హక్కుల హననానికి అండగా మారుతున్న చట్టాలు

ABN , First Publish Date - 2020-12-10T09:55:40+05:30 IST

కేంద్రప్రభుత్వం ఈ మధ్య జాతీయ స్థాయి విధానపరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వామపక్ష తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా...

హక్కుల హననానికి అండగా మారుతున్న చట్టాలు

మన రాజ్యాంగం ఒకవైపు వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పిస్తూనే మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు పరిమితుల్ని విధించింది. ఈ పరిమితులను పార్లమెంటు విధించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో హక్కుల్ని రద్దు చేయవచ్చు. కాని జీవించే హక్కును రద్దు చేయటానికి వీల్లేదు. కానీ పార్లమెంట్ విధానాలన్నీ జీవించే హక్కుని కాలరాసే విధంగానే ఉంటున్నాయి. దీనిని ప్రశ్నించాల్సిన న్యాయ స్థానాలు మౌనం పాటిస్తున్నాయి.


కేంద్రప్రభుత్వం ఈ మధ్య జాతీయ స్థాయి విధానపరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వామపక్ష తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి ఈ ప్రణాళిక రూపొందింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం కార్యకలాపాలు ఏటా తగ్గుమెుహం పడుతున్నట్లుగా ప్రభుత్వం భావిస్తున్నది. ఇంకా తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని ప్రయోగించి దాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నాలుగేళ్ళల్లో ఉద్యమాల అణచివేతకు, ఉద్యమకారుల నిర్భంధానికి కేంద్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు రూ.1,135.6కోట్లను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‍కి రూ.79.4కోట్లు, తెలంగాణకి రూ.49.7కోట్లు అందాయి. దేశవ్యాప్తంగా దేశద్రోహ నేరం క్రింద, ఉపా చట్టం పేరుతో, ఎన్ఐఎ అదుపులో వందలమంది రాజకీయ ఖైదీలు మగ్గిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం అడుగుజాడల్లోనే విధానాలను అమలు చేస్తున్నాయి. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్‍ఐఎ చట్టాన్ని బాహటంగా అమలు చేస్తోంది. కెసిఆర్‍ మునుపటి ఉద్యమ నేతలా లేరు. ప్రజాస్వామ్యమనే ముసుగును తొలగించి, తన నియంతృత్వ ముఖాన్ని బహిరంగపరుస్తున్నారు.


మనుధర్మ శాస్త్రాన్ని ఒక సద్బ్రాహ్మణుడు మనువు రూపొందిస్తే, రాజ్యాంగాన్ని దళితుడు అంబేడ్కర్ రూపొందించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వెంటనే ఆమోదం పొందలేదు. రూపొందిన తర్వాత ఎన్నో సవరణలకు గురైంది. అంబేడ్కర్ తొలుతగా పార్లమెంటరీ పంథాను అంగీకరించినా, క్రమంగా అసంతృప్తికి గురై రాజీనామా చేశారు. రాజ్యాంగ రూపకల్పనలో మనుధర్మ శాస్త్రం పాత్ర తక్కువే, కానీ రాజ్యాంగ అమలులో పూర్తిగా మనుధర్మమే రాజ్యమేలుతున్నది. కౌటిల్యుడు పౌరులను నిర్బంధంలోకి తీసుకోవటానికి నిర్దేశించిన మూడు అభియోగాల్లో మెుదటిది వ్యక్తి కదలికలపై, ప్రవర్తనపై అనుమానం కలగటం. ఈ అభియోగం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల్ని పోలి ఉన్నది. కౌటిల్యుడి న్యాయశాస్త్రం పూర్తిగా ధర్మబద్ధంగా, అంటే మను‘ధర్మ’ బద్ధంగా, ఉంటుంది. ప్రస్తుత న్యాయ సంస్థలు ధర్మాన్ని కాపాడటం అంటే మనుధర్మాన్ని కాపాడటంగానే అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం మనువు, కౌటిల్యుల వారసత్వాన్ని కాపాడే విధంగా అమలవుతున్నది. 


భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాణం వంటివి. ప్రాథమిక హక్కులు ప్రజల్లో సమానత్వాన్ని కాంక్షిస్తాయి. దోపిడీ సమాజం ఎప్పుడూ సమానత్వాన్ని వ్యతిరేకిస్తుంది. అసమానత్వాన్నే నెలకొల్పాలని ప్రయత్నిస్తుంది. ప్రపంచంలోనూ, మన దేశంలోనూ ప్రాథమిక హక్కుల చరిత్రని అర్థం చేసుకుంటే అక్షరాలా ఇది నిజమని అవగతమౌతుంది. భారతీయ చట్టాలలో రెండు రకాల నిర్బంధాలు ఉన్నాయి. 1. ప్యూనిటివ్ డిటెన్షన్ (దండనాత్మక నిర్బంధం); 2. ప్రివెంటివ్ డిటెన్షన్ (నివారక నిర్బంధం). ఒక వ్యక్తి అదివరకే చేసి ఉన్న చట్టవ్యతిరేక చర్యకుగాను అతన్ని నిర్బంధించటం దండనాత్మక నిర్బంధం. చట్టం నిషేధించిన పనిని ఒక వ్యక్తి చేసే అవకాశం ఉందని అనుమానించి ఆ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోవటం నివారక నిర్బంధం. మొదట్లో ఈ తరహా చట్టాలు జాతీయ సమగ్రతకు, సమైక్యతలకు అవసరమని భావించారు. కానీ ఆచరణలో మాత్రం ఇవి రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు అండగా మారాయి. 


మీసా, నాసా, టాడా, పిడిటిఎ... ఈ చట్టాల వరుసలో అన్‍లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్ (UAPA) 2008లో వచ్చింది. దీన్ని 2012లో సవరించి నూతన చట్టాన్ని రూపొందించారు. వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధంగా నివారక నిర్భంధం వంటి ‘నల్ల’ చట్టాలను చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరిస్తోంది. ఇలాంటి చట్టాలు రాజకీయ ప్రయోజనాలకు, కక్షసాధింపులకు, దోపిడి వ్యవస్థకు ఉపయోపడుతున్నాయి. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న హిందూ ఫాసిస్ట్ విధానాలకు ఉపా చట్టం బలమైన ఆసరాగా మారింది. 


ఇటువంటి చట్టాలు అంబేడ్కర్ రాజ్యాంగం రూపొందించినపుడు లేవు. ఆర్టికల్ 19 (భావ ప్రకటనా స్వేచ్ఛ) ప్రకారం ప్రభుత్యం ప్రజల హక్కులకు భంగం కలిగించే ఎటువంటి చట్టాలూ చేయరాదు. నెహ్రూ దీన్ని మార్చమని అంబేడ్కర్‌ని ఆదేశించాడు. అంబేడ్కర్ ఒప్పుకోలేదు. అంబేడ్కర్ రాజీనామా చేశాక 1951లో నెహ్రూ స్వయంగా ఆర్టికల్ 19కి సవరణ తెచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ విషయంలో అయినా చట్టం చేయవచ్చని 16వ సవరణ చేశారు. ఇలా మన రాజ్యాంగం ఒకవైపు వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పిస్తూనే మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు పరిమితుల్ని విధించింది. ఈ పరిమితులను పార్లమెంటు విధించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో హక్కుల్ని రద్దు చేయవచ్చు. కాని జీవించే హక్కును రద్దు చేయటానికి వీల్లేదు. కానీ పార్లమెంట్ విధానాలన్నీ జీవించే హక్కుని కాలరాసే విధంగానే ఉంటున్నాయి. దీనిని ప్రశ్నించాల్సిన న్యాయ స్థానాలు మౌనం పాటిస్తున్నాయి.


