కమ్యూనిస్టు యోధుడు జంపాల

ABN , First Publish Date - 2020-10-27T05:42:54+05:30 IST

సాధారణ కమ్యూనిస్టు రాజకీయాల నుండి విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల వరకు నడక సాగించిన కష్టజీవి కామ్రేడ్ జంపాల రామచంద్రయ్య...

కమ్యూనిస్టు యోధుడు జంపాల

సాధారణ కమ్యూనిస్టు రాజకీయాల నుండి విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల వరకు నడక సాగించిన కష్టజీవి కామ్రేడ్ జంపాల రామచంద్రయ్య. నిరాడంబర జీవితం, నిలువెత్తు త్యాగం ఆయన సొంతం. కష్టజీవిగా పుట్టి కమ్యూనిస్టుగా పెరిగిన జంపాల తుదిశ్వాస వరకు పంచకట్టును వదలలేదు. -కమ్యూనిజాన్ని వీడలేదు. ఆదివాసీ బడుగు బలహీనవర్గాల మధ్యనే జీవిస్తూ వారిలో పోరాట చైతన్యం నింపుతూ, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రరాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి, మద్దికాయల ఓంకార్‌లను ఆదర్శంగా తీసుకొని గాడితప్పని పోరాట జీవితాన్ని కొనసాగించారు. ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, పోచారం గ్రామంలో జంపాల రామచంద్రయ్య 1938లో జన్మించారు. ఆనాడు పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో గడీల పాలన సాగుతుండేది. జీతగాళ్ళు, పాలేర్ల రూపంలో శ్రమ దోపిడీ, వెట్టి చాకిరీ అమలవుతుండేది.


జంపాల సహచరులతో కలసి భారత కమ్యూనిస్టు - మార్క్సిస్టు (సిపిఎం) పార్టీ శాఖను ఆ గ్రామంలో స్థాపించి భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారు. అక్కడి దొరలు జంపాల సహా అయన సహచరులు ఇరవై నాలుగుమందిపై తల్లంపాడు పోలీసు స్టేషన్లో అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారు. వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీలో గుమస్తాగా పనిచేస్తున్న జంపాల రామచంద్రయ్యపై కక్ష గట్టిన దొరలు ఆయన ఉద్యోగాన్ని ఊడబీకించి ఉపాధిని దెబ్బతీశారు. రామచంద్రయ్యకు చెందిన పచ్చని పంట చేలకు కోలుకోలేని నష్టం కలిగించారు. ఆర్థిక బాధలు, కక్షలు, కార్పణ్యాలతో జంపాల కుటుంబ పరిస్థితి దినదినగండంగా మారింది. జీవనోపాధి కొరకు కుటుంబం సహా 1989లో పోచారం నుండి గార్ల మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామమైన శేరిపురం గ్రామా నికి నివాసాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత జంపాల ఎదిగొచ్చిన ముగ్గురు కొడుకులతో సహా భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ)లో చేరి తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించారు. శేరిపురం పరిసర గ్రామాలు, తండాల్లో మంగలి కులవృత్తి చేసుకుంటూనే కమ్యూనిస్టు కార్యకర్తగా గిరిజన ప్రజల పెద్ద దిక్కుగా నిలిచాడు. రామచంద్రయ్య సీపీఐ లో కొనసాగుతున్నప్పటికీ విప్లవ రాజకీయాలపై, విప్లవనేతలపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపేవారు. అన్నల ఆకలి బాధలు తీర్చి వారి పోరాటంలో భాగమైనారు. ఆరుపదుల వయస్సులో జంపాల దంపతులిద్దరూ జొన్నరొట్టెలను మూటకట్టుకొని డెబ్బై కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఒక విప్లవ అగ్రనేతను కళ్లారా చూసి ఆనందించి, ఆ సభలో పాల్గొని విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు కార్యకర్తగా సీమాంధ్ర దోపిడీ విధానాలను ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఆవశ్యకతను ఆదివాసీ పల్లెల్లో విస్తృతంగా ప్రాచారం చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జరిగిన తెలంగాణ ఉద్యమ సభలకు సద్దిమూట గట్టుకొని హాజరయ్యేవారు. జంపాల రామచంద్రయ్య ఊపిరితిత్తుల వ్యాధితో ఈనెల 18న మరణించారు. తమ కుమారులను కమ్యూనిస్టు పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమాలకు అంకితం చేసిన కామ్రేడ్ జంపాల రామచంద్రయ్య, దరగమ్మ దంపతులు ధన్యజీవులు. 

(రేపు మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, శేరిపురం గ్రామంలో జంపాల రామచంద్రయ్య సంస్మరణ సభ) 

 జంపాల విశ్వ 

రాష్ట్ర ఉపాధ్యక్షులు, 

తెలంగాణ విద్యావంతుల వేదిక

Updated Date - 2020-10-27T05:42:54+05:30 IST