జెండర్‌ న్యాయంపై జాగృతి

ABN , First Publish Date - 2020-12-10T09:52:45+05:30 IST

పెద్దపెద్ద రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజానీకం వరకు ఒకరిని ఒకరు తిట్టుకునేటప్పుడు ‘‘మగతనం లేనోడు’’, ‘‘గాజులు తొడుక్కో’’...

జెండర్‌ న్యాయంపై జాగృతి

స్త్రీలను చూసే కోణంలో మార్పు తీసుకురావాల్సిన ప్రభుత్వం దానిపై దృష్టి సారించకుండా మతాన్ని, కులాన్ని పెంచి పోషించడంతో సమాజంలో స్త్రీలు మరింతగా బానిసలుగా మారుతున్నారు. ఈ విష భావజాలాన్ని మార్చాలంటే స్త్రీలే కాదు, పురుషులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. మూలాలను మార్చే పనిలో అందరం భాగస్వాములు అయినప్పుడే జెండర్‌ సమన్యాయం, సమానత్వం, సాధ్యం అవుతాయి.


పెద్దపెద్ద రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజానీకం వరకు ఒకరిని ఒకరు తిట్టుకునేటప్పుడు ‘‘మగతనం లేనోడు’’, ‘‘గాజులు తొడుక్కో’’ లాంటి పదాలను మామూలుగా వాడటం మనం వింటూ ఉంటాం. ఇవన్నీ ఆడవారిని తక్కువ చేసి చూపించే పదజాలం. ఇది ఎంతగా వేళ్లూనుకుని ఉంది అంటే, విద్యావ్యవస్థలో కూడా ఇదే ప్రతిబింబిస్తోంది. చిన్నపిల్లల పుస్తకాల్లో కుటుంబానికి వంట చేసే మనిషి తల్లి అని, సంపాదించేవాడు తండ్రి అని పాఠాలు ఉంటాయి. ఇంటిపనుల్లో ఆడపనులు, మగపనులు అనే విభజన ప్రస్ఫుటంగా ఉంది. మనం ఒక వీధిలో పొద్దున నడుస్తుంటే ఇంటి ముందు నీళ్లు జల్లి శుభ్రం చేసే మగవారిని ఎప్పుడైనా చూసామా? పోనీ ఇంట్లో భార్యకి భర్త టీ పెట్టివ్వడం కానీ, ఇంటిపనుల్లో సహాయపడడం కానీ ఎక్కడైనా చూశామా? లేదు. అంతగా జెండర్‌ విభజన కరుడుకట్టినట్టుగా వ్యవస్థీకృతమయింది. ఆడవాళ్లు కూడా ఇది సహజమేనని భావించే రీతిలో ఇది పాతుకుపోయింది. ఎవరైనా మగవాడు చీపురు పట్టుకుంటే ‘‘అయ్యో మేము ఉన్నాం కదా’’ అని అడ్డుపడేవాళ్లు ఆడవాళ్లే. ఇంతగా ఘనీభవించిన జెండర్‌ అసమానతలు స్త్రీలపై జరుగుతున్న అనేక రకాల హింసకు, పెత్తందారీతనానికి పునాది. ఉన్నత మద్యతరగతి వర్గాల్లో ఈ జెండర్‌ వివక్షలో కొంత మార్పు వచ్చినప్పటికీ, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, శ్రామికవర్గాల్లో ఈ జెండర్‌ వివక్ష అమితంగా ఉంది. దళితవర్గాల్లో, పేదల్లో భార్యల్ని నిత్యం కొట్టడం, ఆమెపై పూర్తి పెత్తనం చేయడం సర్వసాధారణం. కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీ స్త్రీలు భర్తను యజమాని అని అనటం నేటికీ వాడుకలో ఉంది. ఇంతగా ఘనీభవించిన లింగవివక్షను రూపుమాపడం ఎంతో కష్టతరం అయిన పని. అందుకోసం ఐక్యరాజ్యసమితి నుంచి కిందిస్థాయి వరకు సమాజాన్ని జాగృతం చేసే ప్రచారం జరగాలి. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా నవంబర్‌ 25వ తేదీనుంచి డిసెంబర్‌ 10వ తేదీన మానవహక్కుల దినం వరకు 16 రోజుల పాటు అంతర్జాతీయ ప్రచారోద్యమం జరిగింది. ఇందులో భాగంగా దళిత స్త్రీ శక్తి, సంస్థ దళిత ఆదివాసీ స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం నిర్వహిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ పనిచేస్తున్న ప్రాంతాల్లోని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు, పత్రికా సమావేశాలు, అవగాహనా తరగతులు, మానవహారాలు వంటి భిన్నరీతుల్లో ప్రచారోద్యమం నిర్వహించింది. లింగవివక్షకు సంబంధించి సమాజంలో ఉన్న పురుషాధిక్య భావజాలం గురించి; స్త్రీలు సైతం తెలియకుండానే ఆ భావజాలాన్ని పాటించడం, కులం, మతం, సంస్కృతి, సాహిత్యం, సినిమాలు, చివరికి విద్యాసంస్థల్లో కూడా ఆ భావజాలం వేళ్లూనుకుని ఉండడం, దాన్ని రూపుమాపాల్సిన ఆవశ్యకత గురించి ప్రచారోద్యమంలో దళిత స్త్రీశక్తి వివరించింది. స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, విద్యాసంస్థల్లో వివక్ష, అశ్లీల సాహిత్యం, మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతున్న యువత, మద్యపానం, వరకట్న వేధింపులు, ఉపాధిలో దళిత స్త్రీలపై వివక్ష వంటి అంశాలపై పోస్టర్ల రూపంలో ప్రచారం జరిగింది. చట్టాలు ఎంతో పదునైనవి అయినప్పటికీ వాటి అమలు తీరు సరిగ్గా లేకపోవడం గురించి, అంబేడ్కర్‌ ఆలోచనావిధానం, రాజ్యాంగస్ఫూర్తిని ప్రోది చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మేధావులు, వివిధ సంఘాలు, అధికారుల మీద ఉందని ఈ ప్రచారోద్యమం గుర్తుచేసింది. 