బ్రిటిష్ వలస ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా రేకెత్తిన గళాలను అణచివేయడానికి 1870 లో ఐపిసిని సవరించింది. జేమ్స్ స్టిపెన్సర్ 124(ఎ) సెక్షన్‌ను ఉనికిలోకి తెచ్చాడు. వలస ప్రభుత్వ విధానంపై వ్యాసం రాసినందుకు 1891లో అప్పటి ‘ఒంగోబాసి’ పత్రిక సంపాదకులు జొగేంద్ర చంద్రబోసు మీదా తొలిసారి రాజద్రోహం మోపారు. ఈ రాజద్రోహం నేరం కిందనే భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురులకు ఉరిశిక్ష వేశారు. సెక్షన్ 124(ఎ) కింద దేశద్రోహులపై చర్యలు తీసుకోవడంలో తప్పేముందని కొందరు వాదిస్తుంటారు. నిజానికి దేశ ద్రోహం అనే భావనే ఈ నిబంధనలో లేదు. రాజద్రోహం, దేశద్రోహం పదాలు సమానార్థకాలు కావు. వీటిని ఒకే అర్థంలో వాడటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకులందరూ దేశ ద్రోహులేనన్న భావనతో పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపితే చాలు దేశద్రోహం క్రిందే జమకడుతున్నారు. కుడంకుళం అణువిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా 2012-–2013లో గళమెత్తిన తమిళ ప్రజలు తొమ్మిది వేల మందిపై 124(ఎ) క్రింద కేసు మోపారు. ఈ 124(ఎ) సెక్షన్‍ను అన్ని సందర్భాలలో విధించరాదని 1962లో సుప్రీంకోర్టు చెప్పింది. హింసకు పురికొల్పటం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రల సందర్భాల్లో మాత్రమే రాజద్రోహం నిబంధన వర్తిస్తుందని కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు వివరంగా చెప్పింది. కాని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ చట్టాన్ని అణచివేతకు సాధనంగా వాడుతున్నాయి. బీమా కొరేగాంలో కూడా ఇదేవిధంగా జరిగింది. ప్రధాన మంత్రి మోదీని హత్య చేయాలనే పథకం పన్నారని పదిమంది ఉద్యమకారులపై రాజద్రోహం నేరం మోపి అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు.


జాతీయ విచారణ సంస్థ చట్టం (ఎన్‌ఐఎ) 2008లో అమల్లోకి వచ్చింది. దేశ శాంతి భద్రతలకై ఈ చట్టం పనిచేస్తుంది. దేశ శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తారని భావించిన వ్యక్తుల్ని ఈ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకుని విచారించవచ్చు. బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక ఈ చట్టంలో మార్పులు చేసి దీనిని విస్తృతంగా అమలులో పెడుతున్నది. ముందుగా ముస్లింలు, తర్వాత దళితులు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, విద్యార్థులు, అటుపై అనేకమంది ఉద్యమకారులపై శాంతిభద్రతలకు ముప్పు అన్న పేరుతో కేసులుపెట్టి అదుపులోకి తీసుకుంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‍లో ప్రజా సంఘాల నాయకులపై అక్రమ ఊపా కేసులు బనాయించారు. చైతన్య మహిళా సంఘం సభ్యురాలు రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఆంధ్రప్రదేశ్‍లో వివిధ ప్రజా జీవన రంగాల్లో పని చేస్తున్న సంస్థల కార్యకర్తలపై కుట్రపూరితంగా రెండు కేసులు బనాయించారు. 30 మంది మీద ఊపాతో పాటు అనేక సెక్షన్ల కేసులు నమోదు చేశారు. చైతన్య మహిళా సంఘంలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఒకటి ఈ నెల 23న విశాఖ ఏజెన్సీ లోని ముంచింగిపుట్టు పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. రెండోది 24వ తేదీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో నమోదు చేశారు. ఇవన్నీ కూడా అక్రమంగా బనాయించిన కేసులే. వాస్తవానికి ఈ సంఘాలన్నీ ప్రజాస్వామిక విలువల కోసం పని చేస్తున్నాయి. దీన్ని సహించలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ కేసులను పెట్టింది. ఇలా ప్రజాసంఘాల నాయకులు, సభ్యులపై కేసులు పెట్టే పద్ధతి గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఆరంభించింది. ఇప్పుడు ఈ పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు. ఇటువంటి నిర్భంధాలకు వ్యతిరేకంగా పోరాడాలి.

దేవేంద్ర

న్యాయవాది, చైతన్య మహిళా సంఘం

(నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం)

Updated Date - 2020-12-10T09:55:40+05:30 IST