అశ్వమేధం తరువాత ఇక రాజసూయమే!

ABN , First Publish Date - 2020-12-10T09:59:34+05:30 IST

నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎన్‌డిఎ)ను భారతీయ జనతాపార్టీ నిర్వహించిన అశ్వ మేధంలో యాగాశ్వంగా ప్రముఖ ఆంగ్ల పాత్రికేయులు...

అశ్వమేధం తరువాత ఇక రాజసూయమే!

ఇందిరాగాంధీ నియంతృత్వం, వ్యక్తి నియంతృత్వం మాత్రమే. వ్యవస్థ కూడా దాన్ని ఎక్కువ కాలం మోయలేకపోయింది. ప్రస్తుతం అమలు జరుగుతున్న దానిని నియంతృత్వం అనలేము. దానికి మరేదో పేరున్నది. ప్రజల సమ్మతి నిరంతరం తయారవుతున్న పాలన ఇది. అత్యధిక ప్రజలు, ఎందువల్లనో, ఏ కారణం చేతనో, ఒక తెలియని శత్రువుని లేదా ఒక ఆపాదించుకున్న శత్రువుని నిరంతరం ద్వేషిస్తూ, ఆ ద్వేషం నుంచి తామస భావాలలో ఓలలాడుతూ, పాలకుల చర్యలకు జేజేలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆవరించిన ప్రభావ ఉన్మాదంలో, ఇంతకాలం సమకూర్చుకున్న చిన్న చిన్న విలువలు కూడా కొట్టుకుపోతున్నాయి.


ప్రజల అండ ఉంటే, సత్పరిపాలన సాగిస్తే, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే, నాలుగుకాలాల పాటు నిలవడం కుదరవచ్చు, పోరాడితే రాజసూయాన్ని నిలువరించనూ వచ్చు, కానీ, లొంగితే ఉపయోగం ఏమిటి? ప్రత్యర్థితో ఐక్యమైపోవడం దాని కంటె మెరుగు. ఇంత దుస్థితి ఎందుకు వచ్చినట్టు అసలు? ప్రజల గౌరవం కోల్పోవడం వల్లనే కదా?


నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎన్‌డిఎ)ను భారతీయ జనతాపార్టీ నిర్వహించిన అశ్వ మేధంలో యాగాశ్వంగా ప్రముఖ ఆంగ్ల పాత్రికేయులు శేఖర్ గుప్తా ఈ మధ్య పోల్చారు. పాశ్వాన్ మరణం, అకాలీదళ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో నెలకొన్న ‘సంకీర్ణ’ ప్రభుత్వంలో ఒక్కరు మినహా అందరూ భారతీయ జనతాపార్టీకి చెందినవారే కావడాన్ని ప్రస్తావిస్తూ, కూటమి అవసరం ఇక లేదని, లక్ష్యం పూర్తయిన తరువాత యాగాశ్వాన్ని బలి ఇస్తారని గుప్తా నర్మగర్భంగా రాశారు. ఈ రెండు దశాబ్దాల కాలం, ఎన్‌డిఎ అన్నది ఒక ముఖకవచంలాగా బిజెపికి పనికివచ్చిందనుకోవాలా? లేదా అది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఉపకరించిందనుకోవాలా? అయితే, బిజెపి లక్ష్యం పరిపూర్తి అయిందని చెప్పలేము. యాగాశ్వం దేశంలోని అన్ని మూలలకు, కోనలకు ప్రయాణించలేదు. గెలుచుకోవలసిన ఉపరాజ్యాలు చక్రవర్తికి ఇంకా మిగిలే ఉన్నాయి. అశ్వమేధయాగం ఒక మజిలీ మాత్రమే. అంతిమంగా రాజసూయం కోసమే బిజెపి రాజకీయం గురిపెట్టింది. 


