తిడిలు వచ్చాయో తెలియదు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల గొంతు కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో పూర్తిగా తగ్గిపోయింది. కేంద్రం తెచ్చిన చట్టాలు  కనుక కొత్త సాగు శాసనాలను ప్రతి రాష్ట్రమూ అనివార్యంగా అమలు చేయవలసి ఉంటుందని తెలంగాణ వ్యవసాయమంత్రి నిరంజన్ అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ ప్రస్తుత వైఖరి ఏమిటో స్పష్టమయింది. రైతులు, ప్రజలు మాత్రం తమ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.


ఈ నేపథ్యంలో, ఇప్పటికే అమలులోకి వచ్చిన కొత్త సాగుచట్టాల ప్రభావంతో కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి రాష్ట్ర వ్యవసాయరంగం వెళ్ళిపోయి రైతుల జీవితాలు మరింత సంక్షోభానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు, మహిళ, ఇతర ప్రజల సహకారసంఘాల మధ్య సమన్వయానికి, వాటి బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం ప్రకటించాలి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఆ సహకారసంఘాల మధ్య సమన్వయానికి ప్రభుత్వం తెచ్చే విధానపత్రం స్పష్టమైన మార్గదర్శనం చేయాలి. సహకారసంఘాల స్ఫూర్తిని పోగొట్ట కుండానే, వాటికి అవసరమైన అన్ని సహాయసహకారాలు ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలు అందించాలి. 


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో 909 ‘ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతిసంఘాలు’ ఉన్నాయి. 1956 కంపెనీ చట్టంలో సవరణల ద్వారా, 2013లో అమలులోకి వచ్చిన చట్టం కింద అన్ని జిల్లాలలో 330 ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కంపెనీలు ఉన్నాయి. మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో గ్రామస్థాయిలో గ్రామ సంఘాలుగా ‘మ్యాక్స్’ చట్టం క్రింద ఏర్పాటయిన మహిళల సహకార సంఘాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవేగాక మత్స్య కారుల సహకారసంఘాలు, గీత కార్మికుల సహకార సంఘాలు, గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘాలు మొదలైనవి వేల సంఖ్యలో ఉన్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యంతో 12 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను నిర్మించింది. వీటిని ఒక సమాఖ్యగా కలిపి రాష్ట్రస్థాయిలో ఒక కంపెనీని నిర్మించింది. 


రాష్ట్రస్థాయిలో ఈ సహకారసంఘాల సమాఖ్యగా ‘మార్క్‌ఫెడ్’ ఉంది. ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ’ (ఎపిఎమ్‌సి) చట్టం కింద మార్కెటింగ్ శాఖ ఉంది. దీని ఆధ్వర్యంలో 191 మార్కెట్ యార్డులు, కమిటీలు ఉన్నాయి. వీటిలో 750 మంది పర్మినెంట్ సిబ్బంది, 1500 మంది కాంట్రాక్ట్ సిబ్బంది పని చేస్తున్నారు. మార్కెట్ సెస్ ద్వారా ఏటా రూ. 250 – 300 కోట్ల నిధులు ఈ కమిటీకి సమకూరుతున్నాయి. ఉద్యోగుల జీతాలు, మార్కెట్‌యార్డుల, చెక్‌పోస్టుల నిర్వహణ, రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లకు కూడా ఈ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు. 


మార్కెట్ సెస్ ద్వారా లభించే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా మార్కెటింగ్ శాఖ కోసమే ఖర్చు చేయాలి. వాటిని ఎట్టి పరిస్థితులలోనూ ఇతర వ్యయాలకు వెచ్చించకూడదు. అలా జరిగినప్పుడు మాత్రమే ,రైతులకు మరిన్ని సౌకర్యాలు సమకూరతాయి. మార్కెటింగ్ కమిటీల ప్రతినిధులను నేరుగా రైతుల భాగస్వామ్యంతో ఎన్నుకోవాలి. ఇది తప్పని సరి. అలా జరిగితేనే, మార్కెటింగ్ కమిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా భావించి ప్రభుత్వాలు పాలకపార్టీ వారిని నామినేట్ చేయకుండా ఉంటాయి. రైతుల పట్ల బాధ్యతాయుతంగాను, భయంతోను వ్యవహరించడం పాలకులకు అలవడుతుంది. ఇప్పటివరకూ స్థానిక వ్యాపారుల ప్రయోజనాల కోసం పని చేస్తూ ఉన్న కొంతమంది అధికారులు, ఉద్యోగులు విధిగా రైతుల కోసం పని చేసేలా కచ్చితంగా బాధ్యతతో వ్యవహరించేలా చూడాలి.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ‘రైతు సమన్వయ సమితి’లను (ప్రస్తుతం వీటిని రైతుబంధు కమిటీలు అంటున్నారు) ఏర్పాటు చేసింది . వీటికి ఎటువంటి చట్టబద్ధత లేదు. పైగా అధికార పార్టీ ప్రతినిధులతో మాత్రమే ఈ కమిటీలను నింపివేశారు. ఈ కమిటీల సభ్యులకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో మాత్రం ‘రైతు సమన్వయ సమితి కార్పొరేషన్’ను కంపెనీ చట్టం క్రింద రిజిస్టర్ చేశారు. అయితే గత మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో ఈ సమితులు, కార్పొరేషన్ రైతుల కోసం చేసింది ఏమీ లేదు. వీటిని రద్దు చేసి, చట్టబద్ధంగా ఏర్పడి పని చేస్తున్న సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ముందుగా రైతులు, ఇతర గ్రామీణ ప్రజల సహకారసంఘాల అభివృద్ధి కోసం ఒక విధానపత్రాన్ని రూపొందించాలి. రైతులను, ఇతర గ్రామీణ ఉత్పత్తి దారులను, అటవీ ఉత్పత్తుల సేకరణదారులను సహకారసంఘం లోకి సమీకరించడం ఈ విధానపత్రం లక్ష్యమై ఉండాలి. వేర్వేరు సంస్థలు పోటీలు పడి ఒకే గ్రామంలో వేర్వేరు సహకారసంఘాలను ఏర్పాటు చేయకుండా, అన్ని సేవలు ఒకే సహకారసంఘం ద్వారా అందేలా ఈ విధానపత్రం మార్గదర్శనం చేయాలి. రైతుల పంటలతో పాటు, అన్ని గ్రామీణ ఉత్పత్తుల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం ఆ పత్రంలో తగిన ప్రణాళికలు రూపొందించాలి. రాష్ట్ర వాతావరణం, సాగునీరు అందుబాటు ఆధారంగా గ్రామీణ ప్రజలతో చర్చించడం ద్వారా పంటలు, ఇతర ఉత్పత్తుల ప్రణాళిక రూపొందిస్తే రాష్ట్రంలోనే అన్నీ అందుబాటులోకి వస్తాయి. దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు 


