పదవ తరగతి పరీక్షలు సాధ్యమేనా?

ABN , First Publish Date - 2020-04-24T05:48:23+05:30 IST

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. మొదట ప్రకటించినట్లు మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు జరగాల్సిన పరీక్షలు స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మార్చి 30కి వాయిదా పడ్డాయి. ఆ వెంటనే ముంచుకొచ్చిన...

పదవ తరగతి పరీక్షలు సాధ్యమేనా?

ప్రభుత్వం తక్షణం పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం కూడా సరైనదే అవుతుంది. ఇది పదవ తరగతి కాబట్టి విద్యార్థుల ఉత్తీర్ణతకు సంబంధించిన మార్కులతో కూడిన పాస్ సర్టిఫికెట్‌ను బోర్డ్ జారీచెయ్యాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుంది. దీనికోసం వీరికి ఇప్పటికే నిర్వహించిన ఎస్.ఎ 1 మార్కులు, ప్రీఫైనల్ మార్కులు కలిపితే వచ్చిన సరాసరిని తీసుకొని మార్కుల జాబితా తయారు చెయ్యవచ్చు. అంతేగాక గత నాలుగైదేళ్ళుగా ఉన్న 20% ఇంటర్నల్ మార్కులు కూడా వేరేగా తీసుకొని వీటన్నిటి సరాసరితో సర్టిఫికేట్ ఇవ్వవచ్చు.


కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. మొదట ప్రకటించినట్లు మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు జరగాల్సిన పరీక్షలు స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మార్చి 30కి వాయిదా పడ్డాయి. ఆ వెంటనే ముంచుకొచ్చిన కరోనా కారణంగా మళ్లీ రెండోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుత లాక్‍డౌన్ మే 3 వరకు ఉంటుంది. రాష్ట్ర విద్యాశాఖామంత్రి మార్చి 24న చేసిన మొదటి ప్రకటనలో రెండు వారాల తరవాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 15న చేసిన రెండవ ప్రకటనలో ఈ పరీక్షల నిర్వహణ ఎప్పుడు సాధ్యమవుతుందో మే 3 తరవాత తెలియజేస్తామని ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం పరీక్షలు జరిగినట్లయితే మే 3కి ఫలితాలు వచ్చేవి. అటువంటిది మే 3 తరవాత పరీక్షల తేదీలు ప్రకటించి మే 10, 15 తేదీల నుండి పరీక్షలు నిర్వహిస్తారనుకొంటే అప్పటికి ఎండల తీవ్రత ఎంత ఉంటుందో తెలియనిది కాదు. పైపెచ్చు కరోనా తీవ్రత అప్పటికి ఎలా ఉంటుందో అంతుపట్టని పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రతిరోజూ 30కి తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి.


ఈ నేపథ్యంలో మే 3 తరవాతనైనా పరిస్థితి అదుపులోకి వస్తుందా అనేది అనుమానమే. అదుపులోకి వచ్చినప్పటికి లాక్‌డౌన్ సమయంలో పాటిస్తున్న నిబంధనలు కొనసాగించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. సమూహాలుగా బైటకు రావడం, గుమికూడటంలాంటి నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ తేలిక కాదు. గతంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడిన మాటల్లో పరీక్షలు నిర్వహించేటప్పుడు విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకొని నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు జరిగిపోయింది. ఈ కేటాయింపు కరోనాకు ముందే జరిగింది కాబట్టి, మంత్రి మాటల ప్రకారం విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను పునఃకేటాయింపు చెయ్యాలి. గతంలో ఒకో సెంటరుకు 300మంది విద్యార్థులను కేటాయిస్తే ఆ సంఖ్య ఇప్పుడు 150గా చేసి తిరిగి కేంద్రాలను కేటాయించాలి. అంటే పరీక్షాకేంద్రాల సంఖ్యను దాదాపు రెట్టింపు చెయ్యాల్సి ఉంటుంది. అధికార యంత్రాం గం దీనికి అవసరమైన గ్రౌండ్ వర్క్ చెయ్యాల్సి ఉంటుంది. పైగా విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు 3కి.మీల పరిధిలోనే వారి పరీక్షాకేంద్రం ఉండాలనే నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా ఇన్విజిలేటర్స్ సంఖ్య, సూపర్ వైజర్స్ సంఖ్యలతోబాటుగా సహాయక సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ స్వల్ప వ్యవధిలోనూ, పటిష్ఠంగానూ చెయ్యాలి.


పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యాలను కల్పిం చడం మరొక సమస్య. సాధారణంగా ఒకో పాఠశాలలో చదివే విద్యార్థులకు ఐదునుండి ఎనిమిది వరకు సెంటర్లు ఉంటాయి. అందువలన ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చెయ్యకుండా ఆ బాధ్యతను వారి తల్లిదండ్రులకే వదిలివేస్తాయి. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్ళటం పరీక్ష అయ్యేటంతవరకు అక్కడే ఉండటం, పరీక్ష తరువాత వారిని తోడ్కొనిపోవడం చేస్తుంటారు. కరోనా నిషేధాజ్ఞల నేపథ్యంలో వీరందరికి రవాణా సౌకర్యాలు ఏర్పాటుచెయ్యడం ప్రభుత్వానికి కత్తిమీద సామే.


