‘భీమ్’ను మలచిన భారత రాజ్యాంగం

ABN , First Publish Date - 2020-04-14T05:47:23+05:30 IST

అంబేడ్కర్ అనగానే దళిత సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహించే లేదా వారి నుంచి ఉద్భవించిన జాతీయ నాయకుడుగా పలువురు భావిస్తారు. ఆయనలో ఈ రెండు ఛాయలు ఉన్నమాట నిజమే. బ్రిటిష్ వలస పాలకుల కాలంలో...

‘భీమ్’ను మలచిన భారత రాజ్యాంగం

నేడు అంబేడ్కర్ వాదులుగా చలామణి అవుతున్న వారు స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి తొలి అంబేడ్కర్ దృక్పథానికే పరిమితమై రాజ్యాంగ రచన తర్వాత ఎంతో పరిణతి చెందిన మలి అంబేడ్కర్ హేతు దృక్పథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కుల అస్తిత్వవాద దృక్పథాలకు పరిమితం కాకుండా సామాజిక సమానత్వం, వర్గ పోరాటం అనే భావనల పునాదిగా రూపొందిన మలి అంబేడ్కర్ దృక్పథాన్ని ఆకళింపు చేసుకునేందుకు కృషి చేయడం, ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనే మలి అంబేడ్కరిజం వైఖరితో అస్తిత్వ ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


అంబేడ్కర్ అనగానే దళిత సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహించే లేదా వారి నుంచి ఉద్భవించిన జాతీయ నాయకుడుగా పలువురు భావిస్తారు. ఆయనలో ఈ రెండు ఛాయలు ఉన్నమాట నిజమే. బ్రిటిష్ వలస పాలకుల కాలంలో ప్రధానంగా ఆయన అణగారిన దళిత, అస్పృశ్య ప్రజానీకం పరిస్థితులు, సామాజిక అణచివేత, వివక్ష తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం అటు బ్రిటిష్ ప్రభుత్వంతోనూ, ఇటు స్వాతంత్ర్యోద్యమకారులు, దేశీయ అగ్రకుల పెత్తందారులతోనూ సైద్ధాంతిక--- భావజాల పరంగా, భౌతికంగా ద్విముఖ పోరాటాలు చేయవలసి వచ్చింది. సమకాలీన సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ఆయన వ్యవహరించారు. అందులో భాగంగా కమ్యూనిస్టు/ కార్మికోద్యమాల్లో కులం పాత్ర, వర్గ పోరాటంలో (ప్రత్యామ్నాయంగా కాదు) కుల నిర్మూలన పోరాటానికున్న విశిష్ట స్థానం వగైరా అంశాలపై కమ్యూనిస్టులతోనూ తనదైన శైలిలో ఆయన ఘర్షణ పడడం సరైనదే. దాంతో ఆ కాలమంతా ఆయన కృషి, దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకు రావడంపైనే కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన సైద్ధాంతిక, రాజకీయ కృషిని తొలి అంబేడ్కరిజంగా పరిగణించాలి.


స్వాతంత్య్రానంతరం 1947 అక్టోబర్ 29న రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్‌గా అంబేడ్కర్ నియమితులైనప్పటినుంచి ఆయన ప్రపంచవ్యాప్తంగా 60దేశాల రాజ్యాంగాలను సునిశితంగా అధ్యయనం చేశారు. వాటి అవగాహన నేపథ్యంలో దేశంలోని అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలు, మతాలు, జాతులు, జెండర్ తదితర సామాజిక సమూహాలన్నిటి సమస్యల్ని, వారి హక్కులు, ఆకాంక్షలు, అవసరాలన్నిటినీ ఆకళింపు చేసుకున్నారు. వాటన్నిటి క్రోడీకరణగా అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించడమే కాదు, ‘రాజ్యాంగ రచనా క్రమం’ అంబేడ్కర్ దృక్పథాన్ని తీర్చిదిద్దింది. వివిధ కులాల సంశ్లేషిత ఏక వ్యవస్థగా ఉన్న భారత ప్రజా సమూహాల విడి విడి సమస్యలను, వారి హక్కులు, ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగ రచనా కృషితో అంబేడ్కర్ ఆలోచనా క్రమం మరింత విస్తృతంగా సంఘటితమైంది. భారత సమాజంలో అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. దళితులు, బహుజనులు, శ్రామికులు, మహిళలు, తదితర అణగారిన ప్రజల దృక్పథం పునాదిగా మొత్తం భారత సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఆయన బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి. సమగ్ర సామాజిక మార్పు కోసం ఆధ్యాత్మిక విప్లవం జరగాలని ఆయన ప్రగాఢంగా ఆశించారు. సామాజిక, వైయక్తిక బాధల నుంచి విముక్తి మార్గం ఆయనకు బౌద్ధంలో దర్శనమిచ్చింది.