అన్ని సహకారసంఘాల మధ్య సమన్వయం కోసం ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలి. ఈ వేదికకు సంబంధించి అన్ని స్థాయిల రైతు సహకారసంఘాల ప్రతినిధులతో ఒక కమిటీని నియమించాలి. ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన అధికారిని ఈ వేదికకు బాధ్యుడిగా నియమించాలి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక, ఆహార శుద్ధి, సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి,విద్యుత్ శాఖల అధికారులను ఈ కమిటీకి జవాబు దారీ చేయాలి. 


అన్ని సహకార సంఘాలతో జిల్లాస్థాయిలో ఫెడరేషన్లు ఏర్పాటు చేయగలిగితే బాధ్యతల పంపిణీ జరిగి పనులు సాఫీగా సాగుతాయి. ఈ సహకార సంఘాల నిర్వహణకు ప్రస్తుతం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, నాబార్డ్ లాంటివి కొంత సహకారం అందిస్తున్నాయి. కానీ మానవ వనరులు, కార్యాలయాలు, ఆడిటింగ్, లీగల్ కాంప్లియెన్సెస్ లాంటి వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక ఐదు సంవత్సరాల పాటు ఇతోధిక సహాయం అందించాలి. అందుకుగాను బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే ఈ సంఘాలు నిలదొక్కుకోగలుగుతాయి. ఆ తర్వాత వాటి కాళ్లపై అవి నిలబడతాయి. ఆయా ప్రాంతాలు, పంటలు, ఇతర ఉత్పత్తుల ఆధారంగా స్థానికంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, డ్రయ్యింగ్‌యార్డులు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి పెట్టుబడులు పెట్టగలిగితే స్థానికంగా ఎక్కడికక్కడ మౌలిక సౌకర్యాలు సమకూరుతాయి. ఇప్పటికే ఉన్న వివిధ పథకాల నుంచి ఈ పెట్టుబడులను సమకూర్చుకో వచ్చు. రైతులు కూడా తమ వాటాగా కొంత తమ సంఘాల నుంచి సేకరించగలుగుతారు. వీటి నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్‌ను ఉచితంగా, లేదా తక్కువ ధరలకు అందించాలి. సహకారసంఘాలు వ్యాపారం చేయడానికి అవసరమయ్యే అన్ని లైసెన్సులను వ్యవసాయ అధికారులు అవినీతికి పాల్పడ కుండా శీఘ్రగతిన ఇవ్వాలి. రైతులు ఏర్పాటు చేసుకునే ప్రాసెసింగ్ యూనిట్ల కొనుగోలుకు చెల్లించే జీఎస్టీని, ప్రభుత్వం తిరిగి రీయింబర్స్ చేయాలి. సహకారసంఘాల వ్యాపారానికి అవసరమైన మూలధనాన్ని బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించడానికి తగిన మార్గదర్శ కాలు రూపొందించాలి. స్థానికంగా ఉత్పత్తి, సేకరణ, నిలవ, ప్రాసెసింగ్ చేయగలిగితే నష్టాలు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. వినియోగదారులు కూడా లాభపడతారు. కార్పొరేట్లపై ఆధారపడకుండా ప్రజల సహకారసంఘాలపై ఆధారపడడమే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది.

కన్నెగంటి రవి

(రైతు స్వరాజ్య వేదిక)

Updated Date - 2020-12-25T06:14:35+05:30 IST