రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ కావాలి!

ABN , First Publish Date - 2020-10-03T06:15:35+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఆమోదంతో 1972 నుండి వెనుకబడిన తరగతులను (బి.సి) నాలుగు గ్రూపులుగా....

రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ కావాలి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఆమోదంతో 1972 నుండి వెనుకబడిన తరగతులను (బి.సి) నాలుగు గ్రూపులుగా వర్గీకరించి మొత్తం 92 కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. వీటిలో గ్రూప్–-ఏ 37 కులాలకు 7%, గ్రూప్-–బి 21 కులాలకు 10% గ్రూప్-–సిలో షెడ్యూలు కులాలకు చెంది క్రిస్టియన్ మతంలోనికి మారిన వారికి 1%, గ్రూప్–-డి 33 కులాలకు 7% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తదనంతరం 1975 వరకు అనంతరామన్ కమిషన్ అనుమతి లేకపోయినప్పటికీ మెహతర్ (ముస్లిం–- వీరు ముస్లింలలో పాకీపని చేసేవారు), మందుల, కునాపులి అనే మూడు కులాలను బీసీ–-ఎ గ్రూపులో చేర్చారు. ఫలితంగా మొత్తం బీసీ–-ఎ గ్రూపులో కులాల సంఖ్య 40కి చేరింది. ముస్లింలలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన 14 వర్గాలను బీసీ కమిషన్ ద్వారా గుర్తించి 2007 నుంచి ప్రత్యేకంగా బీసీ-–ఇ గ్రూపులో చేర్చి 4% రిజర్వేషన్లు కల్పించారు. సదరు ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసినప్పటికీ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా షరతులతో కూడిన రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. 2007 నాటికి బీసీ కులాల సంఖ్య 109కి చేరింది, బీసీ రిజర్వేషన్లు 29%, ఎస్సీ- 15%, ఎస్టీ -6% మొత్తం వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతంగా అమలు జరుగుతున్నాయి.


మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం 20 ద్వారా 1993లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2008 నుంచి 2011 వరకు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ-–ఎ గ్రూపులో 15 కులాలను చేర్చారు. దీనితో ఆ గ్రూపులో మొత్తం కులాల సంఖ్య 55కు చేరింది. సదరు బీసీ కమిషనులో ఒక్క సభ్యుడు కూడా బీసీ-–ఎ కులాలకు చెందినవారు లేకపోవడం గమనార్హం. మరోవైపు బోగస్ బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు రోజురోజుకు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. బీసీ గ్రూపుల్లోని కులాల పేర్లపై కుల ధ్రువీకరణ పత్రాలు బీసీయేతరులు తీసుకొని రిజర్వేషన్లు పొందుతున్నారు. ఉదాహరణకు దాసరి కులంలో రెండు ఉప జాతులు ఉన్నాయి. 1) వారసత్వపు వృత్తిపర నేరస్థులుగా ముద్రపడినవారు, బిక్షాటన చేసేవారు: వీరిని బీసీ–ఎ గ్రూపులో చేర్చారు. 2) క్రిష్ణ బలిజ వీరిని బీసీ-–డిలో చేర్చారు. కానీ వీరందరూ కూడా దాసరి కులంగా పేర్కొని బీసీ–-ఎ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. జంగం కులంలో రెండు ఉప జాతులు ఉన్నాయి. 1) వృత్తిపరమైన భిక్షాటన చేసేవారు 2) పూజారులు. వీరిని లింగాయతులు అంటారు. వీరిని బీసీ జాబితాలో చేర్చకపోయినా జంగం కులం అని చెప్పి బీసీ-–ఎ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. 


తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జీవో 3 ద్వారా ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమకు చెందిన 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి మొత్తం 119 కులాలను బీసీలుగా గుర్తించారు. ఆంధ్ర ప్రాంతంలోని పర్యాయపదాలుగా కొనసాగుతున్న బీసీ కులాలను కూడా తొలగిస్తే బాగుండేది ఉదాహరణకు బీసీ–-ఎ గ్రూపులో క్రమ సంఖ్య 1లో తెలంగాణ ప్రాంతంలో బెస్త, గంగపుత్ర, గూండ్లవారు మాత్రమే జీవనం గడుపుతున్నారు. మిగతా పర్యాయపదాలు కలిగిన అగ్నికుల క్షత్రియ, జాలరి, వాడ బలిజ, పల్లి, వన్నెకుల క్షత్రియ, వన్నె కాపు, వన్నె రెడ్డి, పల్లి కాపు, పల్లి రెడ్డి, నెయ్యల, పట్టాపు కులాలను తొలగించాలి. అదేవిధంగా బీసీ-–ఎలో రెడ్డిక, బీసీ-–డిలో సిస్టకరణం కులాలను తొలగించాలి. ఇవి ఉత్తర ఉత్తరాంధ్రకు సంబంధించిన కులాలు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో జీవో 25 ద్వారా మొదటి బీసీ కమిషన్‌ను చైర్మన్, ముగ్గురు సభ్యులతో నియమించింది. వీరి పదవీకాలం అక్టోబర్ 2019లో ముగిసింది. ఈ బీసీ కమిషన్ అధికారాలను తగ్గించి, కేవలం ఏదైనా కులాన్ని చేర్చడానికి లేదా తొలగించడానికిఇ పరిమితం చేసి చైర్మన్‌గా విశ్రాంత జడ్జిని నియమించాలనే నిబంధనను సడలించారు. సదరు బీసీ కమిషన్ మొదటి నివేదికను 2017లో ఇస్తూ, బీసీ–-ఇ గ్రూపులోని ముస్లిం వర్గాలకు కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని సూచించింది. పదవీకాలం ముగిసే నాటికి 13 కులాలను బీసీ-–ఎ గ్రూపులో చేర్చాలని, 4 కులాలను బీసీ-–డి గ్రూపులో చేర్చాలని నివేదిక సమర్పించింది. కానీ బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిలో పెంచడానికి ప్రయత్నం చేయలేదు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 24 శాతానికి తగ్గించిన సమస్య మీద దృష్టి పెట్టలేదు. అనేక సమస్యలను పరిష్కరించకుండానే పదవీకాలం ముగిసింది. సదరు బీసీ కమిషన్లో బీసీ-–ఎ గ్రూపు కులాలకు చెందిన చైర్మన్ లేదా ఒక్క సభ్యుడు కూడా లేకపోవడం గమనార్హం. బీసీ కమిషన్ ఏర్పాటులోనే సామాజిక న్యాయం లేకపోతే బీసీ నాయకులు, కుల సంఘాలు సామాజిక న్యాయం కావాలనడం కులస్వామ్యంలో అత్యాశే అవుతుంది. 


కేంద్ర ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 338–బి ద్వారా రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించి జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌ను రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా భావించకుండా నిష్ణాతులైన వారిని ప్రత్యేక చట్టం ద్వారా రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ బీసీ కమిషన్‌ను శాశ్వత పద్ధతిలో ఏర్పాటు చేయాలి. కేంద్రం మాదిరిగా చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులను నియమించాలి. సదరు కమిషన్‌లో బీసీ-–ఎ గ్రూపు కులాలకు చెందినవారిని ఇద్దరు సభ్యులకు తగ్గకుండా నియమించాలి. అదే విధంగా రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణకు సంబంధించి కమిషనులో సభ్యులందరికీ సమాన బాధ్యతలు అప్పగించాలి ఎప్పటికప్పుడు బోగస్ బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను ఏరివేసి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.


కోడెపాక కుమార స్వామి

Updated Date - 2020-10-03T06:15:35+05:30 IST