రాజకీయ పక్షాలు అధికారాన్ని వంతులవారీగా పొందడం సహజమే అయినప్పుడు, ఒక పక్షం తనను తాను దేశవ్యాప్తం చేసుకోవడాన్ని జైత్రయాత్రగా, సర్వాన్నీ అధీనం చేసుకునే ప్రయత్నంగా ఎందుకు చెప్పుకోవాలి? అన్న ప్రశ్న రావడం సహజం. మధ్యేవాద పార్టీల మధ్య అధికారం వంతులవారీగా బదలాయింపు జరిగితే అది సాధారణమే. మితవాద పక్షం కూడా మధ్యేవాద పరిమితుల మధ్య సంచరిస్తున్నప్పుడు, మరొక మధ్యేవాదపార్టీతో విడతల వారీగా అధికారాన్ని పంచుకోవడం మామూలే. కానీ, మితవాద పక్షం తనను తాను పూర్తిగా విజృంభింపజేసుకుని, సైద్ధాంతిక, సాంస్కృతిక రంగాలతో సహా విశ్వరూపం చూపుతున్నప్పుడు, దాని విస్తరణ తాత్కాలికం కాదు, అది ఇతర పార్టీల సైద్ధాంతిక, రాజకీయ పునాదులను కూడా కుదిపివేసి తనను తాను స్థాపించుకుంటుంది. ఎన్‌డిఎ దశ దాటిన భారతీయ జనతాపార్టీ ఇతరులతో దేన్నీ పంచుకోనవసరం లేని, లేదా అతి తక్కువ మాత్రమే పంచుకోవలసిన స్థితిలోకి ప్రయాణిస్తున్నది. ఆ పార్టీ వైపు నుంచి చూసినప్పుడు, ఇది ఒక అసాధారణమైన, వేగవంతమైన విజయం. రంగంలో ఇంకా మిగిలి, మనుగడ కోసం పోరాడుతున్న లేదా గింజుకుంటున్న పక్షాలకు మాత్రం ప్రాణసంకటం. తమకు ముంచుకువస్తున్న ప్రమాదం తెలిసినప్పటికీ, వివేకానికి కొద్దిగా పదును పెట్టుకోలేకపోతున్న వివిధ పార్టీలను చూస్తే జాలి కలుగుతున్నది. 


కాంగ్రెస్ పార్టీని వదిలేద్దాం. అది ప్రాయోపవేశ దీక్షలో ఉన్నది. తక్కిన అనేక పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ, సామాజిక ప్రాతినిధ్య పార్టీలు, జనతాదళ్ అవశేష పార్టీలు- అన్నీ ఉనికి కోసం పోరాడుతున్నాయి. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని బిజెపి ప్రకటించడం వెనుక, ఒక చరిత్రను, పరంపరను, వంశపాలనను, జాతీయోద్యమ జ్ఞాపకాలను అన్నిటినీ కాలనాళికలోకి పంపివేయడం అనే ఆకాంక్ష ఉన్నది. నిజానికి, యుపిఎ రెండో ప్రభుత్వం అనంతరం కాంగ్రెస్ అతి వేగంగా పతనమైంది. ఒక ప్రతీకగా అయినా తాను దేనికి చెందుతానో, తానేమిటో తెలియని విస్మృతిలోకి ఆ పార్టీ జారిపోయింది. ఒకనాడు, ప్రాబల్యశక్తుల నేతృత్వంలోనే అయినప్పటికీ, సకల జనవర్గాలకు ఒకే ఒక్క ఛత్రంగా కనిపించి, ఆ సమ్మర్దాన్నే సమ్మిశ్రితత్వంగా భ్రమింపజేసిన జాతీయోద్యమ పార్టీకి వేర్వేరు దశల్లో వేర్వేరు ప్రత్యర్థులు రూపొందారు. తొలి దశాబ్దాలలోనే వ్యతిరేకించినవారు, తరువాత తరువాత నిర్బంధాలను చీకటిరోజులను తట్టుకుని ప్రతిఘటించినవారు, కేంద్రీకృత అధికారాన్ని బలహీనపరచడానికి ప్రాంతీయ ప్రతినిధులుగా బయలుదేరినవారు, మెజారిటేరియన్ ధోరణులు పెరుగుతున్న దశలో, బడుగులూ బలహీనులే అత్యధికులన్న స్పృహతో సామాజిక న్యాయం కోసం నిలబడినవారు-.. ఇప్పుడు వీరిలో ఏ ఒక్కరూ దృఢంగా నిలబడకపోగా, సహేంద్ర తక్షకాయ స్వాహా అన్నట్టుగా కాంగ్రెస్‌తో పాటు సహగమనం చేస్తున్నారు లేదా ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతున్నారు. 