అంబేడ్కర్ సుదీర్ఘ కాలంగా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో, రాజ్యాంగ రచన వేసిన ప్రభావంతో ఆయన అణగారిన అస్తిత్వాల దృక్పథం పునాదిగా సమగ్ర మానవ విముక్తి మార్గంవైపు అడుగులు వేశారు. అందులో భాగంగా 1950లలో ఆయన బౌద్ధాన్ని లోతుగా, సునిశితంగా అధ్యయనం చేయడంపై కేంద్రీకరించారు. 1950లో సిలోన్‌లో జరిగిన ‘వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్ధిస్ట్’ సమావేశంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆ తర్వాత పుణేలో బుద్ధ విహార్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే బౌద్ధంపై పుస్తకం రాస్తున్నానని ప్రకటించారు. 1954లో ఆయన బర్మాలో రెండవ సారి మళ్లీ ‘వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్ధిస్ట్’ సమావేశంలో పాల్గొన్నారు. 1955లో ఆయన భారతీయ బుద్ధ మహాసభను స్థాపించారు. 1956 అక్టోబర్ 14న 22 ప్రమాణాలతో రూపొందిన ధర్మ చక్ర పరివర్తన సమావేశంలో లక్షలాది ప్రజల సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. థేరవాద, మహా యాన, వజ్రయాన తదితర బౌద్ధ శాఖలకు భిన్నంగా ‘నవయాన’ బౌద్ధాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆ తర్వాత ఆయన ఖాట్మండులో జరిగిన నాల్గవ ప్రపంచ బౌద్ధీయ మహాసభలో పాల్గొన్నారు. ‘బుద్ధుడు, ఆయన ధర్మం’ అనే పుస్తకం చిత్తు ప్రతిని పూర్తి చేసిన అనంతరం మూడు రోజులకు 1956 డిసెంబర్ 6న ఆయన పరినిర్వాణం పొందాడు. రాజ్యాంగ రచనా ప్రక్రియ అంబేడ్కర్ను సర్వమానవ విముక్తి దృక్పథాన్ని అలవర్చుకునేట్లు చేసింది. ‘ధర్మచక్ర ప్రవర్తన దినం’ సమావేశంలోని 22 ప్రమాణాల్లో ఏ ఒక్క ప్రమాణం కూడా కుల అణచివేత పునాదిగా శుద్ధ అగ్రకుల వ్యతిరేకతను, ధిక్కారాన్ని మాత్రమే సూచించేదిగా లేకపోవడమనేది ఆయన దృక్పథంలో వచ్చిన విస్తృతిని తెలియజేస్తుంది. శుద్ధ కుల దృక్పథం నుంచి కాకుండా, అణగారిన కులాలు, వర్గాల దృక్పథం పునాదిపై మొత్తం సామాజిక విముక్తి అవగాహనను ఆయన సంతరించుకున్నట్లు అర్థమవుతుంది. హిందూ మత ఆధ్యాత్మికత నుంచి భారతీయ సమాజం బయటపడి బౌద్ధ దృక్పథాన్ని సంతరించుకోవలసిన అవసరాన్ని ఆ ప్రమాణాలు నొక్కి చెబుతున్నాయి. వర్గ పోరాటం, సామాజిక సమానత్వం అనే భావనలతో కూడిన నవయాన బౌద్ధ దృక్పథమే భారత విముక్తిమార్గంగా అంబేడ్కర్ బోధించారు. సమాజంలోని కష్టాలకు, దుఃఖాలకుగల కారణాలను బౌద్ధ దార్శనికత వ్యక్తిగతంగానే చూస్తోం దిగానీ మొత్తం సామాజిక సంబంధాల చలన నియమాలలో అంతర్భాగంగా, సామాజికంగా చూడలేకపోయింది. దాంతో బౌద్ధాన్ని వైయక్తిక పరిష్కార మార్గం నుంచి వర్గ పోరాటం, సామాజిక సమానత్వం వైపునకు మళ్లిం చేందుకు అంబేడ్కర్ కృషి ప్రారంభించారు.


