బడ్జెట్‌లో భావ దారిద్ర్యం!
ABN , First Publish Date - 2020-02-08T06:18:03+05:30 IST
రాబోయే ఆర్థిక సంవత్సర (2020-21) కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 న పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరి 2న దేశ వ్యాప్తంగా సకల వార్తాపత్రికల పతాక శీర్షిక బడ్జెట్టే నని మరి చెప్పనవసరం లేదు. అత్యధిక పత్రికలు సంపాదకీయాలూ రాశాయి...

రాబోయే ఆర్థిక సంవత్సర (2020-21) కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 న పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరి 2న దేశ వ్యాప్తంగా సకల వార్తాపత్రికల పతాక శీర్షిక బడ్జెట్టే నని మరి చెప్పనవసరం లేదు. అత్యధిక పత్రికలు సంపాదకీయాలూ రాశాయి. టీవీ ఛానెల్స్ వార్తలు, వార్తా వ్యాఖ్యలలో ప్రధానాంశం బడ్జెట్టే కాక మరేమవుతుంది? ఆ మరుసటి రోజో?! ప్రింట్ మీడియా ఫ్రంట్ పేజీల నుంచి బడ్జెట్ వార్తలు దాదాపుగా అంతర్ధానమయ్యాయి. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అదే కథ. ఒక సినిమా విడుదలైన రోజునే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైన చందమే మోదీ సర్కార్ తాజా బడ్జెట్ పరిస్థితి కూడా!
ఎందుకిలా జరిగింది? బాధ్యులు ఎవరు? భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి తమను తామే నిందించుకోవల్సి వుంది సుమా! ప్రధాన ఆర్థిక సలహాదారు(ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ విషయమై ఆర్థిక సర్వేలో ఆయన ప్రశస్త సలహాలనిచ్చారు)ను తప్పుపట్టలేరు. అలాగే బడ్జెట్ రూపకల్పన సన్నాహక సంప్రదింపులలో భాగంగా ప్రధానమంత్రితో సమావేశమైన ఆర్థిక వేత్తలను గానీ, పారిశ్రామిక దిగ్గజాలను గానీ ఆక్షేపించలేరు.
అభివృద్ధి సాధక, సంక్షేమ ప్రధాన బడ్జెట్ రూపకల్పనకు తోడ్పడే అనేక భావాలు, ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. బడ్జెట్ సందర్భంగా మార్కెట్లలో సహజంలో విన్పించే వదంతులు, కన్పించే కోలాహలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి తప్పక పరిగణనలోకి తీసుకోవల్సిన పది విషయాల గురించి జనవరి 26 న నా ‘పళని పలుకు’ (‘మన భాగ్య మెట్లున్నదో?!’) లో ప్రస్తావించాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన ఆర్థిక సలహాదారు లేదా ఆర్థిక వేత్తల సలహాలను లక్ష్య పెట్ట లేదు; వ్యాపార రంగ దిగ్గజాల డిమాండ్లనూ అంగీకరించలేదని 2020–-21 బడ్జెట్ స్పష్టం చేసింది. ఎందుకని? ఈ క్రింది కారణాల వల్లేనని నేను భావిస్తున్నాను. అవి:
(1) తాను చేసిన తప్పులను నిరాకరిస్తున్న వైఖరినే నరేంద్ర మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దు , లోపభూయిష్ట వస్తుసేవల పన్ను మహాతప్పిదాలనే వాస్తవాన్ని అంగీకరించేందుకు పాలకులు ససేమిరా అంటున్నారు. ఆ చర్యల వల్ల చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు అసంఖ్యాకంగా మూతబడి, సంఖ్యానేక ఉద్యోగాలు హరించుకుపోయాయనే బాధాకరమైన యథార్థాన్ని ఒప్పుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధంగా లేరు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోవడానికి ఎగుమతుల తగ్గుదల, విత్త రంగంలో అస్థిర పరిస్థితులు, పరిశ్రమల అవసరాల కనుగుణంగా పరపతి సదుపాయం లేకపోవడం, కుటుంబ పొదుపులు స్వల్పస్థాయికి పడిపోవడం, వినియోగం తగ్గిపోవడం, మైనింగ్, తయారీ రంగాలు కుదేలవ్వడం, ఆర్థిక రంగంలో ఎల్లెడలా అనిశ్చితి, భయం రాజ్యమేలుతుండడం వల్లే ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగించిందనే వాస్తవాన్ని పాలకులు ఒప్పుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న ఈ ప్రతికూలతలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనే లేదు.
