అమరావతి స్వప్నభంగం

ABN , First Publish Date - 2020-12-26T06:57:11+05:30 IST

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటగా ఒక్క పైసా పెట్టుబడి లేకుండా మొత్తం 55 వేల ఎకరాలు...

అమరావతి స్వప్నభంగం

అమరావతి రెండు పార్టీల సమస్య కాదు, రెండు ప్రాంతాల సమస్య కాదు. రెండు కులాల సమస్య కాదు, 29వేల రైతు కుటుంబాల సమస్యా కాదు. రాజధాని నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనం. లేదంటే పార్టీలు, ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా అందరూ నష్టపోతారు.


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటగా ఒక్క పైసా పెట్టుబడి లేకుండా మొత్తం 55 వేల ఎకరాలు (రైతుల నుంచి 33 వేలు, ప్రభుత్వ భూమి 22 వేలు) భూ సమీకరణ జరిగింది. ఎన్నో అవాంతరాలు, మరెన్నో రాజకీయ సవాళ్ళు ఎదుర్కొని, ఆనాటి ప్రభుత్వాధినేత సంకల్పబలంతో ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ, క్రమంగా రూపుదిద్దుకునేలా వ్యూహరచన జరిగింది. జరుగుతున్న నిర్మాణం చూసి, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక శక్తులు, పొరుగు రాష్ట్ర అధికార శక్తులు, కేంద్రంలో అప్రతిహతంగా, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న నయా చక్రవర్తులు అందరూ అమరావతిపై అసూయాద్వేషాలు పెంచుకున్నారు. ఆంధ్రుల భవిష్యత్‌ను నాశనం చేయడానికి ఆ శక్తులన్నీ తెర ముందు, తెర వెనుక ఏకమయ్యాయి. అమరావతిని సంకల్పించిన ప్రజానాయకుడిని ఓడించే యజ్ఞం చేశారు. మరోవైపు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతిచ్చారు. అమరావతిని వ్యతిరేకిస్తున్న సంకేతాలు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు కూడా, అమరావతి ప్రాంతంలో నివాసం ఉండడానికే అక్కడ ఇల్లు కట్టుకున్నట్టు నమ్మబలికారు. ప్రజల కోసం పని చేసే నాయకుడిని, అమరావతి రూపశిల్పిని ఓడించాక అమరావతిని అధికారికంగా అడ్డుకున్నారు. భూములు ఇచ్చిన రైతులను దారుణంగా వంచించారు. ఆ ప్రాంత ప్రజలు కూడ తాము భూములు ఇచ్చింది పనిమంతుడికి. కానీ ఏ మాయ ఆవహంచిందో, మరో పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చి పూర్తిగా మోసపోయారు.


నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమరావతి నిర్మాణం పెద్ద కష్టం కాదు. పాలనకు అవసరమైన నిర్మాణాలు చాలావరకు జరిగాయి. ప్రభుత్వ పాలన కోసం దాదాపు 80శాతం వసతులు ఆయన అధికారం చేపట్టే సమయానికే సమకూరాయి. ఇక పెట్టుబడులను ఆకర్షించగల అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అయితే ఆ మహత్తర అవకాశాన్ని కాలదన్నుకొని, ఎవరూ కలలో సైతం ఊహించని, ఆశించని మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల సాధ్యాసాధ్యాలు, నిర్మాణ సామర్థ్యం, ఖర్చు, వాటి వల్ల అంతిమ ప్రయోజనాల మాట అటుంచి... అసలు అమరావతి రైతుల ప్రయోజనాలను సమూలంగా భూస్థాపితం చేయడానికి సమకట్టారు. 29వేల కుటుంబాలను ప్రత్యక్షంగా, దాదాపు లక్షకు పైగా కుటుంబాలను పరోక్షంగా దెబ్బ తీయడం వెనుక ప్రజాప్రయోజనాలు కనిపించడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఏ ప్రాంతంలోని, ఏ వర్గానికి, ఏ విధమైన మేలు జరుగుతుందో చెప్పలేదు. అంతేకాకుండా పటిష్ఠమైన సిఆర్‌డిఎ, రైతుల మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించడం చట్టబద్ధం కాదని, న్యాయ స్థానాలలో రైతులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు లేవని, ఒక వేళ రైతులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా అది వేల కుటుంబాలను శాశ్వతంగా, సమూలంగా నాశనం చేయడమేనని, అది క్రూరమైన, ఆటవిక న్యాయం అవుతుందని, ప్రజాస్వామ్య చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆలోచించలేకపోవడం అత్యంత దురదృష్టకరం.


