ప్రభుత్వాలు ప్రజలవా? వ్యక్తులవా?

ABN , First Publish Date - 2020-04-15T06:30:27+05:30 IST

మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ముఖ్యమంత్రి, గవర్నర్ కలిసి అసాధారణ శాసనాధికారాన్ని వినియోగించి చట్టాన్ని సవరించేశారు. రాజ్యాంగ అధికారపీఠంలో ఉన్న ఒక్క స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రభుత్వ అనుకూల వ్యక్తిగా...

ప్రభుత్వాలు ప్రజలవా? వ్యక్తులవా?

ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌ను తొలగించడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు వెలువరించిన రెండు తీర్పులను ఉపయోగించుకున్నది. అవి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి సంస్థ అధ్యక్షుడి పదవీ కాలం తగ్గింపు, ఆ పదవిలో ఉన్న కైలాస్ చంద్ మహాజన్ తొలగింపు; ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అపర్మిత్ ప్రసాద్ సింగ్ తొలగింపు కేసులకు సంబంధించినవి. ఈ రెండు తీర్పులు తమకు అనుకూలం అని రాష్ట్ర ప్రభుత్వ నిపుణులు భావిస్తున్నారు. మౌలిక సూత్రాలను పరిశీలిస్తే ఆ రెండిటిలో ఏ తీర్పూ రమేశ్ కుమార్ తొలగింపును సమర్థించే అవకాశం లేదు.


మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ముఖ్యమంత్రి, గవర్నర్ కలిసి అసాధారణ శాసనాధికారాన్ని వినియోగించి చట్టాన్ని సవరించేశారు. రాజ్యాంగ అధికారపీఠంలో ఉన్న ఒక్క స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రభుత్వ అనుకూల వ్యక్తిగా, అటువంటి వ్యవస్థగా మార్చేందుకు ఎపి పంచాయతీరాజ్ చట్టం- 1994ను సవరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తమ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పదవీకాలం ఎంత ఉండాలో నిర్ణయించే అధికారం ఉంది. ఉండాలి కూడా. పదవీకాలం అయిదేళ్లు ఉండాలా లేక మూడేళ్లా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ నిర్ణయించాల్సిందే. శాసనసభ ఏయే శాసనాలను చేయగలదో ఆ శాసనాలన్నీ ప్రభుత్వం శాసనసభ లేనప్పుడు చేయగలుగుతుంది. ఇదంతా రాజ్యాంగబద్ధమే. అయితే ఈ ఆర్డినెన్సు చేయడం కూడా రాజ్యాంగ బద్ధం ఎందుకు కాదన్నది ప్రశ్న. 


ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా అధికారాన్ని వాడి, ప్రజాభిప్రాయాన్ని తమవైపు మలచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ పని అధికారంలో ఉన్న ప్రతి పార్టీ చేస్తుంది. అధికార దుర్వినియోగ తీవ్రతలో తేడా ఉంటుందేమో గాని, అంతా ఒక్కటే. ఎన్నికల సమయంలో దుర్వినియోగం ఫిర్యాదులు వచ్చినపుడు మంత్రులు ముఖ్యమంత్రి వంటి పెద్దలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వవలసి వస్తుంది. అందుకు ఎన్నికల కమిషనర్ మీద కోపతాపాలు రావడం, అప్పుడు వారిని పదవినుంచి తొలగించాలనుకోవడం రాజుల అలవాటు. ఈ విధంగా తొలగించడానికి వీల్లేకుండా కమిషనర్ పదవిలో ఉన్నవారికి ఒక ఖచ్చితమైన పదవీకాలం, ఇతర స్థిర ప్రయోజనాలు కల్పించడం చట్టం బాధ్యత. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే కమిషనర్‌కు అయిదేళ్ల పదవీ కాలం ఇవ్వాలని, మధ్యలో తొలగించడానికి వీల్లేదని, ఒకవేళ తొలగించవలసినంత తప్పు చేసినా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే భారీ స్థాయి విధానాన్ని అనుసరించాలని చట్టం నిర్దేశించింది. అంటే పార్లమెంటు మాత్రమే తొలగించాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవ ఎన్నికలకోసం అనేకచోట్ల అనేక హింసా సంఘటనలు, బెదిరింపులు దాడులు జరిగాయని కేంద్ర హోం మంత్రికి రాసిన ఒక లేఖలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. తనకే రక్షణ కొరవడిందని కూడా ఆయన ఆ లేఖలో హోం మంత్రికి చెప్పుకున్నారు. అయితే ఎన్నికల కమిషనర్ ఈ ఫిర్యాదులపై స్పష్టంగా అభిశంసన ఆదేశాలు ఇవ్వలేదు. కాని ఫిర్యాదులు వచ్చిన జిల్లాలలో పనిచేసే రెవిన్యూ, పోలీసు ఉన్నతాధికారులను చాలామందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియను కరోనా వైరస్ కారణంగా వాయిదా వేశారు. సహజంగానే ప్రభుత్వానికి నచ్చలేదు. రమేశ్ కుమార్‌కు కుల, పార్టీ పక్షపాతాన్ని అంటగడుతూ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. 


