బిహార్‌ ప్రయోగం సఫలం

ABN , First Publish Date - 2020-10-27T05:49:44+05:30 IST

ఒకప్పుడు బిహార్ రాష్ట్రాన్ని బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్) రాష్ట్రాల్లో ఒకదానిగా భావించి అభివృద్ధిలేని అనారోగ్య ప్రాంతంగా పరిగణించేవారు...

బిహార్‌ ప్రయోగం సఫలం

ఒక జాతీయపార్టీ, ప్రాంతీయపార్టీ కలిసికట్టుగా పనిచేస్తే కొన్ని సంవత్సరా ల్లోనే ఒక రాష్ట్రం ఏ విధంగా వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించగలదో చెప్పడానికి బిహార్ ఉదాహరణ నిదర్శనం. గతంలో లాలూ హయాంలో నెలకొన్న ఆటవిక రాజ్యానికీ, అవినీతి సామ్రాజ్యానికీ, ఎన్డీఏ హయాంలో జరుగుతున్న వినూత్న మార్పులకూ మధ్య తేడాను ఆ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనించగలుగుతున్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుకోవడాన్ని అనుభవించగలుగుతున్నారు.


ఒకప్పుడు బిహార్ రాష్ట్రాన్ని బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్) రాష్ట్రాల్లో ఒకదానిగా భావించి అభివృద్ధిలేని అనారోగ్య ప్రాంతంగా పరిగణించేవారు. కాని 2004-–05లో కేవలం రూ.23,885 కోట్లున్న బిహార్ బడ్జెట్ ఎనిమిది రెట్లు పెరిగి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షకోట్లకు చేరుకోవడమే ఇవాళ అది అస్వస్థ రాష్ట్రం కాదనడానికి సరైన నిదర్శనం. రహదారులు, ఇళ్లు, విద్యుత్, విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు బడ్జెట్‌లో భారీ ఎత్తున కేటాయింపులు పెరిగాయి. ఒకప్పటికంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎన్నో రెట్లు మెరుగుపడింది. ఒకప్పుడు అక్కడ లాంతర్‌తో నడవా ల్సిన అంధకార బంధుర పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?


అయిదేళ్ల క్రితం 2015లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న రాజకీయ వాతావరణా నికీ, ఇప్పటి వాతావరణానికీ కూడా ఎంతో తేడా ఉన్నది. అప్పటి ఎన్నికల్లో ఆర్‌జెడి, కాంగ్రెస్ తదితర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీష్ కుమార్ ఎందుకు ఆ పదవిని సాఫీగా నిర్వహించ లేకపోయారు? తన పదవికి రాజీనామా చేసి బీజేపీకి స్నేహహస్తం చాచి బిజెపి మద్దతుతో ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలను కున్నారు? ఈ కారణాల గురించి నితీష్ అనేక సందర్భాల్లో తానే వివరించారు. ఇందులో ప్రధానమైనది- ఆర్‌జెడి నేత లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుమా రుడు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, లాలూ సతీమణి రాబ్రీ దేవి, కుమార్తె మీసా భారతిలపై అవినీతి, ఆక్రమ ఆస్తుల గురించి సిబిఐ, ఈడీ ఛార్జిషీట్లు దాఖలు చేయడం. వీరందరిపై మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు, భూకుంభ కోణాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రెండవది, ఆర్‌జెడి అండ చూసుకుని రాష్ట్రంలో నేరచరితులు విజృంభించి ఉధృతంగా కార్యకలాపాలు నిర్వహించడం. అవినీతిపరులను, నేరచరితులను ఏ మాత్రం సహించబోనని ముఖ్యమంత్రి కాగానే ప్రకటనచేసిన నితీష్ కుమార్‌కు అధికారంలో కొనసాగడం దినదినగండంగా మారింది.


సోనియా, రాహుల్‌ గాంధీలు కూడా ఆర్‌జెడి నేతల ఆగడాలకు కళ్లెం వేయలేని దుర్భర పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగడం అంటే వారి దుర్మార్గాలకు ఆమోద ముద్రవేయడమేనని నితీష్ కుమార్ భావించి స్వ యంగా గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. బిహార్ ప్రయోజనాలను కాపాడాలంటే భారతీయ జనతా పార్టీకి స్నేహహస్తం చాచక తప్పదని ఆయన గ్రహించారు. నిజానికి అంతకు ముందు నితీష్ కుమార్‌కు బిజెపితో చిరకాల అనుబంధం ఉన్నది. వాజపేయి హయాంలో వ్యవసాయ, ఉపరితల రవాణా, రైల్వే శాఖల్ని నిర్వహించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2011 అసెంబ్లీ ఎన్ని కల్లోనూ బిహార్‌లో ఎన్డీఏ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. జాతీయస్థాయిలో మోదీ ఆవిర్భావం ప్రారంభమైన తర్వాత బిజెపితో చేతులు కలపడానికి వెనుకాడి ఎన్డీఏ నుంచి వైదొలగిన నితీష్‌ ఆర్‌జెడి, కాంగ్రెస్‌లతో కలిసి 2015లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాని ఆ అరాచక శక్తులతో స్నేహం వల్ల జరిగిన ప్రమాదాన్ని అనతికాలంలోనే గ్రహించారు. మోదీ అవినీతిపరులు, నేరచరితులకు అడ్డుకట్ట వేసేందుకు పెద్ద నోట్లరద్దు వంటి అనేక చర్యలు తీసుకోవడం నితీష్‌ను ఆకర్షించింది. బహిరంగంగా ఈ చర్యలకు ఆయన మద్దతు పలికారు. 2017 నుంచి బిజెపి మద్దతుతో ఆయన ఒక ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని నిర్వహించడం ప్రారంభించారు. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ–-నితీష్ కుమార్ ద్వయానికి బిహార్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 