స్త్రీలకు ముఖ్యంగా దళిత ఆదివాసి స్త్రీలకు సాధికారత, స్వయంప్రతిపత్తి అవసరం. స్త్రీలు ఆర్థికంగా స్థిరపడితే బానిసత్వం తొలగిపోతుంది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆచరణలో ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థాగతంగా చట్టాల్ని పటిష్టంగా అమలుపరచాల్సిన బాధ్యత కనుమరుగయ్యాయి. వేదాల్లో దేవతగా వర్ణించి వాడుకలో బానిస కంటే హీనంగా చూసే భావజాలం, స్త్రీలను భోగవస్తువుగా చూసే కోణం ప్రబలిఉండటం వల్ల అత్యాచారాలు, హత్యలు పెట్రేగిపోవడం ప్రభుత్వాలకు సిగ్గుచేటు. స్త్రీలను చూసే కోణంలో మార్పు తీసుకురావాల్సిన ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా మతాన్ని, కులాన్ని పెంచి పోషించడతో సమాజంలో స్త్రీలు మరింతగా బానిసలుగా మారుతున్నారు. ఈ విష భావజాలాన్ని మార్చాలంటే స్త్రీలే కాదు, పురుషులు కూడ ప్రజాస్వామ్యబద్దంగా ఆలోచించాలి. మూలాలను మార్చే పనిలో అందరం భాగస్వాములు అయినప్పుడే జెండర్‌ సమన్యాయం, సమానత్వం, సాధ్యం అవుతాయి. అంతేగాని పెత్తందారీ కులాల పిల్లలు వేదనలకు గురైనప్పుడో, ఏదన్నా సంఘటనలో తీవ్రంగా సంఘాలు స్పందించినపుడో కంటితుడుపు చర్యగా స్పందిస్తే సమానత్వం సాధ్యం కాదు. కులం, వర్గం, మతం, విషయాల్లో వివక్షను అంతమొందించినప్పుడే ప్రజాస్వామ్య సమాజం పరిఢవిల్ల గలుగుతుంది. లేకుంటే ప్రణయ్‌తో పరువుహత్యలు ఆగకుండా హేమంత్‌ వరకు వెళతాయి. ఇలాంటి అనేక విషయాల్లో సమాజం మొత్తం చైతన్యం కావాలి అనేదే ఈ ప్రచారోద్యమం ముఖ్య ఉద్దేశం. 


దళిత ఆదివాసీ స్త్రీలపై, బాలికలపై సాగుతున్న హింసపై నేడు హైదరాబాద్‌లోని మదీనా ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో అధికారుల సమక్షంలో జరిగే రౌండ్‌టేబుల్‌ సమావేశంతో ఈ ప్రచారోద్యమం ముగుస్తుంది.

ఝాన్సీ గెడ్డం, జాతీయ కన్వీనర్‌, దళిత స్త్రీశక్తి 

Updated Date - 2020-12-10T09:52:45+05:30 IST