మరో ముప్పయ్యేళ్లు ‘ఊ’ కొడదాం!

ABN , First Publish Date - 2020-12-20T06:01:15+05:30 IST

విమర్శలు, విసుర్ల మాట ఎలా ఉన్నా ఈ సంకలనాలు తెలుగు కథకు కొత్త ఊపును, సరికొత్త చూపును తీసుకొచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. ఏవో పత్రికల్లో, ఎప్పుడో ప్రచురితమైన కథను ఓసారి చదువుకుని, కాసేపు మాట్లాడుకుని...

మరో ముప్పయ్యేళ్లు ‘ఊ’ కొడదాం!

విమర్శలు, విసుర్ల మాట ఎలా ఉన్నా ఈ సంకలనాలు తెలుగు కథకు కొత్త ఊపును, సరికొత్త చూపును తీసుకొచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. ఏవో పత్రికల్లో, ఎప్పుడో ప్రచురితమైన కథను ఓసారి చదువుకుని, కాసేపు మాట్లాడుకుని మర్చిపోయే ఒక స్థాయి పాఠకుల్లో బాధ్యతాయుతమైన చర్చకు తెరతీశాయి. మామూలు పాఠకులు సైతం కథ పట్ల ఒక అంచనాకు, అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడింది.


మీరురోజుకి ఎన్ని పత్రికలు చదువుతారు? పోనీ, వారానికి ఎన్ని? రెండు, మూడు.. మహా అయితే నాలుగో, అయిదో; అంతేగా? అవైనా నిజంగా చదువుతారా? నిష్టూరంగా ఉన్నా, నిజం చెప్పాలంటే చదవరు. ఓసారి తిరగేస్తారు. బొమ్మలు ఆకట్టుకుంటేనో; సీనియర్ లేదా తెలిసిన రచయిత పేరు కనిపిస్తే.. ఆ కథ చదువుతారు. అప్పుడు కూడా ఆ కథ ఎన్ని పేజీలు ఉందో చూసుకుని, సమయం అనుకూలిస్తే చదువుతారు. లేదంటే, చదవాల్సిన కథలు, పుస్తకాల చేంతాడు జాబితాలో కలిపేస్తారు. అలా మన దృష్టి కోణం నుంచి జారిపోయే రచనల్లో ఆణిముత్యాల్లాంటివి చాలానే ఉంటాయి. వాటిని వెలికి తీసి, మన దోసిట్లో ధారపోయడానికే కథాసాహితి ముందుకొచ్చింది. ఇదేదో- నిన్న, ఇవాళ మొదలైన వ్యవహారం కాదు. ఒకటో, రెండో కాదు; పోనీ పదో, ఇరవయ్యో కూడా కాదు. ముప్పయ్యేళ్ల కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష, మొండి పట్టుదల ఓ ఇద్దరిని ముందుకు నడిపించాయి. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్- ఈ నిరంతర ఉత్తమ కథల సంకలనాల ప్రచురణకు కర్త, కర్మ, క్రియ.


అయితే, ఇన్నేళ్ల నుంచీ వీరు ఎంపిక చేసినవన్నీ ఉత్తమ కథలేనా?

ఉత్తమం అంటే ఏమిటి? ఏయే ప్రమాణాలతో దేన్నయినా ఉత్తమమైనదిగా ప్రకటించగలం? ఆయా వ్యక్తుల భావజాలం, అభిప్రాయాలు, భావోద్వేగాలతోపాటు, అప్పటి సామాజిక సందర్భాల మాటేమిటి? వర్తమాన పరిస్థితుల ప్రభావం సంగతి? ఇలా ఎన్నో, ఎన్నెన్నో అంశాలు ‘ఉత్తమం’ అనే మాట చుట్టూ మోహరించి ఉంటాయి. ఆ పరిధులను సాధ్యమైనంత విశాలం చేసుకుంటూ, విస్తృతమైన అధ్యయనంతో, నిజాయితీ అయిన చర్చలతో ఎంపిక జరిగితే అది పది కాలాలపాటు ‘ఉత్తమం’ అనే జెండాను మోయగలుగుతుంది. మూడు దశాబ్దాల నుంచి నిరాటంకంగా సాగుతున్న కథ సంకలనాల్లోని కథల ఎంపిక వెనుక అటువంటి కృషి ఉందని గట్టిగానే చెప్పొచ్చు.


