మానవవాద రాజకీయ –తెలుగు నేల

ABN , First Publish Date - 2020-03-21T06:06:46+05:30 IST

రాయ్ మేధస్సు పట్ల ఆకర్షితుడైన ఆంధ్ర యూనివర్సిటీ వైస్– ఛాన్సలర్‌ కట్టమంచి రామలింగారెడ్డి ఆయన్ను ప్రొఫెసర్‌గా వుండమని యూనివర్సిటీకి ఆహ్వానించారు. రాయ్ నవ్వుతూ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

మానవవాద రాజకీయ –తెలుగు నేల

రాయ్ మేధస్సు పట్ల ఆకర్షితుడైన ఆంధ్ర యూనివర్సిటీ వైస్– ఛాన్సలర్‌ కట్టమంచి రామలింగారెడ్డి ఆయన్ను ప్రొఫెసర్‌గా వుండమని యూనివర్సిటీకి ఆహ్వానించారు. రాయ్ నవ్వుతూ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. విశాఖ సముద్ర బీచ్‌లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సభలో రాయ్‌ ప్రసంగించారు. సభను నిర్వహించిన విద్యార్థుల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి వుండడం విశేషం. పార్వతీపురం ప్రాంతంలో రాయ్ భావ ప్రభావానికి లోనైన వారిలో చీకటి పరశురాం నాయుడు వున్నారు. ఆయన తన మనమడికి రాయ్ అని పేరు పెట్టడం గమనార్హం. నేడు అతను ఆంధ్ర హైకోర్టులో న్యాయమూర్తిగా వున్నారు. 


కాంగ్రెస్‌ మహాసభలు 1936లో మహారాష్ట్రలోని ఫైజ్‌పూర్ గ్రామంలో జరిగాయి. ఆ సభలకు తొలిసారిగా, అప్పుడే ఆరేళ్ళ జైలు జీవితం నుండి బయటపడిన ఎం.ఎన్.రాయ్ (మానవేంద్రనాథ్ రాయ్) వచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా జైలు శిక్ష అనుభవించి వచ్చిన రాయ్ ఒక కొత్త, వింత ప్రతినిధిగా వున్నాడు. ఆయన పేరు వినడమే గాని వివరాలు తెలియని రోజులవి. 

ఆంధ్ర నుండి వెళ్ళిన ప్రతినిధులలో వెన్నెలకంటి రాఘవయ్య, కాకినాడ నుండి ములుకుట్ల వెంకటశాస్త్రి వున్నారు. రాఘవయ్యను గిరిజన గాంధీ అనేవారు. ఆయన పరిశోధనా రచనలు వెలువరించారు, కాంగ్రెస్‌లో సోషలిస్టు భావాలు గల వారితో వున్నారు. ములుకుట్ల వెంకట శాస్త్రి కాకినాడలో అడ్వొకేట్‌గా వుంటూ, మద్రాసు నుండి కుందూరి ఈశ్వర దత్ నడిపే లీడర్ పత్రిక ప్రతినిధిగా సభలకు వెళ్ళారు.


ఫైజ్‌పూర్ కాంగ్రెస్ సభలలో తొలిసారి ఎం.ఎన్.రాయ్ మాట్లాడడం కాంగ్రెస్ సోషలిస్టులను విశేషంగా ఆకట్టుకున్నది. ప్రసంగం అనంతరం ఆయన్ను కలిసి ఆంధ్రకు రావలసిందిగా వెన్నెలకంటి రాఘవయ్య ఆహ్వానించారు, దక్షిణ భారత వ్యవసాయ కార్మికుల సభను ప్రారంభించమని కోరారు. రాయ్ అంగీకరించారు. తరువాత కాకినాడ రమ్మని ములుకుట్ల వెంకటశాస్త్రి అర్థించారు. వారి కోరిక ప్రకారం రాయ్ వచ్చారు. ఫైజ్ పూర్ కాంగ్రెస్ సభలలో మరో విశేషం గాంధీ-–రాయ్ కలసి మాట్లాడుకోవడం. రాయ్ చెప్పినదంతా విన్న గాంధీ ఆయన్ను కాంగ్రెస్‌లో మౌనంగా సేవ చేయమని కోరాడు. అంటే రాయ్ భావాలతో ఏమాత్రం అంగీకరించలేదన్నమాట. అంతే ఆ తరువాత వారెప్పుడూ కలవలేదు! నెహ్రూ మాత్రం రాయ్‌ని తన ఇంటికి ఆహ్వానించడం, వారిరువురూ మిత్రులుగా కొనసాగడం ఒక పరిణామం.

ఎం.ఎన్. రాయ్‌ 1937లో నెల్లూరు ప్రాంతాలలో పర్యటించారు. వెన్నెలకంటి రాఘవయ్య ఆయన వెంట వుండి పర్యటన ఏర్పాట్లు చూసారు. ఆనాడు కొంతకాలం రాయ్ ఖాదీ ధరించి, ఖద్దరు టోపీ పెట్టాడు. నెల్లూరు, కావలి, చంద్రగిరి, తిరుపతి ప్రాంతాలలో వెన్నెలకంటి రాఘవయ్య ఏర్పాటు చేసిన సభలలో రాయ్ ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. రాయ్ తొలి ఆంధ్రపర్యటన వివరాలు, ఫొటోలు నాడు మద్రాసు నుండి వెలువడే ఆంధ్రపత్రికలో వివరంగా ప్రచురించారు. స్థానిక వార, పక్ష పత్రికలు కొన్ని కూడా ప్రచురించాయి. జమీన్ రైతు నెల్లూరు వెంకట్రామానాయుడు సంపాదకత్వాన వెలువడినా, వెన్నెలకంటి రాఘవయ్యకు ప్రత్యర్థి కావడం వలన వార్తా వివరాలు రాయలేదు! రాయ్ నెల్లూరు పర్యటన జరుగుతుండగా, ఆయనకు జబ్బు చేసింది. ఈ విషయం తెలిసి, తక్షణమే ములుకుట్ల వెంకటశాస్త్రి కాకినాడ నుండి వచ్చి రాయ్‌ని కాకినాడ తీసుకెళ్ళి చికిత్స చేయించారు. కుదుటపడగానే, వారు విశాఖపట్టణం వెళ్ళారు.