ముఖ్యమంత్రులకు, మంత్రులకు అనుకూలంగా వ్యవహరించి లాభాలు పొందాలనుకునే అధికారులు, తమకు అనుకూలంగా ఉన్నవారితోనే పాలించాలనుకునే మంత్రులు మన పాలనా వ్యవస్థను అత్యధికంగా శాసిస్తున్న రోజులివి. అనుకూలంగా వ్యవహరించని అధికారులను, స్వ తంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారిని ఇష్టం వచ్చినట్టు మంత్రులు బదిలీ చేస్తూ అడ్డు తొలగించుకుంటున్నారు. తరచూ అనవసరంగా బదిలీలు చేయడం నియంతృత్వానికి తార్కాణం. మంత్రులకు అనుకూలంగా వ్యవహరించడానికి అధికారులు సిద్ధంగా ఉంటే అంతకన్న అవినీతి యంత్రాంగం మరొకటి ఉండదు. కనుక ఈ ఘర్షణలు జరగడం, చివరకు వ్యవహారాలు కోర్టుకు వెళ్లడం జరుగుతున్నది. అటువంటి ఒక సంఘటన ఇది. రమేశ్ కుమార్‌ను తొలగించడం, తొందరగా తొలగించాలన్న ఆతురత తప్ప ఈ ఆర్డినెన్సుకు మరేదైనా లక్ష్యం ఉందా? ఎన్నికల కమిషన్ స్వతంత్రతను రక్షించడానికే ఈ సవరణ అని చెప్పడం నిజమే అయితే అవునో కాదో మనం అంచనా వేసుకోవాలి. 


ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. అధికార దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రవర్తనా నియమావళి అమలు చేసి తీరాలి. దానిపై కోర్టులకు కూడా జోక్యం చేసుకునే అధికారం లేదు. కాని కమిషనర్ రమేశ్ కుమార్ ఉద్యోగమే పోయింది. తీసేశారు. దానికి చట్టం సవరణ. అందుకు ఆర్డినెన్సు. రెండు జీవోలు. వెంటనే మాజీ జడ్జిగారి నియామకం, ఆయన పదవీ స్వీకారం జరిగిపోయింది. ఎన్నికలు ఇంకా ముగియలేదు. మొదటిభాగం రమేశ్ కుమార్ నిర్వహిస్తే రెండో భాగం జస్టిస్ కనగరాజుగారు నిర్వహిస్తారు. ఎన్నికలలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు. ఒక్క వ్యక్తి కోసం చట్టం మారింది. కొత్త అధికార పార్టీ కోసం, కమిషన్ పదవీ కాలం తగ్గింది. చట్టం ప్రజలకోసం అంటారు. ఇదంతా పార్టీకోసం కాదు, గెలవడానికి కాదు, స్వార్థం కోసం కాదు, కేవలం ప్రజల కోసమనే అనుకోవాలి. తప్పదు. 


