బడుగుజన బాంధవుడు

ABN , First Publish Date - 2020-10-07T06:05:20+05:30 IST

జీవితం మొత్తం అణగారిన వర్గాల ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్ అర్ శంకరన్...

బడుగుజన బాంధవుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా శంకరన్‌ బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో దళిత, ఆదివాసీల సంక్షేమం, అభ్యున్నతి, అభివృద్ధికి బాటలు వేసే అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క ఏడాదిలోనే 120కి పైగా జీవోలు జారీ చేసిన ఘనత ఆయనది. హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను సాంఘిక సంక్షేమశాఖగా మార్చడానికి సంబంధించిన జీవో వాటిలో ఒకటి. సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటీడిఏ)లను ఏర్పాటు చేయడంలో, గిరిజన ఉప ప్రణాళికలను ప్రవేశపెట్టడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. 1984లో బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు.


జీవితం మొత్తం అణగారిన వర్గాల ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్ అర్ శంకరన్. జీవితమంతా నిజాయితీగా గడపటమే కాదు, తనకంటూ సొంత ఇల్లు కూడా ఏర్పరచుకోని నిరాడంబరి. ఐఏఎస్ అధికారులు సమాజంలోని అట్టడుగువర్గాల ప్రజలకు ఏ స్థాయిలో సేవ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చో ప్రత్యక్షంగా ఆచరించి చూపించిన మహనీయుడు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాలనా విభాగాలేవైనా సరే వారి ప్రథమ కర్తవ్యం అణగారిన వర్గాల సమస్యల పరిష్కారమే అని నమ్మి ఆచరించిన వ్యక్తి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతి కోసం పాలనావ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 


శంకరన్,‌ తమిళనాడులోని తంజావూరులో 1934 అక్టోబర్ 22న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1956లో ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1959లో కర్నూల్ జిల్లా నంద్యాల సబ్‌కలెక్టర్గా, తర్వాత నెల్లూర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. 1971–73 మధ్యకాలంలో కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా ఉన్న కుమారమంగళం వద్ద స్పెషల్ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేసిన కాలంలో బొగ్గు గనులను జాతీయం చేయటంలో అయన పాత్ర అత్యంత కీలకమైనది. బొగ్గు గని కార్మికులను బానిసలుగా చూస్తున్న స్థితిలో వారికి రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో ఆయన కృషి అభినందనీయం. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో శంకరన్‌ దళిత, ఆదివాసీల సంక్షేమం, అభ్యున్నతి, అభివృద్ధికి బాటలు వేసే అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క ఏడాదిలోనే 120కి పైగా జీవోలు జారీ చేసిన ఘనత ఆయనది. అందులో 100కి పైగా ఉత్తర్వులు ఆయన సంతకంతోనే ఉంటాయి. హరిజన సంక్షేమ మంత్రిత్వశాఖను సాంఘిక సంక్షేమశాఖగా మార్చడానికి సంబంధించిన జీవో ఆయన జారీ చేసిన వాటిలో ఒకటి. ఆదివాసీల కోసం సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటీడిఏ)లను ఏర్పాటు చేయడంలో, గిరిజన ఉప ప్రణాళికలను ప్రవేశపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించారు. 1984లో బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక అంశాలలో రాణించటానికి తగిన విధానాలు రూపొందించారు. 1976లో వచ్చిన వెట్టిచాకిరీ నిషేధ చట్టం అయన కృషి ఫలితమే ‌అని చెప్పవచ్చు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడు అక్కడ కేంద్ర పారామిలటరీ దళాల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు తన శక్తి మేరకు ప్రయత్నం చేశారు. 


భారత ప్రభుత్వం శంకరన్‌ సేవలను గుర్తించి 2005లో పద్మభూషణ్ అవార్డును ప్రకటించగా సున్నితంగా తిరస్కరించి తన నిరాడంబరతను చాటుకున్నారు. ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాల్లో పని చేస్తున్నప్పుడు ఆయనను బదిలీ చేయగా దానికి నిరసనగా ప్రజలు ఆందోళనకు దిగడం, వారికి ఆయనపై ఉన్న అచంచల విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనం. ఏ రోజూ ఆయన తన స్వంత పనులకు ప్రభుత్వ వాహనాన్ని వాడుకోలేదు. దానికి ఆయన వ్యతిరేకం. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు అక్కడి మహిళా కళాశాలలో సరియైన వసతులు లేవని తెలిసి కలెక్టర్ బంగ్లాను వాడుకోమని ఇచ్చిన ఘనత శంకరన్‌కే దక్కింది. బిళ్ళ బంట్రోత్ లేకపోతే ఆయనను కలెక్టర్‌గా గుర్తించడం కూడా కష్టమే. అంత సాధారణమైన జీవితాన్ని అయన గడిపేవారు. అందుకే పని చేసిన ప్రతి చోట ప్రజలు ఆయనను ‘ఐఏఎస్ గాంధీ’ అని పిలిచేవారు. పదవీ విరమణ అనంతరం తనకు వచ్చిన పెన్షన్ కూడా పేద ఎస్‌సి, ఎస్‌టీ విద్యార్థుల చదువుల కోసం ఖర్చు పెట్టేవారు. పదవీ విరమణ అనంతరం, ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన పోరులో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల కోసం మానవతా దృక్పథంతో మేధావులతో కూడిన పౌర స్పందన వేదికను ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య చర్చలు జరగడంతో ముఖ్యమైన భూమిక పోషించారు. 2004లో ప్రభుత్వంతో మాట్లాడి నక్సలైట్‌లను శాంతి చర్చలకు ఆహ్వానింపజేయడంలో అనుసంధానకర్తగా వ్యవహరించారు. దేశచరిత్రలోనే దీనిని ఒక అరుదైన సంఘటనగా అభివర్ణించవచ్చు. దళిత మానవహక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్‌తో కలిసి సఫాయి కర్మచారి అందోళన్ అనే సంస్థను స్థాపించి పాకీ పనివారి విముక్తి కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వం వారి సంక్షేమం మీద దృష్టి సారించేలా చేశారు. ఆ ఉద్యమం వల్ల ఎంతోమంది చేతితో మలం ఎత్తే అమానవీయ విధుల నుంచి విముక్తి పొందారు. 1985లో కారంచేడు ఘటన అనంతరం బాధితులకు పునరావాసం కల్పించడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు.


‘ప్రజల ఐఏఎస్ అధికారి’గా, మహోన్నత మానవతావాదిగా చరిత్రలో నిలచిన శంకరన్ జీవితం నేటి తరం అధికారులకు, సామాజిక ఆర్ధిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నవారందరికీ స్ఫూర్తిదాయకం. ప్రజా సంక్షేమానికే పూర్తికాలం అంకితమైన ఆయన 2010 అక్టోబర్ 7న హైదరాబాద్‌లో మరణించారు. నిరుపేదల సేవే సిసలైన ప్రజాపాలన అని నిరూపించి కోట్లాది మంది దళిత ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన అసలు సిసలు ప్రజాసేవకుడు ఐఏఎస్ శంకరన్.

పుల్లూరు వేణుగోపాల్

(నేడు ఎస్ ఆర్ శంకరన్ 10వ వర్ధంతి)

Read more