భారతీయ జనతాపార్టీ ఇంత శక్తిశాలిగా మారడం వెనుక, అది అనుసరించిన సిద్ధాంతమూ దాన్ని అన్వయించుకుని అమలుచేసిన వ్యూహాలూ మాత్రమే కాదు, దాని కార్యకర్తలు, అభిమానుల కట్టుబాటు, శ్రమా కూడా ఉన్నాయి. విజయాలు లభిస్తున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది, గెలుపు కనిపిస్తున్నప్పుడు సంకల్పం కూడా దృఢంగా ఉంటుంది. మంచి దూకుడులో ఉన్నది కాబట్టి, జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతున్నది. ఆ పార్టీ గెలుపుతో పాటు, సామాజిక న్యాయ ఆకాంక్షలు, ప్రాంతీయ అస్తిత్వ ఆకాంక్షలు అన్నీ ముగిసిపోతాయా? అన్నిటికీ, అందరికీ ఒకే ఒక్క పక్షం ప్రత్యామ్నాయం అవుతుందా? కాంగ్రెస్ పతనం విపరీతమైన అధికార కేంద్రీకరణ, వ్యక్తిపూజ అనంతరమే మొదలైందనుకుంటే, ప్రస్తుత అధికారపార్టీ గతం నుంచి ఎందుకు నేర్చుకోవడం లేదు?


ఇందిరాగాంధీ నియంతృత్వం, వ్యక్తి నియంతృత్వం మాత్రమే. వ్యవస్థ కూడా దాన్ని ఎక్కువ కాలం మోయలేకపోయింది. ప్రస్తుతం అమలు జరుగుతున్న దానిని నియంతృత్వం అనలేము. దానికి మరేదో పేరున్నది. ప్రజల సమ్మతి నిరంతరం తయారవుతున్న పాలన ఇది. అత్యధిక ప్రజలు, ఎందువల్లనో, ఏ కారణం చేతనో, ఒక తెలియని శత్రువుని లేదా ఒక ఆపాదించుకున్న శత్రువుని నిరంతరం ద్వేషిస్తూ, ఆ ద్వేషం నుంచి తామస భావాలలో ఓలలాడుతూ, పాలకుల చర్యలకు జేజేలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆవరించిన ప్రభావ ఉన్మాదంలో, ఇంతకాలం సమకూర్చుకున్న చిన్న చిన్న విలువలు కూడా కొట్టుకుపోతున్నాయి. సామాజిక నేపథ్యం, భాష, ప్రాంతం, నైసర్గికత- ఇవన్నీ ఉనికి నుంచి జారిపోతూ, మరేదో వర్చువల్ అస్తిత్వాలు ఆవరిస్తున్నాయి. 


రాజసూయానికి ముందు, జైత్రయాత్ర పూర్తి కావాలి. అన్నిచోట్లా, అన్ని సార్లూ యుద్ధమే అవసరం ఉండదు. బ్రిటిష్ వారు దేశీయ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడానికి అనేక పద్ధతులు అనుసరించేవారు. రాజులు కాలధర్మం చెందేవరకు ఎదురుచూసేవారు. వారసత్వ పోరు దగ్గర పేచీ పెట్టేవారు. దత్తత వివాదాల్లో వేలు పెట్టేవారు. ఇరుగుపొరుగు మధ్య తంపులు పెట్టేవారు. నితీశ్ కుమార్, ఇప్పటికే స్వతంత్రత నుంచి సామంతానికి దిగిపోయారు. నవీన్ పట్నాయక్ పెద్దవాడవుతున్నాడు. అవివాహితుడు, వారసులు లేరు. మమతా బెనర్జీ, అందరినీ శత్రువులు చేసుకున్నారు. తన కోపమే తన శత్రువు. జయలలిత, కరుణానిధీ ఇద్దరూ పోయారు. రంగంలోకి అనేకులను దింపి తమిళులను గందరగోళపరచాలి. అసలే, గట్టి పిండాలు, యాభై ఏళ్ల కిందటే కాంగ్రెస్‌ను గద్దె దింపిన ఘటికులు. ఇక జగన్మోహన్ రెడ్డి. నిలువునా కేసుల సంకెళ్లలో బందీగా ఉన్నారు. బిజెపికి ఇంకా బలం కుదరక కానీ, గద్దె ఖాళీ చేయించడం చిటెకెలో పని. 