2014లో తాను గెలవలేదు కాబట్టి రాజధానిపై నిర్ణయం తీసుకునే అవకాశం తనకు పోయిందనే నిజాన్ని ముఖ్యమంత్రి జగన్ జీర్ణించుకోవాలి. అలా కాకుండా తేనెతుట్టెను కదిపి, ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళడం వివేకం అనిపించుకోదు. రాజధానిని త్రిశంకుస్వర్గంగా మార్చడం వల్ల రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలకు అపరిమిత నష్టం వాటిల్లుతోంది. ఇందుకు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా భారీమూల్యం చెల్లించక తప్పదు. శాసనసభలో 151మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్నప్పుడు రాజధాని విభజన రాజకీయాలు చేయడాన్ని ఎలా చూసినా గొప్ప వ్యూహంగా చెప్పలేం. ఈ సమస్యలో కలుగజేసుకోవలసిన జాతీయపార్టీ కానీ, మేధావులు, మీడియా గానీ సరైన విధంగా స్పందించక పోవడం చారిత్రక తప్పిదమే. ఈ నిస్సహాయ పరిస్థితిలో అమరావతి రైతులకు పోరాటమే దిక్కయింది. ముందుగా రైతులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనను పోలీసుల సహాయంతో అణచివేస్తూ మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్డెక్కి పోరాడక తప్పని పరిస్థితి కల్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయమైన పోరాటాలను, అంటే బతుకు పోరాటాన్ని మంద బలంతోనో, లాఠీలతోనో అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమే. రైతుల భూమి తీసుకుని, వారిని నడిరోడ్డు మీద నిలబెట్టడం ఎంత క్రూరత్వం!


తమ ప్రాంతంలో రాజధాని కట్టమని అమరావతి ప్రాంతవాసులు అడగలేదు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షనేతగా నిండు సభలో అమరావతికి అంగీకరించారు. మరి ఇప్పుడు ఆ రైతులను నిస్సిగ్గుగా దగా చేసి, వారి పోరాటాన్ని దమననీతితో అణచివేయాలనుకోవడం కుట్రపూరిత చర్య కాదా? మేధావులు మౌనంగా ఉండడం మంచిది కాదు. తటస్థులు సైతం మంచి చెడుల ఆలోచన చేయాలి. అమరావతి రెండు పార్టీల సమస్య కాదు. రెండు ప్రాంతాల సమస్య కాదు. రెండు కులాల సమస్య కాదు. కేవలం 29వేల రైతు కుటుంబాల సమస్య కాదు. రాజధాని నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనం. లేదంటే పార్టీలు, ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా అందరూ నష్టపోతారు. అసలంటూ పెట్టుబడులు ఆకర్షించి, ఉద్యోగాల కల్పన జరిగి, తమ పిల్లల భవిష్యత్ బాగుంటే ఆ తరువాత ఎన్ని రాజకీయాలు చేసుకున్నా చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడున్న రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎవరికీ మంచిది కాదు. ఈ పరిస్థితులు చక్కబడడానికి సమస్యను సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ముందుకు రావలసిందే. ఏనాటికైనా తప్పు ఒప్పుకోవలసిందే. అసలంటూ మనుషులు బతకగలిగితేనే రాజకీయం చేయగలమని జగన్ నమ్మాలి. ప్రజలను బతకనివ్వాలి.


రాజధాని రైతుల పోరాటంలో న్యాయం ఉందనేది ఎవరూ కాదనలేని నిజం. ఇక జనం విస్తృతంగా మద్దతు ఇవ్వడమే మిగిలింది. ఇది నవ్యాంధ్ర భవిష్యత్‌తో ముడిపడిన అంశం కాబట్టి ప్రజల మద్దతు తప్పనిసరిగా లభిస్తుంది. అప్పటి వరకు, అంటే ఈ ఉద్యమం ఇతర జిల్లాలకు మానసికంగా విస్తరించే వరకు బలంగా నడిపించడం రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ముందున్న అసలైన సవాలు. సిఆర్‌డిఏ తో చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాలు రైతులకు శ్రీరామరక్ష. అలాగే గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, కేంద్ర రాష్ట్ర సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించిన అవగాహనా పత్రాలు, ఇప్పటికే కొలువుతీరిన సంస్థలు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు... ఇవన్నీ కూడ భూములిచ్చిన వారికి పరోక్షంగా మద్దతు ఇచ్చే అంశాలే. ఇంత పకడ్బందీగా ఉన్న అమరావతి ఒప్పందాలను కాదని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను తమ చేతిలోకి తీసుకోవాలనుకోవడం చారిత్రక తప్పిదమే అవుతుంది.

శ్రీ

Updated Date - 2020-12-26T06:57:11+05:30 IST