అమెరికా దుందుడుకు నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-18T06:34:42+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా హఠాత్తుగా నిధుల కేటాయింపు ఆపెయ్యడం దారుణం. ప్రపంచమంతా కరోనా బారిన పడి విలవిల్లాడుతున్న వేళ ఈ నిర్ణయం శరాఘాతం.

అమెరికా దుందుడుకు నిర్ణయం

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా హఠాత్తుగా నిధుల కేటాయింపు ఆపెయ్యడం దారుణం. ప్రపంచమంతా కరోనా బారిన పడి విలవిల్లాడుతున్న వేళ ఈ నిర్ణయం శరాఘాతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన పాత్రని సమర్థంగా నిర్వహించలేదని, చైనాపై ఆ సంస్థకున్న మమకారపు పక్షపాత బుద్ధి వల్ల అవసరమైన వేళ అవసరమైన సూచనలు చెయ్యలేదని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు. అమెరికాలో మహమ్మారి విజృంభణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పట్టించిన తప్పుదారి కన్నా, అధ్యక్షుడి పేలవమైన స్పందనే పెద్ద కారణం. మొదట్లో తేలిగ్గా తీసుకున్న ఆ ప్రభుత్వం, పరిస్థితి తీవ్రమైన పిదప కారణాల్ని వెదుకుతోంది. ఒక వేళ ఆ సంస్థ ముద్దాయే అయినా శిక్షించాల్సింది ఇప్పుడు కాదు. ఎందుకంటే మహమ్మారి విజృంభణ మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం చెయ్యగల సంస్థ అదే గనుక. నలుగురినీ కూర్చోబెట్టి సమగ్ర ప్రణాళికలు తయారు చెయ్యగలదు గనుక. సమన్వయ కర్త పాత్ర ఇప్పుడెంతో అవసరం. ముఖ్యంగా పేద దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు దాని సేవలు ఎంతో అవసరం. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఉపద్రవం అన్ని దేశాలదీ. ఒక దేశం మునిగితే పక్క దేశం క్షేమంగా ఉండలేదు. ఒకరికి ప్రమాదం అందరికీ ప్రమాదమే. తమ వైఫల్యాలకు దోషం అంటగట్టి దాని ఉనికినే ప్రశ్నార్థకం చెయ్యడం సరైన చర్య కాదు.


– డా.డి.వి.జి.శంకరరావు మాజీఎంపీ, పార్వతీపురం


Updated Date - 2020-04-18T06:34:42+05:30 IST