రాజ్యహింసపై ధిక్కార స్వరం

ABN , First Publish Date - 2020-12-30T05:46:22+05:30 IST

ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత కన్నాభిరాన్‌ జీవిత పర్యంతం రాజ్యహింసకు వ్యతిరేకంగా కృషి చేశారు...

రాజ్యహింసపై ధిక్కార స్వరం

ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత కన్నాభిరాన్‌ జీవిత పర్యంతం రాజ్యహింసకు వ్యతిరేకంగా కృషి చేశారు. ప్రజల తరఫున పోరాడే ఉద్యమకారుల ఇండ్లపై పోలీసులు దాడులు చేసి, రాత్రికి రాత్రే మాయం చేసి ఎన్‌కౌంటర్ల పేరిట కాల్చి చంపినప్పుడు, లాఠీలు తూటాలతో ఉద్యమ సమూహాలపై విరుచుకుపడినప్పుడు, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఆ కేసులను వాదించడానికి ఎవరూ ముందుకు రాని సమయంలోనూ- రాజ్యానికి వ్యతిరేకంగా నిర్భయంగా గొంతెత్తి కేసులను వాదించింది కన్నాభిరాన్‌ ఒక్కరే. సింగరేణిలో వేతనభత్యాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం జరిగిన ఆరాట, పోరాటల్లో కూడా నల్లసూర్యులకు బాహాటంగా మద్దతు పలకడమే కాకుండా, వారు నిర్భందానికి గురైనప్పుడు వారి తరఫున కోర్టుల్లో వాదించారు. 1987 డిసెంబరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు ఐఏఎస్‌ అధికారులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన సంఘటనలో కన్నాభిరాన్‌ నక్సలైట్లతో సంప్రదింపులు జరిపి అధికారులను సురక్షితంగా విడుదల చేయించారు. 1991లో మాజీ కేంద్రమంత్రి శివశంకర్‌ కుమారుడు సుధీర్‌కుమార్‌ను, 1993లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పి. బాలరాజు, ఐఏఎస్‌ అధికారి డి. శ్రీనివాసులు, ఆరుగురు ఇతరులను మావోయిస్టులు తీసుకెళ్ళినప్పుడు కూడా వారిని విడిపించడంలో కన్నాభిరాన్‌ ప్రధానపాత్ర వహించారు. 

కన్నాభిరాన్‌ నవంబరు 9, 1929లో తమిళనాడులోని మధురైలో జన్మించారు. తండ్రి కందాడై గోపాలస్వామి అయ్యంగార్‌, తల్లి పంకజం. గోపాలస్వామి ప్రముఖ వైద్యులు. పూర్వీకులు నెల్లూరులో స్థిరపడ్డారు. కన్నాభిరాన్‌ విద్యాభ్యాసం మొత్తం నెల్లూరులో అయింది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక, న్యాయ శాస్త్రాలలో పట్టా సాధించారు. ప్రారంభంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న కన్నాభిరాన్‌ హైదరాబాదులో న్యాయవాదిగా నిలదొక్కుకున్నారు. 1970 ప్రాంతంలో న్యాయవాదులందరూ కలిసి నక్సలైట్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి దానికి కన్నాభిరాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్వతీపురం, హైదరాబాదు కుట్ర కేసుల్లో కన్నాభిరాన్‌ డిఫెన్స్‌ లాయర్‌గా వ్యవహరించారు. ఎమర్జెన్సీ రోజుల్లో డిటెన్యూలుగా ఉన్న వారి తరఫున ఏకైక న్యాయవాదిగా కన్నాభిరాన్‌ ఉండేవారు. ఎమర్జెన్సీ తరువాత అంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘానికి 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టినవారి తరఫున న్యాయవాదిగా ఉంటూ వారిని విడిపించేవారు. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ ప్రారంభించి దానికి 1995 నుంచి 2009 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. మానవ హక్కుల కోసం వివిధ రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదిక పైకి తీసుకొని వచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనా కాలంలో మావోయిస్టులతో శాంతి చర్చల కోసం కృషి చేశారు. గడ్డం వెంకటస్వామి ఇంట్లో కన్నాభిరాన్‌తోపాటు పలువురు పౌరహక్కుల నాయకులతో చర్చలు కూడా జరిగాయి. ఐతే, ఎన్‌కౌంటర్ల విరమణ లాంటి హామీలను ఇచ్చి ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో చర్చలు అర్ధాంతరంగానే నిలిచిపోయాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కన్నాభిరాన్‌ మద్దతునిచ్చారు. ఎంతో అనారోగ్యంగా ఉన్నప్పటికీ, బాలగోపాల్‌ మరణించినప్పుడు కన్నాభిరాన్‌ కడసారి చూపునకు వచ్చి, బాలగోపాల్‌ లాంటి వాడు దొరకడురా అని నన్ను పట్టుకొని కంట తడి పెట్టుకున్నారు. డిసెంబరు 30, 2010న కన్నుమూసిన కన్నాభిరాన్‌ మాట, నడిచిన బాట చిరస్మరణీయం. 

ఎండి. మునీర్‌

(నేడు కన్నాభిరాన్‌ 10వ వర్ధంతి)

Updated Date - 2020-12-30T05:46:22+05:30 IST