నూరుశరత్తుల మధునాపంతుల

ABN , First Publish Date - 2020-03-02T07:50:21+05:30 IST

మహాకవి, ఆంధ్రకల్హణ, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారి శతజయంతి సంవత్సరం ఇది. 1920 మార్చి 5న పల్లిపాలెంలో జన్మించిన శాస్త్రిగారికి సుప్రసిద్ధ కవి, భిషగ్రత్న ఆకొండి శ్రీరామశాస్త్రి మాతామహులు...

నూరుశరత్తుల మధునాపంతుల

‘పదహారణాల ఆంధ్రుడు’ అనే తెలుగు జాతీయానికి ముమ్మూర్తులా అచ్చుగుద్దినట్టు సరిపోయే తెలుగు వ్యక్తిత్వం మధునాపంతుల వారిది. కట్టూబొట్టే కాదు, ఆంధ్రీకుటీరము, ఆంధ్ర రచయితలు, ఆంధ్ర పురాణము ఇలా త్రిగుణాత్మ కంగా సాగిన వారి ఆంధ్ర జాతీయాభిమానము తర్వాతిరోజుల్లో జాతికి జీవగర్ర అయింది.  


‘‘ఆంధ్రభాషాభివృద్ధియు, నాంధ్రదేశ 

భాగ్య వృద్ధియు, నేనాఁడు పడయనగునొ

యపుడే యాంధ్రశబ్ద మన్వర్థమగును

మనయెడల, గానిచో నామమాత్రమగును’’     - తోరణము, 1938


మహాకవి, ఆంధ్రకల్హణ, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారి శతజయంతి సంవత్సరం ఇది. 1920 మార్చి 5న పల్లిపాలెంలో జన్మించిన శాస్త్రిగారికి సుప్రసిద్ధ కవి, భిషగ్రత్న ఆకొండి శ్రీరామశాస్త్రి మాతామహులు అయితే, వేంకటరామకృష్ణ కవులలో ఒకరైన శతావధాని ఓలేటి వేంకటరామశాస్త్రిగారు స్వయానా మేనత్త భర్త మాత్రమే కాకుండా తొలి సాహిత్యగురువు. రామశాస్త్రి గారి వద్ద సాహిత్య అధ్యయనం చేసిన మధునాపంతుల పదోఏటనే గురువు, మావయ్యగారిని పద్యాల ఉత్తరాలతో పలకరించారు. తన పద్దెనిమిదవ ఏట 1938లో ‘తోరణము’ తొలి ఖండకావ్యాల చిరుపొత్తము రచించి మావయ్యగారికి అంకితంగా సమర్పించుకున్నారు. ఆ కావ్యంలోనే ‘తుదకు స్మరణీయులైన ఆంధ్రుల తలంప గాజుకన్నైననొక యశ్రు కణము రాల్చు’’ అన్న అత్యాధునికమైన అభివ్యక్తితో సాహితీ ప్రపంచాన్ని ఆకర్షించారు. అవ్యాజమైన తన ఆంధ్రాభిమా నాన్ని చాటుకున్నారు. 1938 జనవరి 13న పల్లిపాలెంలో ‘ఆంధ్రీకుటీరము’ను స్థాపించారు. ఆ రోజుల్లోనే దళితుల విద్యావశ్యకతను గుర్తించి, దళితులకు ఉచితంగా సంస్కృతం నేర్పిస్తామని ఆంధ్రపత్రికలో ప్రకటన ఇచ్చిన ధీశాలి, మాన వతామూర్తి మధునాపంతుల. ఆ ప్రకటనకు స్పందించి బర్మాదేశంనుండి ఒక తెలుగు విద్యార్థి పల్లిపాలెం వస్తే, అతనికి విద్యాబుద్థులు గరిపారు శాస్త్రిగారు.


1939, మార్చిలో ఆంధ్రిపత్రికను స్థాపించారు. పల్లెపట్టుల్లో విద్యాసాహిత్య సాంస్కృతిక విషయాలను వ్యాప్తిచేయడం ఆంధ్రిపత్రిక ముఖ్య ఉద్దేశాలు. ఆంధ్రి ఆనాటి సుప్రసిద్థ కవులు ఎందరో రచనలను అచ్చువేసింది. మిగతా పత్రికల లోలేని గొప్ప విశేషం ఆంధ్రిలో వుండేది. ఎంతటి పెద్ద రచయిత రచన అయినా ఆంధ్రిలో అచ్చయితే, ఆ రచన కింద సంపాదకీయ వ్యాఖ్య పేరుతో గుణదోష విమర్శ శాస్త్రి గారు చేసేవారు. ఇది కొంతమందికి రుచించలేదు. భారతి తరువాత అంతటి పత్రిక అనుకున్న ‘ఆంధ్రి’ కారణాలేమైనా అనతికాలంలోనే 1941 నవబంరులో ఆగిపోయింది.


