కాంగ్రెస్ కింకర్తవ్యం?

ABN , First Publish Date - 2020-03-13T07:00:45+05:30 IST

ఆశాజనకంగా కన్పించని భవిష్యత్తుకు సంసిద్ధమవ్వడం ఎలా? ఆత్మశోధనే తొలి అడుగు. 2019 సార్వత్రక ఎన్నికలలో పరాజయం అనంతరం కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం (సిడబ్ల్యుసి) సమావేశంలో...

కాంగ్రెస్ కింకర్తవ్యం?

సార్వత్రక, శాసనసభా ఎన్నికలలో ఘన విజయాలు, కీలక వైఫల్యాలతో రాటు దేలిన బీజేపీతో సమర్థంగా పోటీ పడేలా పార్టీని సంపూర్ణంగా పునర్నిర్మించడం కాంగ్రెస్ ముందున్న తక్షణ కర్త్యవం. కాంగ్రెస్ పునర్వైభవానికి ఆవశ్యకమైన నాయకత్వ పటిమ ఉన్న జ్యోతిరాదిత్య సింధియా లాంటి నేతలు ప్రత్యర్థి పార్టీ పంచన చేరవలసి రావడానికి బాధ్యులు ఎవరో స్పష్టమే. జరిగిన తప్పును సరిదిద్దుకోకపోతే, యుద్ధం చేయవచ్చే వేళ యోధులు ఎవరైనా కాంగ్రెస్‌లో మిగులుతారా?


ఆశాజనకంగా కన్పించని భవిష్యత్తుకు సంసిద్ధమవ్వడం ఎలా? ఆత్మశోధనే తొలి అడుగు. 2019 సార్వత్రక ఎన్నికలలో పరాజయం అనంతరం కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం (సిడబ్ల్యుసి) సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. బీజేపీ లాంటి 21వ శతాబ్ది రాజకీయ మహాశక్తిని ఢీ కొని దిగ్విజయం సాధించేందుకు కాంగ్రెస్ తొలుత ఆత్మశోధన చేసుకోవలసివుందని సింధియా స్పష్టంచేశారు. పార్టీని రక్షించుకోవడంలో ఈ యువనేత తాపత్రయాన్ని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం‍ పట్టించుకోలేదు. మూకీ భావం వహించింది. తొమ్మిది నెలల అనంతరం ఆ మౌనానికి దిగ్భ్రాంతికరమైన అంతరాయం కలిగింది. పార్టీ నుంచి సింధియా నిష్క్రమించారు. బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఉద్దేశించిన ఒక పకడ్బందీ పథకంలో భాగంగానే గ్వాలియర్ యువ మహారాజా తన విధేయతను మార్చుకున్నారని ప్రజలు భావించడంలో ఆశ్చర్యమేముంది?


భావజాల నిబద్ధతను నిమజ్జనం చేసిన వర్తమాన రాజకీయాల తీరుతెన్నులకు మరొక ఉదాహరణగా సింధియా పరిణామాన్ని పరిగణించడం సులువే. ఎందుకంటే ఈ రోజు హిందూత్వ ఎజెండాను వ్యతిరేకిస్తున్న ‘లౌకిక’ యోధులే మరుసటి రోజు బీజేపీ మద్దతుదారులై అధికార తాయిలాలు అందుకుంటున్నారు! మనం ఇప్పటికే మహారాష్ట్రలో ఒక విచిత్ర అధికార సంకీర్ణాన్ని చూస్తున్నాం. సైద్ధాంతికంగా పొసగని కాంగ్రెస్, శివసేనలు ఒకే పక్షాన ఉండడాన్ని సాధ్యం చేసిన రాజకీయ ఏర్పాటు విచిత్రమైనదిగాక మరేమవుతుంది? అధికార వైభోగాల ఆరాటంలో ‘మత ప్రమేయం లేని’ రాజకీయాలూ కళంకితమవుతున్నాయి. ఆదర్శాలు అస్పష్టమవుతున్నప్పుడు జీవిత వాస్తవాలు వెలుగులు విరజిమ్ముతాయా? ఇంకా ఐదు పదుల వయస్సుకు చేరని యువ రాజకీయ వేత్త, రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో తనకు సముచిత స్థానాన్ని కల్పించడానికి, నమ్ముకున్న పార్టీ ఎంతకూ నిరాకరిస్తున్నప్పుడు, ఆహ్వానిస్తున్న అవకాశాలను ఎలా తిరస్కరిస్తాడు? 2019 లోక్‌సభ ఎన్నికలలో జ్యోతిరాదిత్య జయకేతనం ఎగురవేయలేక పోయారు. అంతకు ముందటి సంవత్పరం మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఆయనకు రాకుండా చేశారు. తస్మదీయులతో చేరితే కేంద్ర మంత్రిపదవి ఖాయంగా దక్కనున్నప్పుడు దురాకర్షణకు లోనుకాకుండా ఎవరు ఉండగలరు?