మరొక సమస్య హాస్టల్ విద్యార్థులది. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యేవారిలో కనీసం 25 శాతం మంది విద్యార్థులు నగరాలలోనూ, పట్టణాలలోనూ హాస్టల్స్‌లో ఉండి చదువుకొనేవారే ఉంటారు. సుమారు రెండు వారాల పాటు జరిగే ఈ పరీక్షలకు హాస్టల్ విద్యార్థులు హాజరవ్వాలంటే తప్పనిసరిగా ఇప్పటికే మూతబడిఉన్న హాస్టల్స్ తిరిగి తెరుచుకోవాలి. అక్కడ పనిచేసే పనివాళ్లు, వారికి అవసరమైన నిత్యావసరాలు, పాలు కూరగాయల సరఫరా లాంటివన్నీ సరికొత్త తలనొప్పుల్ని తలకెక్కించుకోవడమే అవుతుంది. అంతేగాక వారు వారివారి గ్రామాలనుండి హాస్టల్సుకు చేరుకోవడానికి అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పించడంకూడా ఇబ్బందికరమైన విషయమే.


ఎన్నో సమస్యలకోర్చుకొని ప్రభుత్వం పరీక్షలు నిర్వహించినప్పటికి సమస్యలు అక్కడితో ఆగిపోవు. వెంటనే ఉపాధ్యాయులందరినీ ఒకచోట చేర్చి మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. మే చివరి వరకు పరీక్షలు నిర్వహించి ఆ తరువాత మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, ఆ వెంటనే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, వాటి మూల్యాకనం ఇవన్నీ ప్రభుత్వానికి భారమే.


ఇక విద్యార్థులవైపునుండి చూస్తే ఈపాటికి పరీక్షలైపోయి సెలవలను హాయిగా గడుపుతూ వచ్చే సంవత్సరానికి ఎక్కడ చేరాలో ప్రణాళికలు వేసుకుంటూ ఫలితాలకోసం ఎదురుచూస్తూ వుండేవారు. మరి ఇప్పటి వారి మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. పరీక్షలు కాలేదు. ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అప్పటివరకు ఇంట్లోనే ఉండి అయి పోయిన సిలబస్‌నే మళ్ళీ మళ్ళీ చదువుతూ వాళ్ళు మానసిక ఆందోళనకు గురికావల్సి వస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని జూనియర్ కాలేజీలు 10వ తరగతి విద్యార్థులకు ఇంటర్లోకి అడ్మిషన్లు ఇచ్చి ఇంటర్మీడియట్ సిలబస్‌ను ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నామని, పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ వచ్చిన తరువాత అప్పుడు పరీక్షలకు ప్రిపేర్ అవ్వవచ్చని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళపరుస్తున్నారు.


ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాలు విద్యార్థులలోని మానసిక ఆందోళనను తగ్గించేవిధంగానూ వచ్చే విద్యా సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొనేలాగానూ ఉండాలి. నిజానికి విద్యార్థుల విద్యా సంవత్సరం అయిపొయే సమయంలో అదీ వేసవి కాలంలో ఈ కరోనా సమస్య వచ్చింది కాబట్టి ఎంతోకొంత వచ్చే విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు. అదికూడా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టిన తరవాత మాత్రమే సాధ్యమవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభకాలంలో తీసుకోవాల్సిన చర్యలను అలావుంచితే ప్రభుత్వం తక్షణం పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి క్లిష్టసమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం కూడా సరైనదే అవుతుంది. వాటిలో ముఖ్యంగా ఆరు నుండి తొమ్మిదో తరగతి వరకు చేసినట్లుగానే పరీక్షల రద్దు మొదటి అంశం.


2014 నుండి గమనిస్తే వరసగా 91, 91, 91, 91, 94, 95లు వార్షిక పాస్ పర్సెంటేజ్‌లుగా నమోదయ్యాయి. ఇప్పుడు పరీక్షలు నిర్వహించకపోవడం వలన 100% ఉత్తీర్ణత నమోదవుతుంది. జైఆంధ్ర ఉద్యమ సమయంలో అనుకుంటాను, ఇటువంటిదే జరిగింది. అయితే ఇది పదవ తరగతి కాబట్టి విద్యార్థుల ఉత్తీర్ణతకు సంబధించిన మా ర్కులతో కూడిన పాస్ సర్టిఫికెట్‌ను బోర్డ్ జారీచెయ్యాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుంది. దీనికోసం వీరికి ఇప్పటికే నిర్వహించిన ఎస్.ఎ 1 మార్కులు, ప్రీఫైనల్ మార్కులు కలిపితే వచ్చిన సరాసరిని తీసుకొని మార్కుల జాబితా తయారు చెయ్యవచ్చు. అంతేగాక గత నాలుగైదేళ్ళుగా ఉన్న 20% ఇంటర్నల్ మార్కులు కూడా వేరేగా తీసు కొని వీటన్నిటి సరాసరితో సర్టిఫికేట్ ఇవ్వవచ్చు. దాదాపుగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రీ ఫైనల్ పరీక్షలను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే వారే పంపించిన ప్రశ్నాపత్రాలతో నిర్వహించారు. వాటి మూల్యాంకనం కూడా అయిపోయింది. అలాగే ఎస్.ఎ 1 మార్కులు కూడా అన్ని పాఠశాలలూ ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి అప్‌లోడ్ చేసేశాయి. ప్రీ ఫైనల్ మార్కులూ, 20% ఇంటర్నల్ మార్కులు పాఠశాలల వద్ద నుండి తెప్పించుకొంటే సరిపోతుంది. రెండవ సూచన ఏమంటే– ఏ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అక్కడే పరీక్షలు నిర్వహించడం. నిజానికి దీని వలన పరీక్షా కేంద్రాల నిర్వహణ, ఇన్విజిలేటర్ల సమస్య లాంటివాటిని అధిగమించవచ్చు. కానీ మిగిలిన సమస్యలన్నీ అలాగే ఉంటాయి. ఏమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి పరీక్షల నిర్వహణపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

బండ్ల మాధవరావు

విద్యావేత్త

Updated Date - 2020-04-24T05:48:23+05:30 IST