‘పదహారణాల ఆంధ్రుడు’ అనే తెలుగు జాతీయానికి ముమ్మూర్తులా అచ్చుగుద్దినట్టు సరిపోయే తెలుగు వ్యక్తిత్వం మధునాపంతులవారిది. కట్టూబొట్టేకాదు, ఆంధ్రీకుటీరము, ఆంధ్రరచయితలు, ఆంధ్రపురాణము ఇలా త్రిగుణాత్మకంగా సాగిన వారి ఆంధ్ర జాతీయాభిమానము తరువాతిరోజుల్లో జాతికి జీవగర్ర అయింది. 1940 జనవరి 31న కాకినాడ పీఠికాపురాధీశ కళాశాలలో చిలకమర్తిగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలలో తొలి సాహిత్య ప్రసంగం చేసిన ప్పటికి ఆయన వయస్సు 20 ఏళ్లు. ఆ తర్వాత ఆయన సాహిత్యంలో వెనుదిరిగి చూడవలసిన అవసరంలేక పోయింది. 1944లో ఆంధ్ర రచయితలు మొదటి భాగం వేటూరి ప్రభాకరశాస్త్రిగారి తొలి పలుకుతో వెలువడింది. 1947లో రాజమహేంద్రవరంలో వీరేశలింగంగారి ఆస్తికోన్నత పాఠశాలలో ప్రధమశ్రేణి తెలుగు పండితునిగా ఉద్యోగంలో కుదురుకున్నారు. 1950లో ఆంధ్రరచయితలు మొదటి భాగాన్ని కలుపుకుంటూ వందమంది రచయితల సమాచారంతో ‘ఆంధ్రరచయితలు’ బృహద్గ్రంథంగా వెలువడింది. 1973లో పునర్ముద్రణ పొందింది. వీరేశలింగంగారి ఆంధ్రకవుల చరిత్ర తర్వాత అంతటి రచనగా పేరొంది సాహిత్య పరిశోధకులకు కరదీపికగా మారింది.


ఇక ఆద్యతనాంధ్ర సాహిత్య చరిత్రలో శాస్త్రిగారి కీర్తి పతాకను చిరస్థాయిగా నిలిపిన మహాకావ్యం, ఆధునికాంధ్ర పంచమహా కావ్యాలలో ఒకటిగా గణుతికెక్కిన ‘ఆంధ్ర పురాణం’ తొలిపాలు (మొదటి భాగం) 1954లో విశ్వనాథ విపుల పీఠికతో వెలువడింది. రెండవ భాగాన్ని కలుపుకొని మహాకావ్యంగా 1964లో వెలువడింది. ఈ కావ్యాన్ని ‘‘కవికావ్య శంఖములోబడి పవిత్రతీర్థమై ఆంధ్రజనసేవ్యమైన ఆంధ్రజాతి చరిత్రము’’ అని మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు అంటే ‘‘ప్రాచీనాంధ్ర కావ్యములలో సహపంక్తిలో నిల్వగలిగిన ఈ కావ్యము కంకాళముల వంటి చారిత్రికాంశ ములకు కమనీయమూర్తి కల్పనము చేసినది’’ అని డా. సి.నారాయణరెడ్డిగారు అన్నారు. ఆంధ్రపురాణము తెలుగు జాతి గీటురాయి. 1966లో ఈ కావ్యానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య  అకాడెమీ  అవార్డు ప్రకటించింది. వీటితోపాటు తోరణము, కేళాకుళి, చైత్రరథము, శ్రీఖండము వంటి ఖండకావ్యాలు, బోధివృక్షము, కళ్యాణతార వంటి నవలలు, ప్రసంగ తరంగిణి వంటి వ్యాస సంపుటులు పదుల సంఖ్యలో వెలువరించారు. తరుణసాహితి, సాహిత్య గౌతమి వంటి సంస్థలను దగ్గరుండి నడిపించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆనాటి కవి పండితులు శాస్త్రి గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం మరొక విశేషం. బహుశా కందుకూరి, చలం, సంజీవ్‌దేవ్‌ల తర్వాత ప్రముఖుల ఉత్తరాలు అందుకున్న మహాకవి మధునాపంతులగారే. శాస్త్రిగారి అశేష భాషా సాహిత్యశేముషీ వైదుష్యాన్ని గుర్తించిన ఆంధ్రవిశ్వకళాపరిషత్తు 1982లో శాస్త్రి గారిని ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. ‘‘ఈ శతజయంతిని పురస్కరిం చుకుని అజో.విభో - కందాళం ఫౌండేషను ఆంధ్రపురాణం తొమ్మిది పర్వాలకు తొమ్మండుగురు విద్వాంసులచేత సమగ్ర వ్యాఖ్య రాయించి సంపుటాలుగా ముద్రింప పూనుకోవడం ఆంధ్రపురాణానికి కొత్తవెలుగు. ఆ మహాకవికి నిజమైన కావ్యాంజలి.

శిఖామణి

(మార్చి 5వ తేదీన పల్లిపాలెంలో మధునాపంతులవారి శతజయంతి సాహిత్య సదస్సు జరుగుతున్న సందర్భంగా)


Updated Date - 2020-03-02T07:50:21+05:30 IST