ఎన్నికల కమిషనర్‌కు మూడేళ్లే పదవీ కాలం ఎందుకు ఉండాలి? అయిదేళ్లు ఎందుకు ఉండకూడదు? ఆర్డినెన్సును ప్రతిపాదించేముందు ప్రభుత్వం ఎవ్వరినైనా అడిగిందా? సంప్రదించిందా? అభిప్రాయ సేకరణ చేసిందా? పోనీ ఎందుకో ముఖ్యమంత్రికి గానీ గవర్నర్‌కు గానీ, మంత్రి వర్గ సభ్యులకు గానీ తెలుసా? అసలు ఆలోచించారా ఎవరైనా? ఏ విధంగానైనా రమేశ్ కుమార్‌ను తొలగించాలనే తొందర తప్ప ఇంకే లక్ష్యమేదైనా ఉందా? 


ఎన్నికల కమిషనర్‌ను కేవలం పార్లమెంటు అభిశంసన ద్వారానే తొలగించాలి. మరోరకంగా తొలగించకూడదని ఎపి చట్టం 200 సెక్షన్, ఆర్టికిల్ 243కె చెబుతున్నది. పదవీ కాలం తగ్గించడం అంటే పదవిలోఉన్న వ్యక్తిని తొలగించడమే కనుక చెల్లదని ఒక వాదం. అవి ఒకటి కాదు కనుక చెల్లుతుందని మరొక వాదం. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తమకు కావలసిన విధంగా ఉన్నాయనుకుని రెండు తీర్పులు వాడుకున్నారు. మొదటి తీర్పు: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి సంస్థ అధ్యక్షుడి పదవీ కాలం తగ్గించి, ఆ పదవిలో ఉన్న కైలాస్ చంద్ మహాజన్‌ను తీసేయాలని కొత్త ప్రభుత్వం భావించింది. ఈ రాజకీయ సమస్యను రాజ్యాంగ నియమాలతో సరిచేయాలి. ఇది న్యాయవాదుల ప్రయత్నం. వారికో వీరికో మరెవరికో ఉపయోగపడేవో లేక ఏ ఉపయోగం లేనివో తీర్పులు చాలా కష్టపడి ఇప్పిస్తారు. 1992లో ఇలాగే కష్టపడి ప్రభుత్వాన్ని గెలిపించారు. కైలాస్ చంద్ మహజన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పదవీ కాలం తగ్గించడం అంటే కైలాస్ చంద్‌ను తొలగించడం కాదు అని చెప్పింది. ఇప్పుడు ఎపి ప్రభుత్వానికి ఇంతకన్న అనుకూలమైన తీర్పు మరొకటి లేదని అనుకున్నారు. ఈ విషయం మరొక కేసులో ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లో అపర్మిత్ ప్రసాద్ సింగ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తూ స్థానిక ఎన్నికలలో హింసాత్మక సంఘటనలను ప్రశ్నించి కొన్ని బదిలీలు చెల్లవని తీర్పు చెప్పారు. ములాయం సింగ్ ప్రభుత్వానికి అది నచ్చలేదు. కనుక అపర్మిత్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ప్రభువు చట్టం మార్చారు. పదవీకాలం తగ్గించారు. అపర్మిత్‌ను తొలగించారు. ఆయన సవాలు చేసారు. ప్రభుత్వం ఈ విధంగా వాదించింది: పదవీ కాలం తగ్గించడం తొలగించడం ఒకటే కాదని కనుక రాజ్యాంగబద్ధమే అని కైలాస్ చంద్ మహాజన్ కేసులో తీర్పు చెప్పారని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. దాన్ని కోర్టు పరిశీలించింది.