అంత కచ్చితంగా చెప్పగలగడానికి ఒక కారణం ఆ కథలకు లభించిన పాఠకాదరణ అయితే; ముప్పయ్యేళ్ల వయసు కలిగిన ఈ ‘కథ’తో నా అనుబంధం పాతికేళ్లు కావడం మరో కారణం. కొన్ని సంకలనాలకు ప్రూఫ్‌రీడింగ్ సహకారం అందించడం ద్వారా, కథలపై వాడి, వేడిగా సాగిన చర్చల్లో మౌన ప్రేక్షకుడిగా ఉండటం ద్వారా- ఎన్నో పుస్తకాలు చదివితే తప్ప తెలుసుకోలేని కథ గురించిన అంశాలను ఆకళింపు చేసుకునే అవకాశం లభించింది.


సుమారు గత దశాబ్ద కాలంగా కాస్త ఒత్తిడి తగ్గిందేమోగానీ, అంతకుముందు తీవ్ర యుద్ధాలే జరుగుతుండేవి. అవి వ్యక్తిగత నిందలకు అతీతం కాదు. కొంతమంది ఎంపికైన కథలు ఉత్తమమైనవే అంటూ, మరికొన్ని ఉత్తమమైన కథలను వదిలేశారని విమర్శలు సంధించేవారు. ఇంకొందరు ‘ఇవే ఉత్తమ కథలని ఎలా చెబుతారు?’ అని నిలదీసేవారు. ఇటువంటి విమర్శల ఒత్తిడికి తాళలేకే -కొన్ని సంకలనాలకు-తమ ట్యాగ్‌లైన్‌లోంచి ‘ఉత్తమ’ అనే మాటను తొలగించారు. తర్వాతెప్పుడో మళ్లీ జత చేశారు. ఆ తర్వాత ఎప్పటి నుంచో తాము చేర్చలేకపోయిన ‘మంచి కథ’ల జాబితా కూడా ఇవ్వడం మొదలెట్టారు.


‘ఉత్తమం’ అనే మాట ఉంచితేనేం, తీసేస్తేనేం? మళ్లీ అదే ప్రశ్న ఈ సంకలనాలకు ఎంపికైనవే ఉత్తమ కథలా?

విమర్శలు, విసుర్ల మాట ఎలా ఉన్నా ఈ సంకలనాలు తెలుగు కథకు కొత్త ఊపును, సరికొత్త చూపును తీసుకొచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. ఏవో పత్రికల్లో, ఎప్పుడో ప్రచురితమైన కథను ఓసారి చదువుకుని, కాసేపు మాట్లాడుకుని మర్చిపోయే ఒక స్థాయి పాఠకుల్లో బాధ్యతాయుతమైన చర్చకు తెరతీశాయి. మామూలు పాఠకులు సైతం కథ పట్ల ఒక అంచనాకు, అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడింది. ఇక సీరియస్ విమర్శకులైతే లోతైన విశ్లేషణలే చేశారు. దీంతో ఈ కథ సంకలనాలు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయేవి. కేవలం ఆవిష్కరణ సభల్లోనే నాలుగొందలకు పైగా కాపీలు అమ్ముడైన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2008, 2014లో వెలువడిన సంకలనాలు, అవే సంవత్సరాల్లో రీప్రింట్‌కు కూడా వెళ్లాయంటే వీటికి ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. ఒకరకంగా మంచి కథకు -మంచి మార్కెట్‌ను సృష్టించినవి కూడా ఈ కథ సంకలనాలే అంటే అతిశయోక్తి కాదు. వీటికి లభించిన ఆదరణ చూసి కొంతమంది ప్రారంభించిన వార్షిక సంకలనాల ప్రచురణ కొన్నాళ్లకే ఆగిపోవడం సాహిత్య ప్రపంచానికి తెలిసిన విషయమే. అలాగే 1915 నుంచి Anthony Doerr, Heidi Pitlor సంపాదకత్వంలో వెలువడే The Best American Short Stories తప్పితే ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా ఇంత సుదీర్ఘకాలంపాటు కథ సంకలనాలు వెలువడకపోవడం కథాసాహితి గర్వకారణంగా భావించాల్సిన అంశమే.