అది ఒక గొప్ప దశ. చెప్పుకోదగిన మార్పులన్నింటికీ విశాఖ నాంది పలికింది. ఎం.ఎన్. రాయ్‌ని విశాఖపట్టణం తీసుకు రావలసిందిగా అబ్బూరి రామకృష్ణారావు ఎం.వి. శాస్త్రికి కబురు చేశారు.  అబ్బూరి ఆంధ్రయూనివర్సిటీ లైబ్రేరియన్‌గా, నాటకరంగ పరిశోధకుడుగా వున్నారు. ఆయన కోరిక మేరకు ఎం.ఎన్.రాయ్‌ని వెంటబెట్టుకొని ఎం.వి.శాస్త్రి వైజాగ్ వచ్చారు. తొలుత వారికి స్వాగతం పలికినవారిలో అబ్బూరి వరద రాజేశ్వరరావు, అత్తలూరి నరసింహారావు, పి.హెచ్. గుప్త, అబ్బూరి గోపాలకృష్ణ వున్నారు. విశాఖలోని మహారాణి పేటలో పి.హెచ్. గుప్త నివశిస్తున్నారు. ఆయన ఇల్లు సముద్రపు ఒడ్డున వున్నది. ఆ వాతావరణం రాయ్‌కి సరిపడుతుందని అక్కడ పెట్టారు. నాడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్– ఛాన్సలర్‌గా వున్న కట్టమంచి రామలింగారెడ్డికి రాయ్‌ని పరిచయం చేయడంలో అబ్బూరి కీలక పాత్ర వహించారు. రాయ్ మేధస్సు పట్ల ఆకర్షితుడైన కట్టమంచి ఆయన్ను ప్రొఫెసర్‌గా వుండమని యూనివర్సిటీకి ఆహ్వానించారు. రాయ్ నవ్వుతూ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి, ధన్యవాదాలు చెప్పారు. ఆ తరువాత కాలంలో వారిరువురూ మంచి స్నేహితులయ్యారు. జైలు నుండి రాయ్ రాసిన ఉత్తరాలు చదివి కట్టమంచి ఆకర్షితుడై చక్కని ఉపోద్ఘాతం రాశారు. అది గ్రంథంగా వెలువడింది. విశాఖలో విద్యార్థులు కొందరు రాయ్ పట్ల బాగా ఆకర్షితులై, తమ కళాశాలలో ప్రసంగించమని కోరారు. విశాఖ సముద్ర బీచ్‌లో సభను ఏర్పరచారు. కాలేజీ ప్రిన్సిపాల్ గాంధేయుడు కావడంతో రాయ్ ప్రసంగం ఏర్పాటును వ్యతిరేకించాడు. అయినా పట్టుదలతో విద్యార్థులు సభ నిర్వహించారు. వారిలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి వుండడం చరిత్ర. ఆయన తన డైరీలో రాయ్‌తో తన పరిచయం, ప్రభావం గురించి వివరంగా రాశారు.


విజయనగరం నుండి తాతా దేవకీనందన్ తొలుత రాయ్‌కి సన్నిహితులయ్యారు. ఉత్తరోత్తరా ఆయన విజయనగరం ఛైర్మన్ అయ్యారు. నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికుల సంఘం పెమ్మరాజు వెంకట్రావు నాయకత్వాన రాయ్ భావాలకు తగ్గట్టుగా సమ్మెలు నడిపారు. పార్వతీపురం ప్రాంతంలో రాయ్ భావ ప్రభావానికి లోనైన వారిలో చీకటి పరశురాం నాయుడు వున్నారు. ఆయన తన మనమడికి రాయ్ అని పేరు పెట్టారు. నేడు ఈయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా వున్నారు. ఎం.ఎన్‌.రాయ్ ప్రారంభించిన ఇండిపెండెంట్ ఇండియా పత్రికను తెప్పించి, బాగా ప్రచారం చేసిన వారిలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి వున్నారు. ఇదంతా ఎం.ఎన్.రాయ్ తొలి పర్యటన సంవత్సరాల చరిత్ర. ఆ విధంగా ఆంధ్రలో రాయ్ మానవవాద యాత్ర సాగింది. అప్పుడే తణుకు నుండి కె.పి.ఎన్. రాజు పెద్ద ఊరేగింపు ఏర్పరచి, రాయ్‌ని వూరేగించారు. ఖద్దరు వేషంలో రాయ్ ప్రధాన ఆకర్షితుడుగా ప్రసంగాలు చేశారు. 1938 నాటి గాథయిది. తెలుగువారితో ఆరంభమైన ఎం.ఎన్.రాయ్ మానవవాద వుద్యమం ఆ తరువాత ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఇది తొలి గాథ. ఇప్పుడది చరిత్ర! 


నరిశెట్టి ఇన్నయ్య

(నేడు మానవేంద్ర నాథ్ రాయ్ జయంతి)

Updated Date - 2020-03-21T06:06:46+05:30 IST