కైలాస్ కేసులో అతనిది రాజ్యాంగ పదవి కాదు. అతన్ని తొలగించే అధికారం పార్లమెంటుకే ఉంటుందనీ, రాష్ట్ర శాసనసభకు ఉండకూడదనే నియమం లేదు. కనుక ఆ పదవిని తగ్గించడం, తొలగించడం ఒకటి కాదని ఆ కేసులో ఇచ్చిన తీర్పు ఈ కేసులో వర్తించదని సుప్రీంకోర్టు వివరించింది. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకటి కాదు. ఎన్నికల కమిషర్‌ను ప్రత్యక్షంగా తొలగించే అధికారం శాసనసభకు ప్రభుత్వానికి లేనపుడు పరోక్షంగా కూడా తొలగించడానికి అధికారం ఉండదు. చట్టం ఉద్దేశానికి, నియమాల అమలు ప్రభావానికి వైరుధ్యం ఉండకూడదు. ఎన్నికల కమిషనర్ స్వతంత్రతను రక్షించడమే ఉద్దేశం అని చెబుతూ, అతన్ని మధ్యలో తొలగించే ప్రక్రియను చేపట్టడం ఆ ఉద్దేశానికి వ్యతిరేకం అవుతుంది. ఈ తొలగింపు ఆర్టికిల్ 243కె సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉంది కనుక రాజ్యాంగ విరుద్ధమే. ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ అనుసరించకూడదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కేవలం సర్వీసు నియమాలు మార్చాం, అంతే అనీ; మార్చడంలో తొలగింపు లేదు, కేవలం పదవీకాలం తగ్గింపు మాత్రమే ఉంది అనీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఏ పేరుతో పిలిచినా పదవిలో ఉన్న వ్యక్తి పదవీకాలం పూర్తికాకముందే తగ్గించడం అంటే అది అతనిని పదవినుంచి తొలగించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పవలసి వచ్చింది. తనకు లేని అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిందని, కనుక చెల్లదని తీర్పు చెప్పింది. అయితే అప్పటికే ములాయంసింగ్ యాదవ్ మరొక వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. కొత్త కమిషనర్ గారు తన వాదం వినకుండా తీర్పు ఇవ్వరాదని సుప్రీంకోర్టును కోరారు. ఆ సాకుతో కోర్టు తీర్పువాయిదా వేసింది. ఈ రెండు తీర్పులు తమకు అనుకూలం అని ఎపి ప్రభుత్వ నిపుణులు భావిస్తున్నారు. కాని మౌలిక సూత్రాలను పరిశీలిస్తే ఏ తీర్పు కూడా ఈ తొలగింపును సమర్థించే అవకాశం లేదు. 


విచిత్రమేమంటే ఈ ఆర్డినెన్సును తొలగింపును సవాలు చేస్తూ మళ్లీ సుప్రీంకోర్టుకో, హైకోర్టుకో వెళ్తారు. కరోనా వైరస్ వ్యాధి విస్తరించే ఆందోళనకరమైన సందర్బంలో న్యాయస్థానానికి సమయం దొరికి, ఈ వివాద విషయం పరిశీలనకు వచ్చి, న్యాయాన్యాయాల మీమాంస తేలేవరకు కరోనా వ్యాధి తగ్గిపోవచ్చు, స్థానిక ఎన్నికలు ముగిసి పోవచ్చు. గుర్రాలు రెక్కలొచ్చి ఎగిరినా ఆశ్చర్యం లేదు. అందాకా ప్రభుత్వం అనుకున్నట్టు జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజ్యాంగ పాలనా? మన ప్రభుత్వాలు ప్రజలవా? వ్యక్తులవా? ఇదివరకు చంద్రన్న కానుక, ఇప్పుడు జగనన్న దయ.

మాడభూషి శ్రీధర్

Updated Date - 2020-04-15T06:30:27+05:30 IST