అయితే, మళ్లీ అదే ప్రశ్న. ఇంత విశేష పాఠకాదరణ పొంది వేలాదిమందికి చేరువైన ఈ కథ సంకలనాల్లో ప్రచురితమైనవన్నీ ఉత్తమ కథలేనా?

ఈ కథా సంకలనాలు ప్రారంభమైన దగ్గర నుంచి కథకుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. ఓ మంచి కథను రాయడం కోసం ఎంత కష్టపడేవారో, ఈ సంకలనాల్లో చోటు దొరుకుతుందో లేదోనని అంతే ఆదుర్దా పడేవారు. చాలా తక్కువ కథలే రాసినా, ఈ సంకలనంలో రావడం వల్ల సాహి త్యలోకం దృష్టినంతటినీ తమవైపు తిప్పుకున్నవారు ఎందరో. తొంభయ్యవ దశకం తొలినాళ్లలో విప్లవ కథ ఎక్కువ భాగం ఆక్రమించుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ, తదనంతర కాలంలో అస్థిత్వ రాజకీయాలు కూడా తమ వాటాను బాగానే దక్కించుకున్నాయి. స్త్రీ, దళిత, మైనారిటీ కథలకు ఈ సంకలనాల్లో సముచిత స్థానమే దక్కిందని చెప్పొచ్చు. అలాగే, రాష్ట్ర విభజన, ఆ ఉద్యమ సెగ కూడా ఈ సంకలనాలకు తాకింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర రచయితల కోపాగ్నులు సైతం ఈ సంకలనాలపై ప్రసరించాయి. కథను ఒక సామాజిక వ్యాఖ్యానంగా భావించే రచయితలు తమ ప్రాంత సమస్యలపై కథలు రాసి, అవి ఈ సంకలనాల్లో చోటు దక్కించుకుంటే ఆయా సమస్యలను పదిమంది ముందు చర్చకు పెట్టగలిగామని భావించేవారు. వీరిలో చాలామంది ఆబ్జిక్టివ్‌గా కంటే, ఆవేశంగానే ఆలోచిస్తారు కాబట్టి, తమ అస్థిత్వ గుంపుకు తక్కువ వాటా లభించిందని అలకలు పోవడం, నిరసన తెలపడం ఈ సంకలనాల విశిష్టతకు ఓ గీటురాయిగా చెప్పుకోవచ్చు.


మరి, ఇంత బాధ్యతను నెత్తిన మోసిన ఈ సంకలనాల్లో ‘ఉత్తమత్వం’ ఎంత?

మొదటే అనుకున్నట్టు ఉత్తమ అనే మాట చుట్టూ అనేక అంశాలు మోహరించినప్పటికీ ఈ సంకలనాల్లో వచ్చిన కథలన్నీ దాదాపు ఉత్తమమైనవే. కొంగ్రొత్త ఆలోచనల ద్వారాలు తెరిచినవే. ఈ మూడు దశాబ్దాల్లో 186 మంది కథకుల నుంచి ప్రచురితమైన 413 కథల్లో ఉత్తమమైన కథలు చాలానే ఉన్నాయి. అయితే, పలు సందర్భాల్లో.. అంటే, ఆవిష్కరణ సభల్లో కావచ్చు, ముందుమాటల్లో కావచ్చు-, సంపాదకులే చెప్పుకున్న ప్రమాణాలు, గీటురాళ్లకి ఏమాత్రం సరితూగని కథలు కూడా -స్వలంగానే అయినా -సంకలనాల్లో దూరాయి. అందుకు కారణాలేమిటని కెలికే కంటే.. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఆపాటి లోటుపాట్లను చూసీచూడనట్టు వదిలేయొచ్చు.


