అమరావతితోనే ఆంధ్రాభ్యుదయం
ABN , First Publish Date - 2020-12-17T05:56:25+05:30 IST
దుక్కిదున్ని పంట పండించే రైతు స్వభావరీత్యా తలవంచడు. రైతు తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి, న్యాయం జరిగేంత వరకు ఎంతటి...

అమరావతిపై వరద రాజధాని, కుల రాజధాని, గ్రాఫిక్స్ రాజధాని అన్న అధికారపక్షం నాయకుల ఆరోపణలు వాస్తవాల ముందు నిలబడలేదు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారిలో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. నిర్మాణాలు గ్రాఫిక్స్ అయితే పైసా ఖర్చు లేకుండా 18 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నారో వైసీపీ నేతలు చెప్పగలరా?
దుక్కిదున్ని పంట పండించే రైతు స్వభావరీత్యా తలవంచడు. రైతు తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి, న్యాయం జరిగేంత వరకు ఎంతటి పోరాటానికైనా రైతులు వెనుకాడబోరని చరిత్ర చెప్పిన సత్యం. ప్రజా రాజధాని అమరావతి కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవ్యాంధ్ర రైతులు ఏడాది నుంచి ఉద్యమిస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రాణాలు పోయేలా రైతులు పోరాడుతున్నా ఏలికల్లో మాత్రం చలనం లేదు. రాజధాని కోసం రైతు రక్తాన్ని చిందిస్తుంటే మరో వైపు అధికారపక్షం నేతలు మాత్రం ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటూ వారిని అవమానకరంగా మాట్లాడుతున్నారు! తప్పుడు ప్రచారాలు, బూటకపు హామీలతో గద్దెనెక్కిన వాళ్లకు నేడు రైతు ఘోష వినపడకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరికి నేడు కోట్లాది జనావళి విషాదయోగంలో
మునిగిపోయారు. స్వలాభం కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఆంగ్లేయుల కపటనీతి. దానిని పూర్తిగా వంటబట్టించుకున్న జగన్-, విజ్ఞత మరచి నేలబారు రాజకీయ విన్యాసాలకు తెగబడటం యావత్ ప్రజానీకాన్ని నివ్వెరపరుస్తోంది.
రైతు సమస్యలతో దేశం అట్టుడికి పోతోంది. ఒక వైపు ఢిల్లీలో రైతులు న్యాయం కోసం హోరెత్తిస్తుంటే, మరో వైపు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి కోసం రైతులు సమర మార్గం పట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 365 రోజుల నుంచి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వారు పోరాటం చేస్తున్నారు. 2019 డిసెంబర్ 17న రాజధాని కోసం ప్రారంభమైన రైతుల దీక్ష నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఇది ఒక చరిత్ర. రాష్ట్ర సమస్య కోసం రైతులు 365 రోజుల పాటు దీక్షలు చేయడం బహుశా ప్రపంచంలో ఇదే తొలిసారి.
‘అధ్యక్షా! విజయవాడలో కేపిటల్ సిటీ పెట్టడాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణమేమిటో తెలుసా? ఇప్పటికే మనది 13 జిల్లాల చిన్న రాష్ట్రం.
ఈ 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం’ అని శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో 2014 సెప్టెంబర్ 4న జగన్ రెడ్డి ఉద్ఘాటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తన నిర్ణయాన్ని మార్చుకొని రైతులను నమ్మించి మోసం చేశారు, నట్టేట ముంచారు, మాట తప్పారు, మడమ తిప్పారు. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలిస్తూ చరిత్రకెక్కారు. మన దేశంలో నవ్యాంధ్ర మినహా అన్ని రాష్ట్రాలకు రాజధాని నగరాలు ఉన్నాయి. ఆ నగరాలన్నీ శతాబ్దాల క్రితం నిర్మించినవే. ఆయా రాష్ట్రాలు కొత్త ఆకృతులతో రాజధాని నగరాన్ని నిర్మించుకునే అవకాశం లేదు. కానీ 2014 రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధానిని నిర్మించుకునే అద్భుత అవకాశం రావడం ఆంధ్ర ప్రజలకు దక్కిన అదృష్టం. ఏకాభిప్రాయంతో అన్ని ప్రాంతాలకు సమదూరంగా ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చ్లు, పార్లమెంటు నుండి తెచ్చిన మట్టి, యమునా జలాలతో ప్రధాని మోదీ చేతులు మీదగా రాజధానికి శంకుస్థాపన జరిగింది. దేశంలోని నలుమూలల నుంచి అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మితమవుతుందని ప్రశంసలు వచ్చాయి. రాత్రింబవళ్లు నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న సమయంలో వచ్చిన ఎన్నికలతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమరావతి ఆక్రందనకు గురైంది.
రాజధానిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ జగన్ అసత్య ప్రచారాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత లేని లక్ష కోట్ల అవినీతిని నిరూపించలేక కేవలం 4,070 ఎకరాల్లో తెలుగుదేశం నాయకులు ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారంటూ మరో తప్పుడు ప్రచారానికి తెరలేపారు. వాస్తవానికి జగన్ చేస్తున్నవి అబద్దపు వ్యాఖ్యలని అందరికి తెలుసు ఎందుకంటే 2014 జూన్ 2 నుంచి అమరావతి పేరు రాజధానిగా ప్రకటించిన సెప్టెంబర్ 4న వరకు అంటే నాలుగు నెలల్లో 128 ఎకరాలు మాత్రమే ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ 4,070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని శాసనసభలో అసత్యాల వల విసిరారు. వరద రాజధాని, కుల రాజధాని, గ్రాఫిక్స్ రాజధాని అంటూ అధికారపక్షం నాయకులు చేసిన ఆరోపణలు అసలైన వాస్తవాల ముందు నిలబడలేదు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారిలో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. నిర్మాణాలు గ్రాఫిక్స్ అయితే పైసా ఖర్చు లేకుండా 18 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా?
365 రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్న రైతులపై జగన్ కన్నెర్ర చేయని రోజు లేదు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా దాడులు, దౌర్జన్యాలు చేయించారు. రాజధానికి భూములు ఇచ్చిన కుటుంబాల్లో ఆవేదనకు గురైన 109 మంది రైతుల గుండెలు ఆగాయి. తెలుగు వారందరికి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమర జీవి అయితే రాష్ట్ర రాజధాని కోసం తమ భూములతో పాటు ప్రాణాలను సైతం బలిపీఠంపై పెట్టిన రైతులు కూడా అమరజీవులే. లాఠీ దెబ్బలు, అవమానాలు, జైళ్ల పాలవ్వడం రైతులకు రోజువారీ కార్యక్రమాలుగా మారాయి. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపు, పోలీసులు భారీ కవాతు నిర్వహణ, ఆందోళనలో పాల్గొన్న మహిళలను బూటు కాళ్లతో తన్నడం, మగ పోలీసులు మహిళలను అరెస్టు చేయడంపై గత జనవరి 17న హైకోర్టు ఆగ్రహం చేసినా ప్రభుత్వానికి లెక్కలేదు. ఇప్పటి వరకు పోరాటం చేస్తున్న వారిలో 2,661 మందిపై కేసులు బనాయించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకు 11 మంది దళిత రైతులపై క్రిమినల్ కేసుల పెట్టి బేడీలు వేసి జైలుకు తరలించిన చరిత్ర జగన్కే దక్కింది. 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉండి, 42వేల కోట్ల అవినీతికి పాల్పడి, 16 నెలలు జైలు జీవితం గడిపి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ ఏడేళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. అంతే కాకుండా హత్యలు చేసిన వారిని బెయిల్ ఇచ్చి క్షణాల్లో బయటకు తీసుకొస్తున్నారు, కాని ఏ పాపం ఎరుగని రైతులకు మాత్రం బెయిల్ రానివ్వకుండా అడ్డుపడటాన్ని ఏ విధంగా చూడాలి?
సంపద సృష్టి వృక్షంగా పెరగనున్న అమరావతిని కుట్ర అనే గొడ్డలితో జగన్ రెడ్డి నరికేశారు. అమరావతి నిర్మాణం జరిగి ఒప్పందం చేసుకున్న 130 సంస్థలకు చెందిన పెట్టుబడులు వచ్చి ఉంటే రాష్ట్ర యువతకు ఉద్యోగాలకు కొదవ ఉండేది కాదు. రాష్ట్ర సంపద మొత్తం అమరావతిలో పెడుతున్నారని వైసీపీ అసత్య ప్రచారం చేసింది. అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు. రైతులిచ్చిన 30 వేల ఎకరాల్లో 20 వేల ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు మినహాయించగా మరో 10 వేల ఎకరాల ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దీన్ని దశల వారీగా విక్రయిస్తే 2 లక్షల కోట్లు ఆదాయం సమకూరుతుంది. పోలవరం నిర్మాణంతో 13 జిల్లాలకు సాగు, తాగు నీరు పుష్కలంగా అందించవచ్చు. పరిశ్రమలకు కొరత లేకుండా నీటిని అందించవచ్చు. అలాంటి పోలవరానికి నిధులు కూడా అమరావతి ద్వారానే సమకూరుతాయి. కేంద్రం ఇచ్చే వరకు నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ఖజానా నుండే ఖర్చు పెట్టి తర్వాత కేంద్రం ఇచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లించుకోవచ్చు. కల్పవృక్షమైన రాజధానిని ముక్కలు చేస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అని వైసీపీ నేతలు అసత్యాలు వల్లిస్తున్నారు. ప్రభుత్వం నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకుంటే 18 నెలల కాలంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమైనా తెచ్చిందా? అభివృద్ధి మెరుగుపడిందా? 13 జిల్లాల్లో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి అయ్యిందా? ఇవేమి చేయకుండా కేవలం అభివృద్ధి వికేంద్రీరణ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవానికి అసలైన, నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన కుట్రలు, కుతంత్రాలను పక్కన బెట్టి అమరావతిని రాష్ట్ర ఏకైన రాజదానిగా ప్రకటించాలి.
కాకి గోవింద రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి