తెలంగాణ ‘యుగసంధి’కి అద్దం పట్టిన నవల

ABN , First Publish Date - 2020-12-07T06:19:59+05:30 IST

జీవితం ఎప్పుడో ఒకసారి మోగే అలారం కాదు. అనుక్షణం నడిచే సెకండ్ల ముల్లు. మనిషి కాలానికి అధీనుడు. కోరికలకు దాసుడు...

తెలంగాణ ‘యుగసంధి’కి అద్దం పట్టిన నవల

‘యుగసంధి’ చారిత్రక స్వభావం ఉన్న నవల కూడా. చారిత్రక నవలకు కాలమే కాన్వాస్‌. నిజాం పరిపాలనా కాలపు అంతిమ దశాబ్దం ఈ నవలలోని ప్రధాన కాలం. రాచరిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థల సంధికాలంలో తెలంగాణ యువతరం జీవితాలను చిత్రించటమే తన ధ్యేయంగా భాస్కరభట్ల కృష్ణారావు ఈ నవలకు ‘యుగసంధి’ అన్న పేరు పెట్టి ఉంటాడు. 


జీవితం ఎప్పుడో ఒకసారి మోగే అలారం కాదు. అనుక్షణం నడిచే సెకండ్ల ముల్లు. మనిషి కాలానికి అధీనుడు. కోరికలకు దాసుడు. కష్ట సుఖాల చీకటి వెలుగుల నియంత్రణలో ఒకసారి కుమిలిపోతూ, మరోసారి వెలిగిపోతూ సాగిపోతుంటాడు. భాస్కరభట్ల కృష్ణారావు (1918-1966) ‘యుగసంధి’ (1957) నవలలోని రుక్మిణి బ్రాహ్మణ బాలవితంతువు. వైవాహిక జీవితం ఆమె కల. తల్లి లేదు. తండ్రి పట్టించుకోడు. చదువా లేదు. ఆమె కల సాకారం కావటం పరిస్థితుల మీద, యాదృచ్ఛికాల మీద, తాను నమ్మినవాడి నిజాయితీ మీద ఆధారపడి ఉంది. ఆమె యౌవనం ఆమెను మోసం చేసింది. విశ్వేశ్వరరావు అనే మోసగాణ్ణి నమ్మింది. రుక్మిణి దగ్గరున్న నగలను తీసేసు కుని, తన అప్పులకింద రామనాథం అనే శాడిస్టుకు శాశ్వ తంగా తాకట్టు పెట్టి నిష్క్రమిస్తాడు విశ్వేశ్వరరావు. ఆ శాడిస్టు ఆమె శరీరాన్ని హింసించి, మనసును ముక్కలు చేసి, దిక్కులేనిదాన్ని చేసి తెర వెనుకకు వెళ్ళిపోతాడు. 


‘యుగసంధి’ నవలలోని మరో ముఖ్యమైన పాత్ర రఘు. రుక్మిణి ఇతివృత్తానికి సమాంతరంగా సాగే ఇతివృత్తం రఘుది. మధ్యతరగతికి చెందిన నగర శివారు యువకుడు. హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. రుక్మిణి రఘుకు మరద లవుతుంది. చిన్నప్పటి ఆటపాటలు మినహాయుస్తే అంతకు మించిన అనుబంధం లేదు. అయితే ఇంకో మరదలు రమణ తన భార్య అవుతుందని ఆశిస్తాడు. ఇది ఆమె తండ్రికి ఇష్టం లేదు. తండ్రి తెచ్చిన మరో సంబంధం రమణకు ఇష్టం లేదు. రమణ కూడా రుక్మిణి లాగే సంప్రదాయ విలువలను ధిక్కరించి ఇల్లు వదలి వస్తుంది. కాని రుక్మిణిలాగా గుడ్డిగా రాలేదు. పద్మ అనే తన సహాధ్యాయురాలి అండ చూసుకొని వస్తుంది. రమణలో ఉన్నది, రుక్మిణి నుంచి ఆశించలేనిది నైతిక ధైర్యం. అందుకే రుక్మిణి ఇంటికి తిరిగివెళ్ళే దారి మూసుకుపోయింది. కాని రమణ ఇంటి దారిని తెరిచే వుంచుకుంది. ‘వందేమాతరం’ ఉద్యమకాలంలో తరగతులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనటానికి రమణ ఒప్పుకోలేదు. చదువుపోతే భవిష్యత్తు దెబ్బతింటుందని ఆమె అభిప్రా యం. మొహమాట పెడితే అంగీకరించే ధోరణి గాని, ఒత్తిడికి లోనై లక్ష్యాన్ని వదులుకొనే తత్వంగాని ఆమెలో లేవు. భవిష్యత్తులో పశ్చాత్తాప పడవలసిన పనులేవీ రమణ చేయలేదు. 


‘‘వివాహమే స్త్రీ జీవిత పరమావధా? కొందరు పురు షులు ప్రపంచంలో అవివాహితులుగా వుండి ఏతో మహ దాశయంకోసం తమ నిండు జీవితాన్ని బలిపెడుతున్న ప్పుడు, కొంతమంది స్త్రీలు మాత్రం ఏదో మహోన్నత ఆశయం కోసం ఎందుకు త్యాగం చేయకూడదు?’’ - ఇది రమణ ఆలోచన. రమణ పాత్రలో ఇ.ఎమ్‌. ఫాస్టర్‌   (E.M. Forster) చెప్పే ‘రౌండ్‌ క్యారక్టర్‌’ (Round character) లక్షణాలు కనిపిస్తాయి. రుక్మిణి, పద్మ.. ఈ పాత్రల ఆలోచనలను, చర్యలను మనం ఊహించగలం. రమణ అట్లా కాదు. ఆమె అనూహ్యమైంది. రఘును పెండ్లి చేసుకుంటుందని, అందుకే తల్లిదండ్రులను ఎదిరించిందని మనం ఊహిస్తాం. కాని తను రఘు పట్ల ఉన్నది కేవలం ‘యౌవనపు పొంగుకు సంబంధించిన ‘‘ఫ్యాన్సీ’’’ అని గుర్తించి దూరం జరుగుతుంది. ఆర్థికంగా, మానసికంగా రఘు ఒకరి మీద ఆధారపడే తత్వం వున్నవాడని గుర్తించి, అతడు జమీందారు కూతురైన పద్మ మీద ఆధారపడేటట్లు చేయగలిగింది. తాను వాళ్ళకు దూరమై నర్సింగ్‌ కోర్సులో చేరి ఆ తర్వాత ఎం.బి.బి.ఎస్‌ చదివి, ఎం.ఎస్‌. పూర్తి చేసి డాక్టరుగా సేవలందించాలని తన పరిధిలో ఆచరణాత్మకమైన పథకం వేసుకుంది. మరో అనూహ్యమైన అంశం- ఒక యువకుడితో తనకు సంబంధం ఏర్పడిందన్న అబద్ధపు పుకారును తానే ప్రచారం చేసుకొని రఘు, పద్మలకు తన మీద అసహ్యం కలిగేటట్లు చేస్తుంది. ఇది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బలపడటానికి పరోక్షంగా పనికి వచ్చింది. పుకార్ల వల్ల ఆడపిల్లలకు జరిగే అనర్థం పెండ్లి కాకపోవటమే అయితే, రమణ అందుకు సిద్ధంగానే వుంది. పద్మ కూడా ఆధునిక భావాలున్న యువతి కనుకనే రఘుతో కులాంతర వివాహానికి అంగీకరిం చింది. రఘుకు ఆర్థిక సహాయం అందించి చదువుకు, ఉద్యమానికి తోడ్పాటునందించింది. రమణ మెడిసిన్‌ చదవటానికి ఆర్థిక సహాయం అందించటానికి ముందుకు వచ్చింది.  


‘యుగసంధి’ చారిత్రక స్వభావం ఉన్న నవల కూడా. చారిత్రక నవలకు కాలమే కాన్వాస్‌. నిజాం పరిపాలనా కాలపు అంతిమ దశాబ్దం ఈ నవల లోని ప్రధాన కాలం. రాచరిక వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవ స్థల సంధికాలంలో తెలంగాణ యువతరం జీవితాలను చిత్రించటమే తన ధ్యేయంగా రచయిత ఈ నవలకు ‘యుగసంధి’ అన్న పేరు పెట్టి ఉంటాడు. హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ ప్రాంతం వాడైన రచయిత భాస్కరభట్ల కృష్ణారావు ఈ కాల స్థలాల్లోనే జీవించాడు. ఈ కాలాన్ని చాలా నవలలు చిత్రించాయి. అవన్నీ తెలంగాణ విముక్తిని ఆకాంక్షించి సామాన్యులు చేసిన పోరాటాన్ని విజయవంతంగా చిత్రించాయి. గ్రామీణ ప్రాంతపు పచ్చని పొలాలలో వెచ్చని నెత్తురు ఇంకిన చరిత్రను రక్తాక్షరాలతో నమోదు చేశాయి. ‘యుగసంధి’ నవల చాలావరకు హైద రాబాద్‌ నగర చరిత్ర. చారిత్రక సంభావ్యతను లెక్కచేయ కుండా నెత్తురంటిన చేతులతో రాజముద్రలు వేస్తూపోయిన నిజాం పరాజయ గాథకు ఈ నవల అద్దం పట్టింది. ఆ రకంగా ప్రజాస్వామ్యపు బుడిబుడి అడుగులు రాచరికం ఉక్కు పాదాలను అణచివేసిన యుగసంధిని కూడా ఈ నవలలో కృష్ణారావు సజీవంగా చిత్రించాడు. ఆయా చారిత్రక ఘట్టాలు చూపిన ప్రభావాన్ని పాత్రలపరంగా రచయిత పాఠకులకు తెలియజేశాడు. 


‘వందేమాతరం’ ఉద్యమం (1938) కారణంగా ఉస్మా నియా విశ్వవిద్యాలయం తొలగించిన విద్యార్థులను నాగ పూర్‌ విశ్వవిద్యాలయంలో చేర్చటానికి కృషి చేసినవారిలో రఘు కూడా ఉన్నాడు. అతడు ఈ ఉద్యమ కాలంలో నాయకత్వ స్థానానికి ఎదిగాడు. ఈ కారణంగానే నిజాం ప్రభుత్వం అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం దిక్కులేని పక్షి అయిన రుక్మిణి మీద కనిపిస్తుంది. ఆమె పజ్జొన్న రొట్టె తినవలసి వస్తుంది. సిగరెట్‌ ఫ్యాక్టరీలో కూలీ పని కోసం లంచం ఇవ్వటానికి ఇంట్లోని వస్తువులను అమ్మవలసి వస్తుంది. చివరకు ఫ్యాక్టరీ మేనేజరైన కాముకుడు రషీద్‌కు లొంగిపోవలసి వస్తుంది. రజాకార్లు రషీదును తమలో కలవమని, రుక్మి ణిని తురక మతంలో కలపమని ఒత్తిడి తెస్తారు. లేదంటే చంపేస్తామని బెదిరిస్తారు. రషీదు ప్రాణాలు కాపాడటానికి రుక్మిణి మతాంతరీకరణకు అంగీకరించినా అతడు అంగీక రించడు. ఫలితంగా రషీదును వాళ్ళు నడిరోడ్డు మీద హత్య చేస్తారు. అతని చెయ్యిని ఖండిస్తారు. ఇది రజాకార్లు షోయబుల్లాఖాన్‌ అనే ‘ఇమ్రోజ్‌’ పత్రికా సంపాదకుణ్ణి హత్య చేసిన సంఘటనను గుర్తుకు తెస్తుంది. జమీందారు ఆంజనే యులును కూడా రజాకార్లు డబ్బుకోసం బెదిరిస్తారు. అతడు లొంగకుండా రక్షణ చర్యలు చేపట్టి కుటుంబాన్ని కాపాడుకుం టాడు. నిజాం భారత సైన్యానికి లొంగి పోవటంతో తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటారు. ఈ చారిత్రక ఘట్టాలకు రఘు ఆలంబనగా ఉన్నాడు. 


నవలలోని పాత్రల్లో యువకుల మీదికంటే యువతుల ఆశలు, ఆశయాలు, విజయ పరాజయాల మీద భాస్కర భట్ల ఎక్కువ దృష్టి కేంద్రీకరించాడు. యువకులలో రఘు ఒక్కడే ఫోకస్‌లో ఉన్నాడు. యువతులైన రుక్మిణి, రమణి, పద్మల భిన్న వ్యక్తిత్వాలను చిత్రించటంలో రచయిత శ్రద్ధ చూపించాడు. ఇది కృష్ణారావు ప్రత్యేకతను తెలియజెప్పే అంశం. తన పాత్రలలో ఆయనకు రుక్మిణి పట్ల వున్న అభిమానం, సానుభూతి గుర్తించదగ్గవి. ఇట్లాంటి పాత్ర ఇతర నవలల్లో మనకు కనిపించదు. ఒక బాల వితం తువుగా, మగతోడు కోసం ఆరాటపడ్డ యువతిగా, తన ప్రమేయమేమీ లేకుండానే మగవాళ్ళ చేతుల్లో  మోసపోయిన స్త్రీగా, ఎల్లమ్మతోపాటు స్థిరపడ్డ కార్మికురాలిగా, తన బంధు మిత్రులను కలుసుకోవాలని తపించిన బాంధవిగా రుక్మిణి ప్రత్యేకమైన పాత్ర. శారీరకమైన హింసకు లోనయినకొద్దీ మానసికంగా పరిణతిని సాధించిన ఒక అరుదైన పాత్ర రుక్మిణి. చివరకు కులమతాలకు అతీతురాలు కావటమే కాదు, డీక్లాస్‌ అయి కార్మికురాలిగా స్థిరపడుతుంది. 


భాస్కరభట్ల కృష్ణారావు ‘యుగసంధి’తోపాటు ‘వెల్లువలో పూచిక పుల్లలు’, ‘వింత ప్రణయం’, ‘భవిష్యద్దర్శనం’ అన్న నవలలు, ముప్ఫై దాకా కథానికలు రచించాడు. ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల విస్మృత రచయిత అయ్యాడు. హైదరాబాదు ఆకాశవాణిలో ఉన్నత ఉద్యోగిగా వుంటూ 48 సంవత్సరాల వయసులో మరణించాడు. 

(డిసెంబర్‌ 19 భాస్కరభట్ల కృష్ణారావు జయంతి)

అమ్మంగి వేణుగోపాల్‌

94410 54637


Updated Date - 2020-12-07T06:19:59+05:30 IST