ముప్పయ్యేళ్లుగా సంకలనాలను వెలువరిస్తున్న కథా సాహితికి ఈ కథల ఎంపిక, వడపోత, ప్రచురణ, పంపిణీ, సభా నిర్వహణ బాగా అలవాటైపోయే ఉంటాయి. ఎంతో అనుభవం ఉంది కాబట్టి, ఇకనైనా కొత్త బాధ్యతలను వారే నెత్తికెత్తుకోవాల్సిన అవసరం ఉంది. కథా సాహితి సంకలనాల ప్రచురణ ఇరవైఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో అప్పటికే ఆ సంకలనాల్లో చోటు చేసుకున్న కథల నుంచి ముప్పయ్ కథలు ఎంపిక చేసి ప్రత్యేకంగా ప్రచురించారు. అలాగే, పాతికేళ్లు అయిన సందర్భంగా 25 సంకలనాలను రెండు భాగాలుగా వెలువరించారు. కానీ, ఈ ముప్పయ్యేళ్ల సందర్భంలో అటువంటి ప్రత్యేక ఆవిష్కరణ ఏమీ లేదు. ఇక మీదటైనా ఈ సంకలనాల్లోని మహా మంచి కథలను కొన్ని కొన్ని చొప్పున ఎంపిక చేసి, ఇంగ్లీషులోకి అనువదించి ఒక్కో ఏడాదీ ప్రచురిస్తే బావుంటుంది. ఇతర భాషలవారికే గాక, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కథ స్థాయి ఏంటో చాటినట్టవుతుంది.


సొంతంగా కథా ప్రచురణ వేపు కూడా కథాసాహితి దృష్టి సారించాలి. ఎందుకంటే, అప్పటికే ప్రచురితమైన వాటిలోంచి మంచి కథలను ఎన్నుకునే వీరికి, అసలు మంచి కథలే కనిపించకపోతే ఏం చేస్తారు? పెద్ద పెద్ద పత్రికలు వ్యాపార విలువలతో సాగుతూ మంచి కథకు అర్థం మార్చేస్తున్నాయి. చిన్న పత్రికలు బతకలేక, బట్ట కట్టలేక అవస్థ పడుతున్నాయి. అంతర్జాల పత్రికలు సైతం ప్రారంభమైనంత హడావిడిగానే అదృశ్యమైపోతున్నాయి. ఇటువంటి సామాజిక నేపథ్యంలో ఒక మంచి కథ ప్రచురణకు నోచుకునే అవకాశం దాదాపు మృగ్యం. కథల ఎంపికలో ఇదే పద్ధతిని ఇంకా కొనసాగించాలనుకుంటే, మంచి కథలు లేక ఈ సంకలనాల స్థాయి కూడా పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి, స్వయంగా కథల పోటీ నిర్వహించడమో, అముద్రిత కథలను ఆహ్వానించి మంచి కథలను ఎంపిక చేయడమో చేస్తే మెరుగైన కథలతో మంచి కథ సంకలనాలు మున్ముందు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. ఆడియో బుక్స్‌ వైపు కూడా దృష్టి సారించవచ్చు. ముప్పయ్యేళ్లుగా కథాసాహితి చెబుతున్న కథలకు పాఠకులు ‘ఊ’ కొడుతూనే ఉన్నారు. మంచి కథలు ఇంకా వస్తూంటే మరో ముప్పయ్యేళ్లయినా ‘ఊ’ కొడుతూనే ఉంటారు.
-దేశరాజు

(నేడు ‘కథ–2019’ ఆవిష్కరణ)

Updated Date - 2020-12-20T06:01:15+05:30 IST