(2) ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించిన ప్రభుత్వ అంచనా అవిశ్వసనీయంగా వున్నది. చక్రీయ హెచ్చుతగ్గుల కారణంగానే ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగమనంలోకి పడిపోయిందని మోదీ సర్కార్ విశ్వసిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తాము ఇంతకు ముందు చేపట్టిన చర్యలనే - అప్పులు తీసుకోవడం, ప్రస్తుతం అమలులో వున్న కార్యక్రమాలకు మరింతగా నిధులు సమకూర్చడం, కొత్త కార్యక్రమాలను ప్రకటించడం- మరింత పటిష్ఠంగా, మరింత విస్తృతంగా అమలుపరచడం వల్ల దేశ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పాలకులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. వ్యవస్థాగత కారణాల వల్ల గాక, చక్రీయ హెచ్చుతగ్గుల వల్లే (పలువురు ఆర్థిక వేత్తలు అవునని అంటున్న విషయమిది) ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి పడిపోయివున్నట్టయితే, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తోడ్పడే ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వ పరిశీలనలో వున్నాయా? మోదీ సర్కార్ అసలు ఆ వైపుగా ఆలోచించడం లేదనిచెప్పక తప్పదు.
(3) ప్రభుత్వ సైద్ధాంతిక విశ్వాసాలు, ప్రాధాన్యాలు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అవరోధాలవుతున్నాయి. దేశీయ పరిశ్రమల సంరక్షణ వాదం, దిగుమతి ప్రత్యామ్నాయం, ‘బలమైన’ రూపాయి మొదలైన కాలం చెల్లిన ఆర్థిక చింతననే ప్రభుత్వం అభిమానిస్తున్నది, అనుసరిస్తున్నది. విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల సమకూరే బహుళ ప్రయోజనాలు సమకూరుతాయని ప్రభుత్వం భావించడం లేదు. ఫలితంగా ఎగుమతులను ఇతోధికంగా పెంపొందించే ప్రయత్నాలను కనీస మాత్రంగానైనా చేయడం లేదు. దిగుమతి సుంకాలను పెంపొందించడమనే తిరోగామి ఆర్థిక విధానానికే ప్రభుత్వం అంటిపెట్టుకుని వుంటోంది. రూపాయి విలువ వాస్తవిక స్థాయిలో వుండేందుకు అనుమతించడం లేదు. ఇందుకు ప్రభుత్వం ఎందకు వెనుకాడుతుందో అర్థం కావడం లేదు. ఇటుంటి శాస్త్రీయ ఆలోచనల వల్లే ఆర్థిక వ్యవస్థ సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొనలేకపోతోంది.
(4) ప్రభుత్వం, వ్యాపారవర్గాల మధ్య పరస్పర అపనమ్మకాన్ని అధికం చేసిన చర్యలు, నిర్ణయాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం విముఖంగా వున్నది. మోదీ సర్కార్ పలు ఆర్థిక చట్టాలను నేరపూరితం చేసింది. పన్ను వసూళ్ళ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలలోని క్రిందిస్థాయి అధికారులకు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. పన్ను వసూలు పన్ను ఉగ్రవాదంగా మారిపోయింది (వి.జి. సిద్ధార్థ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో గుర్తుచేసుకోండి). పన్ను చెల్లింపుదారుల హక్కుల చట్టాన్ని తీసుకువస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ హామీని విశ్వసించేదెవరు? పన్ను వసూళ్ళ వ్యవస్థ, దర్యాప్తు సంస్థల క్రింది స్థాయి అధికారులకు సైతం కట్టబెట్టిన అపరిమిత అధికారాలను ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకోదు? అనేదే ఆర్థిక మంత్రి హామీకి వ్యాపార వర్గాల, ఇతర పన్ను చెల్లింపుదారుల సంశయాత్మక ప్రతిస్పందన.