కాంగ్రెస్‌లోని ఆగామి తరం నేతలలో అగ్రగణ్యుడు ఆకస్మికంగా పార్టీ మారాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి అతని అధికార లాలసే కారణమా? సత్యమేమిటంటే, అంతర్గతంగా కూలిపోతున్న కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిని సింధియా నిష్క్రమణ ప్రతిబింబించింది. 2014 సార్వత్రక సమరంలో కాంగ్రెస్ ఓటమి ఊహించినిదే. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం ఒక ప్రభావశీల రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పతనానికి తార్కాణమయింది. గత సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య 192 నియోజక వర్గాలలో ముఖాముఖి పోటీ జరగగా కమలనాథులు దాదాపు 175 నియోజకవర్గాలలో 23 శాతం సగటు మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. ఇటీవల ఢిల్లీ విధానసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 66 మంది అభ్యర్థులలో కేవలం ముగ్గురు మాత్రమే తమ డిపాజిట్‌ను కాపాడుకోగలిగారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.


ఈ పరాభవాలకు కాంగ్రెస్ ఎలా ప్రతిస్పందించింది? పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నించిందా? లేదు. సైద్ధాంతిక స్పష్టతను సాధించేందుకు పూనుకున్నదా? అసలే లేదు. కొత్త ఆలోచనలను స్వాగతించిందా? యువ శ్రేణుల ప్రతిభా పాటవాలను ఉపయోగించుకునేందుకు ఉద్యుక్తమయిందా? ఈ ప్రశ్నలు అడిగి ప్రయోజనం లేదు కదా. 2014 ఓటమి అనంతరం పార్టీని సంస్థాగతంగా సంస్కరించేందుకు చిత్తశుద్ధితో ఒక్క ప్రయత్నమూ జరగలేదు. ‘నామినేషన్’ సంస్కృతిని అంతమొందించలేదు. మరి పార్టీ అధినేతలతో సాన్నిహిత్యమే పదవీ భాగ్యానికి అర్హతగా కొనసాగుతున్నప్పుడు యువనేతలలో అసంతృప్తి నెలకొనడం అనివార్యం కాకుండా ఎలా వుంటుంది? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి చివరిసారి ఎన్నికలు జరిగిందెప్పుడు? రెండు దశాబ్దాల క్రితమే కాదూ? ఫలితంగానే నాయకులకు పదవీ విరమణ వయస్సు నిబంధన అనేది లేకుండా పోయింది. కాబట్టే 92 ఏళ్ళ వృద్ధుడు మోతీలాల్ వోరా సైతం మళ్ళీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు! ఆయన రాజభక్తి అచంచలమైనది. నిజమే. అయితే మారుతున్న రాజకీయ వాస్తవాలలో ఆయన ఉపయుక్తత ఏమిటి?


ఉన్న మాట చెప్పాలంటే పార్టీ ప్రస్తుత నాయకత్వమే కాంగ్రెస్ సమస్య. 2019 మేలో రాహుల్ గాంధీ ఆగ్రహంతోనో లేదా అలసిపోయో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. 2019 ఆగస్టులో రాహుల్ స్థానంలో సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇది విశదం చేస్తున్నదేమిటి? సంవత్సరాలుగా పార్టీలో పాదుకుపోయిన వారు, ప్రథమ కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరినీ నాయకులుగా అంగీకరించేందుకు సిద్ధంగా లేరన్న సత్యాన్నే కాదూ? వేరేవారు ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్షులయితే పార్టీలో తమకుగానీ, అసలు పార్టీకిగానీ జీవితమే లేదని వారు విశ్వసిస్తున్నారు మరి. ప్రశాంత పరిస్థితులు ఉన్న కాలంలో పార్టీని సమైక్యంగా నడపడంలో నెహ్రూ–-గాంధీ కుటుంబం ప్రశంసనీయంగా వ్యవహరించిందనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. సంక్లిష్టతల నడుమ పార్టీకి సమర్థ సారథ్యం వహించగల రాజకీయ దక్షత, నైతిక అర్హత ఆ ప్రథమ కుటుంబానికి కొరవడ్డాయి. తత్ఫలితంగానే కాంగ్రెస్ కృశించిపోతోంది. ‘సర్వాంతర్యామి’అయిన పార్టీ అధిష్ఠాన వర్గానికి కింది స్థాయి కార్యకర్తలతోనే కాదు, పై స్థాయి నాయకత్వ శ్రేణులతో కూడా ఉండవలసిన సంబంధాలు లేకుండా పోయాయి!