నేడు అంబేడ్కర్ వాదులుగా చలామణి అవుతున్న వారు స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి తొలి అంబేడ్కర్ దృక్పథానికే పరిమితమై రాజ్యాంగ రచన తర్వాత ఎంతో పరిణతి చెందిన మలి అంబేడ్కర్ హేతు దృక్పథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శకల మతవాదమైన కులవాదాన్ని పట్టుకుని తమలో తాము పోట్లాడుకోవడంవల్ల ఆయా సామాజిక సమూహాలకేకాక, మొత్తం సమాజానికీ నష్టం జరుగుతోంది. అణగారిన అస్తిత్వ ఉద్యమాలు అత్యంత సమర్థనీయమైనవి, అనివార్యమైనవీను. ఆ పేరుతో పాలక వర్గ కూటమిలో స్థానం కోసం పాకులాడే కొందరు అస్తిత్వ వాద నాయకులు తమ నిజ అస్తిత్వాల (సంప్రదాయక వృత్తుల్లోని + శ్రామిక ప్రజలు) ప్రజానీకానికి తీవ్ర ద్రోహం చేస్తున్నారు. ‘బుద్ధుడు, ఆయన ధర్మం’, ‘ప్రాచీన భారతంలో విప్లవం, ప్రతి విప్లవం’ అనే నవయాన బౌద్ధ మూల గ్రంథాల్లో బుద్ధుడు బోధించిన సామాజిక విప్లవం, విముక్తి గురించి అంబేడ్కర్ వివరించారు. వాటిలో ఆయన బౌద్ధం సాధించిన సామాజిక విప్లవాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావిస్తాడు గానీ, దాని దార్శనిక తోడ్పాటును అసలు గుర్తించనేలేదు. ప్రతీత్య సముత్పాదం, నాగార్జునుని శూన్యవాదం వంటి బౌద్ధ తత్వవేత్తల దార్శనిక కృషిని, వైజ్ఞానిక కృషిని అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టి ఉంటే అంబేద్కర్ ఈ దేశానికి మరొక గొప్ప ఆధ్యాత్మిక అస్త్రాన్ని అందించగలిగి ఉండేవాడు. ఈ నేపథ్యంలో రెండు విషయాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకటి-.. బౌద్ధీయ తాత్వికత అయిన ప్రతీత్య సముత్పాదమనే విచ్ఛిన్న ప్రవాహ గతి తర్కాన్ని కూలంకషంగా అవగాహన చేసుకోవడం. రెండు.. శకల మతవాదమైన కుల అస్తిత్వవాద దృక్పథాలకు పరిమితం కాకుండా సామాజిక సమానత్వం, వర్గ పోరాటం అనే భావనల పునాదిగా రూపొందిన మలి అంబేడ్కర్ దృక్పథాన్ని ఆకళింపు చేసుకునేందుకు కృషి చేయడం, ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనే మలి అంబేడ్కరిజం వైఖరితో అస్తిత్వ ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

వెన్నెలకంటి రామారావు

(నేడు అంబేడ్కర్ జయంతి)

Updated Date - 2020-04-14T05:47:23+05:30 IST