(5) ఆర్థిక వ్యవస్థ వ్యవహారాలలో తానొక అసమర్థ మేనేజర్‌నని ప్రభుత్వం తననుతాను నిరూపించుకున్నది. నోట్ బందీనుంచి, వస్తుసేవల పన్ను దాకా, స్వచ్ఛ్ భారత్ మిషన్ నుంి , ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులు సమకూర్చడం వరకు, ఉజ్వల యోజన నుంచి ఉదయ్ దాకా ప్రతి కార్యక్రమ రూపకల్పన, అమలు రెండిటిలోనూ లోపభూయిష్టమైనదే. లొసుగుల మయమైన కార్యక్రమాలతో ప్రజాహిత లక్ష్యాలు నెరవేరతాయా? దురదృష్టవశాత్తు ప్రభుత్వం వాస్తవాలను చూడ నిరాకరిస్తోంది. అప్రియ సత్యాలను అంగీకరించడం లేదు. భజనపరుల మెచ్చుకోళ్ళనే ఆమోదిస్తోంది. ప్రస్తావిత కార్యక్రమాల అమలుకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితాలు సంతృప్తికరంగా వుండడం లేదు. పథకాలు అమలు పద్ధతులను మెరుగుపరిచే సామర్థ్యం పాలనా యంత్రాంగానికి కొరవడింది. పథకాల అమలులో వాస్తవ ఫలితాలు ఎలా వున్నాయో ప్రభుత్వానికి నిష్పాక్షికంగా నివేదించడం లేదు.
మరి ఇటువంటి పరిస్థితులలో అభివృద్ధి సాధనకు, సంక్షేమ ప్రదానానికి దోహదం చేయని నిస్తేజ బడ్జెట్‌ను సమర్పించడానికి మాత్రమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిమితమవ్వడంలో ఆశ్చర్యమేముంది? ఈ బడ్జెట్‌తో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు పెరుగుదల నామమాత్రంగా మాత్రమే ఉంటుంది. పన్ను రాబడులపై ఆర్థిక మంత్రి ఆశాభావానికి పటిష్ఠ ప్రాతిపదికలు కన్పించడం లేదని ఆర్థిక వేత్తలు సకారణంగానే భావిస్తున్నారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 10 శాతం చొప్పున పెరుగుతుందని, స్థూల పన్ను రాబడులు 12 శాతం చొప్పున పెరుగతాయనేది బడ్జెట్ అంచనా. అయితే ఇవి అసంభవాలు. సందేహాతీతమైన సత్యమది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, అంచనా వేసిన పన్నుల రాబడులను వివిధ పథకాలకు పంపిణీ చేయవలసివుంటుంది (ఈ పథకాల సంఖ్య తక్కువేమీ కాదుకదా). ఈ దృష్ట్యా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ మరిన్ని నిధులు కేటాయించే అవకాశం లేదు. పేదలకు సత్వరమే మరింత ధనం అందుబాటులోకి రావడమనేది పగటికలే అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు పెట్టనేలేదు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకం, ఆహార సబ్సిడీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ మొదలైన వాటికి కేటాయింపులను భారీగా తగ్గించారు. మరి గ్రామీణ ఆదాయాలు/ వేతనాలు గానీ లేదా కుటుంబ వినియోగం గానీ ఎలా పెరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన మినహాయింపులు వాస్తవానికి పన్నుల వసూలు వ్యవస్థను మరింత సంక్లిష్టం చేసింది. ఆ మినహాయింపులు వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులలో అయోమయాన్ని సృష్టించాయి. వాటి వల్ల రూ.40,000 కోట్ల రూపాయల మేరకు లబ్ధి సమకూరుతుందనే అంచనా ఖచ్చితమైనది కాదు. ఏమైనా దాని ప్రభావం చాలా స్వల్పంగా మాత్రమే ఉండగలదు. ప్రైవేట్ పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు దోహదం చేసే ప్రోత్సాహకాలు సైతం ఈ బడట్‌లో లేవు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు, పన్ను చెల్లింపు భారాన్ని కంపెనీ నుంచి తొలగించి, వాటాదారులపై మోపింది. తయారీరంగ సామర్థ్యాన్ని కేవలం 70 శాతం మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్న పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు రావడానికి ఆస్కారమే లేదు. తమది పటిష్ఠ, నిర్ణయాత్మకంగా వ్యవహరించే ప్రభుత్వమని మోదీ సర్కార్ తరచు గొప్పగా చెప్పుకోవడం కద్దు. ఈ ఆత్మశ్లాఘన సమర్థనీయమేనా? ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలికాలంలో ఎన్నడూలేని విధంగా విషమ సవాళ్లతో సతమతమవుతుండగా మోదీ ప్రభుత్వం సమస్యల పట్ల అవగాహనారాహిత్యం, పిరికితనంతో వ్యవహరించింది!
పి. చిదంబరం