ఇంత ఘోరంగా ఓటమి పాలైనా యుపిఏ ఎలాంటి నైతిక పాఠాలు నేర్చు కోలేదు. మళ్లీ అరాచక శక్తులతో, నేరచరితుల కూటమిగా ఇప్పుడు అసెంబ్లీలో బరిలోకి దిగింది. కానీ ఎన్డీఏ హయాంలో కొన్ని సంవత్సరాలుగా బిహార్ రూపు రేఖలు మార్చేందుకు తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తున్న ప్రజలు మరో సారి ఎన్డీఏకు పట్టం కట్టేందుకు సిద్ధపడుతున్నారు. బిహార్‌లో 2.38 కోట్ల మంది ప్రజలు జనధన్ ఖాతాలను తెరుచుకున్నారు. దాదాపు కోటిమంది ఇప్పటికే ఉజ్జ్వల పథకం కింద ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 75 లక్షలమందికిపైగా రైతులకు రూ.5900కోట్లు ఇప్పటి వరకూ పంపిణీ అయ్యాయి. లక్షలాదిమందికి విద్యుత్ సబ్సిడీ, గృహనిర్మాణ పథకాల వల్ల ప్రయోజనం చేకూరింది. రాష్ట్రంలో ఇవాళ దాదాపు 70శాతంమందికి తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. కేవలం కేంద్రప్రభుత్వ పథకాల వల్లనే 22 కోట్లమందికి ప్రయోజనం చేకూరడంతో బిజెపి కార్యకర్తలు లబ్ధిదారులను నేరుగా కలుసుకోగలుగుతున్నారు. ఇవాళ బిహార్లో వేల కోట్ల విలువైన కేంద్రప్రభుత్వ ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ రూ.14,258కోట్ల విలువైన 9 జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను ప్రారం భించారు. ఇప్పటికే 2775కిమీ మేరకు జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయి. కోసీ నదిపై రూ.516 కోట్ల వ్యయంతో నిర్మించిన 1.9 కిమీ పొడవైన మెగా రైలు వంతెన దాదాపు 86 సంవత్సరాల తర్వాత మిథిల, కోసి ప్రాంతాలను అను సంధానం చేసింది. దీనితో పాటు ప్రధాని మరో 14 రైల్వే ప్రాజెక్టులను, మరెన్నో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేకాదు, విద్యా రంగంలో బిహార్ మున్నెన్నడూ లేనివిధంగా ప్రగతి సాధించి పూర్వవైభవాన్ని సంతరించుకోబో తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే ఎయిమ్స్‌తో పాటు 52 వైద్య కళాశాలలు, ఐఐటి, ఎన్ఐటిలతో పాటు 40కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. బిహార్‌లో ఎన్డీఏ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి గతంతో పోలిస్తే కొన్ని వందల రెట్లు మెరుగైంది. అనేక రాష్ట్రాలతో పోలిస్తే బిహార్‌లో కోవిడ్ -19 వ్యాప్తిని కట్టుదిట్టంగా అరికట్టారు.


ఒక జాతీయపార్టీ, ప్రాంతీయపార్టీ కలిసికట్టుగా పనిచేస్తే కొన్ని సంవత్సరా ల్లోనే ఒక రాష్ట్రం ఏ విధంగా వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించగలదో చెప్పడానికి బిహార్ ఉదాహరణ నిదర్శనం. మోదీ-–నితీష్ కుమార్ కలిసికట్టుగా ఏమి సాధించగలరో గత కొన్నేళ్లుగా బిహార్ ప్రజలు గమనించారు. గతంలో లాలూ హయాంలో నెలకొన్న ఆటవిక రాజ్యానికీ, అవినీతి సామ్రాజ్యానికీ, ఎన్డీఏ హయాంలో జరుగుతున్న వినూత్న మార్పులకూ మధ్య తేడాను వారు స్పష్టంగా గమనించగలుగుతున్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుకోవడాన్ని అనుభవించగలుగుతున్నారు. బిహార్ అభివృద్ధిలోనూ, జీవన ప్రమాణాల్లోనూ ఉన్నత ప్రమాణాలు సాధించాలంటే ఎన్డీఏను గెలిపించడం తప్పమరో మార్గం లేదని బిహార్ ప్రజలకు తెలుసు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి ఎన్నికల సభలోనూ ఇదే విషయాన్ని చెబుతున్నారు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-10-27T05:49:44+05:30 IST