మధ్యప్రదేశ్ వ్యవహారాలే ఇందుకొక ఉదాహరణ. ఆ రాష్ట్రంలో కమల్‌నాథ్ ముఖ్యమంత్రేకాదు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా. గతంలో రెండు మార్లు ముఖ్యమంత్రిగా వున్న దిగ్విజయ్ సింగ్ అభిజాత్యం చూపకుండా ఎలా వుంటారు? మొత్తం మీద రాష్ట్రంలో అధికార పీఠాలన్నిటినీ పాతతరం నాయకులే స్వాయత్తం చేసుకున్నారు. మరి మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్ళ అనంతరం కాంగ్రెస్ మళ్ళీ అధికారానికి రావడంలో కీలక పాత్ర వహించిన జ్యోతిరాదిత్య ఈ పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో నలిగిపోయారు. యువనేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉపేక్ష వహించింది. వృద్ధనాయకులకే అన్ని బాధ్యతలూ అప్పగించింది. తన ‘స్నేహితుడు’ రాహుల్ గాంధీ తన పక్షాన నిలబడతారని జ్యోతిరాదిత్య ఆశించారు. ఆయన ఆశలు వమ్మయ్యాయి. పార్టీ కేంద్ర స్థాయిలో నాయకత్వ శూన్యంతో వ్యవహారాలు గతి తప్పాయి. వృద్ధ, యువనేతల మధ్య రాజీ అసాధ్యమైపోయింది. తత్ఫలితమే జ్యోతిరాదిత్య నిష్క్రమణ. కాంగ్రెస్ అధికారంలో వున్న రాజస్థాన్‌లో వ్యవహారాలూ మధ్య ప్రదేశ్‌కు భిన్నంగా లేవు. అక్కడ కూడా ఆగామి తరం నేత సచిన్ పైలట్‌కు ప్రాధాన్యం ఇవ్వక, వృద్ధనేత అశోక్ గెహ్లాట్‌కే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. 


గతతరాల కాంగ్రెస్ నాయకులకు కింది స్థాయి కార్యకర్తలతో గట్టి సంబంధాలు వుండేవి. ప్రజలతో మమేకత వుండేది. సింధియా, పైలట్ లాంటి నేటి యువనేతలకు ప్రజలతో గానీ, పార్టీ శ్రేణులతో గానీ అటువంటి అనుబంధాలు ఉన్నవారు కాదనే అభిప్రాయం ఒకటి వున్నది. వ్యక్తిగత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఓట్లను సాధించగల సామర్థ్యం వారికిలేదనే వాదన కూడా వున్నది. కుటుంబ వారసత్వం కారణంగానే ఇరువురూ చిన్నవయస్సులోనే ఉన్నతస్థాయికి వచ్చారు. కేంద్ర మంత్రులయ్యారు. వారి తరంలో ఎవరికీ లభించని అవకాశాలు వారికి దక్కాయి. అయితే వర్తమాన రాజకీయాలకు అవసరమైన విశిష్ట గుణాలు వారికి వున్నాయి. ఇరువురూ యువకులు, విద్యాధికులు. శక్తిమంతులు. దీక్షా దక్షతలు వున్నవారు. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పగల సమర్థులు. ఒక్కమాటలో చెప్పాలంటే యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని అర్హతలూ వారికి వున్నాయి. ఇటువంటి జనాకర్షక యువ నేతలు కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా అవసరం. ఎందుకంటే సార్వత్రక, శాసనసభా ఎన్నికలలో ఘన విజయాలు, కీలక వైఫల్యాలతో రాటు దేలిన బీజేపీతో సమర్థంగా పోటీపడేలా పార్టీని సంపూర్ణంగా పునర్నిర్మించడం కాంగ్రెస్ తక్షణ కర్త్యవం. కాంగ్రెస్ పునర్వైభవానికి ఆవశ్యకమైన నాయకత్వ పటిమ ఉన్న జ్యోతిరాదిత్య సింధియా లాంటి నేతలు ప్రత్యర్థి పార్టీ పంచన చేరవలసి రావడానికి బాధ్యులు ఎవరు? సమాధానం స్పష్టమే. ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దుకోకపోతే యుద్ధం చేయవచ్చే వేళ యోధులు ఎవరైనా కాంగ్రెస్‌లో మిగులుతారా?


తాజా కలం: చరిత్ర గతిలో కొన్ని అప్రధాన విషయాలకూ ప్రాధాన్యం లభిస్తుంది. విజయరాజె సింధియా 1967లో భారతీయ జనసంఘ్‌లో చేరే ముందు భారత జాతీయ కాంగ్రెస్‌లో వుండేవారు. జనసంఘ్‌లో చేరి మధ్యప్రదేశ్‌లో ద్వారాకా ప్రసాద్ మిశ్రా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తోడ్పడ్డారు. యాభై మూడు సంవత్సరాల అనంతరం ఆమె మనుమడి రూపంలో చరిత్ర తనను తాను పునరావృతం చేసుకొంటోంది!

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-03-13T07:00:45+05:30 IST