ద్వాపరయుగంలో అయితే, రాజులను జయించి కప్పాలు కట్టించుకుని సామంతులను చేసుకోవడం ఉండేది. ఇప్పుడు, సామంతాలు లేని విశాల సామ్రాజ్యమే అంతిమలక్ష్యం. లొంగిఉంటే, ప్రమాదం ఉండదని అనుకుంటున్నాయి కొన్ని పార్టీలు. పాలకశ్రేణిలో ఎక్కడా కల్తీ లేకుండా తమవారే ఉండాలని అనుకుంటున్నది విజేతపార్టీ. కాబట్టి, నామమాత్రపు ఉనికికి కూడా ఆస్కారం లేదు. ప్రజల అండ ఉంటే, సత్పరిపాలన సాగిస్తే, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే, నాలుగుకాలాల పాటు నిలవడం కుదరవచ్చు, పోరాడితే రాజసూయాన్ని నిలువరించనూ వచ్చు, కానీ, లొంగితే ఉపయోగం ఏమిటి? ప్రత్యర్థితో ఐక్యమైపోవడం దాని కంటె మెరుగు. ఇంత దుస్థితి ఎందుకు వచ్చినట్టు అసలు? ప్రజల గౌరవం కోల్పోవడం వల్లనే కదా? ప్రాంతీయపార్టీలు, సామాజిక పార్టీలూ కుటుంబపార్టీలు కావడం వల్లనే కదా, అవినీతులూ నియంతృత్వాలూ! సిద్ధాంతాలన్నీ గాలికిపోయి, కుటుంబపాలన కోసమే తాపత్రయం అయినప్పుడు, వెన్నెముకను నమ్ముకోవడం కాక, ఎట్లాగో అట్లా సాగిలపడడమే మేలు అనిపిస్తుంది!


జిహెచ్ఎంసి ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ రైతులు గుర్తుకు వచ్చారు. ఉద్యమాలలోను, ప్రజలలోనూ మాత్రమే రక్షణ ఉన్నదని గ్రహించారేమో అని కొందరు ఆశపడ్డారు. ఓటమి నుంచి జనం మనసులను మళ్లించడానికి బంద్ సమర్థన వచ్చిందేమో అని కొందరు సందేహించారు. ప్రతి ఒక్క పార్టీకి, అన్ని పార్టీల ప్రభుత్వాలకు లొసుగులుంటాయి. కేంద్రం చేతిలో సిబిఐ, ఈడీ, ఎన్సీబీ, ఎన్ఐఎ వంటి సంస్థలు ఉంటాయి. అధికారంలో ఉంటూ పోరాటం చేయడం మాటలు కాదు. యుద్ధ ప్రకటన చేసిన వెంటనే ప్రధానికి ప్రేమలేఖ రాస్తే ఏమిటి అర్థం? ప్రజలు అయోమయంలో పడతారు నిజమే, కానీ, నరేంద్రమోదీకి అర్థం కాదా సందేశమేమిటో? చలిలో గడ్డకట్టిపోతూ కూడా రైతు గట్టిగా ఉన్నాడు, తన ఫలసాయాన్ని కాపాడుకోవడానికి! రాష్ట్రం తానే తెచ్చానని, తన కష్టార్జితమని చెప్పుకునే పార్టీ, తన పంటను కాపాడుకోవద్దా?


కె. శ్రీనివాస్

Updated Date - 2020-12-10T09:59:34+05:30 IST