చరిత్రను కబళించే కుట్ర

ABN , First Publish Date - 2020-09-16T05:36:43+05:30 IST

తెలంగాణ అంటేనే త్యాగాలు, బలిదానాలు, వీరుల రక్త తర్పణ. ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, ఠానూ నాయకు లాంటి సాధారణ మట్టి మనుషులు భూస్వాములను...

చరిత్రను కబళించే కుట్ర

నిజానికి నైజాం సర్కార్ వ్యతిరేక ఉద్యమంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం ఆనాడు ఉద్యమం జరిగింది. ఈ డిమాండ్లలో బీజేపీకి కనీసం ఏ ఒక్క డిమాండ్‌తో సంబంధం లేదు. అయినా ఆ పార్టీ తెలంగాణ విమోచన దినం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం హడావిడి చేస్తున్నది.


తెలంగాణ అంటేనే త్యాగాలు, బలిదానాలు, వీరుల రక్త తర్పణ. ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, ఠానూ నాయకు లాంటి సాధారణ మట్టి మనుషులు భూస్వాములను ఎదిరించిన పోరుగడ్డ తెలంగాణ. నిజాం నిరంకుశ పాలనను తుదముట్టించడమే కాకుండా దున్నే వాడిదే భూమి అని దేశానికి దారి చూపిన మాగాణం  తెలంగాణ. 1948 సెప్టెంబర్ 17న ఈ మహత్తర భూమి భారత్‌లో విలీనమయింది. అయితే ఈ విలీనం చరిత్ర అసత్యాలు, అర్ధసత్యాలతో వక్రీకరణలకు గురవుతున్నది. తెలంగాణ ప్రజలు ఒక సామాజిక మార్పు కోసం వీరోచితంగా పోరాడారు. ఆ మహోన్నత పోరాటానికి, స్వార్థ రాజకీయాల కోసం మతం మకిలి అంటించే చౌకబారు కపటనాటకానికి మతోన్మాదులు పూనుకున్నారు. అధికారం అండ, ధన బలంతో చరిత్రను మార్చచూస్తున్నారు. తనకు సంబంధం లేని చారిత్రక ఘట్టంలో తమ పాత్ర ఉన్నట్లు, తామే పోరాటం చేసినట్లు కల్పితాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్తమాన తెలంగాణ నవ తరం వారు వాస్తవాలు తెలుసుకోవాలి.


సమాజం పురోగమిస్తున్న కొలది మతమౌఢ్యం, అశాస్త్రీయ భావాలు బలహీనపడి ఆధునిక, పురోగామి భావాలు విస్తరించాలి. కానీ పాలకవర్గాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అలా జరగకుండా అడ్డుకుంటాయి. అశాస్త్రీయ భావాలు, మతమౌఢ్యం ప్రజల నుంచి దూరం కాకుండా చూడటానికి తమ శక్తి మేరకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ‘విమోచన దినం’ పేరుతో సెప్టెంబర్ 17ను బీజేపీ పాటించడం అందులో భాగమే. నిజానికి నైజాం సర్కార్ వ్యతిరేక ఉద్యమంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం ఆనాడు ఉద్యమం జరిగింది. ఈ డిమాండ్లలో బీజేపీకి కనీసం ఏ ఒక్క డిమాండ్‌తో సంబంధం లేదు. అయినా ఆ పార్టీ తెలంగాణ విమోచన దినం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం హడావిడి చేస్తున్నది. తనకు సంబంధమే లేకున్నా కమ్యూనిస్టుల పోరాట చరిత్రను స్వాయత్తం చేసుకునేందుకు చూస్తున్నది. 


విలీనానికి దారితీసిన సైనిక చర్య, విలీనం అనంతర పరిణామాలు మనకు స్పష్టంగా అర్థం కావాలంటే నాలుగు ప్రశ్నలకి  సమాధానాలు వెతకాలి. అవి: భారత సైన్యాలు నిజాం రాజును గద్దె దించడానికే వస్తే నిజాం రాజును అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా రాజ ప్రముఖ్‌గా ప్రకటించి, ఆయన చేతుల మీదుగానే 1950 జనవరి 26 వరకు ఎందుకు పరిపాలనను కొనసాగించారు? 1951 అక్టోబర్ 1 సాయుధ పోరాట విరమణ జరిగేంత వరకు సైన్యం గ్రామాలను ఎందుకు వీడలేదు? నిజాం నవాబును గద్దె దించడానికి భారత సైన్యాలను పంపాము అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ నైజాం సంస్థానం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత కూడా నిజాం నవాబునే గద్దెపై  కూర్చోపెట్టారు. అంటే కేంద్ర బలగాలు నిజాం నవాబును గద్దె దించడానికి రాలేదని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంను అణచి వేయడం కోసమే వచ్చాయనేది దీనిని బట్టి స్పష్టమ వుతుంది; భారత సైన్యాలు నిజాం నవాబు లొంగిపోయిన తరువాత కూడా గ్రామాల్లోకి ఎందుకు వెళ్లాయి? గ్రామాలలో శత్రువులు ఎవరు ఉన్నారు?; ప్రజలు దున్నుకుంటున్న భూముల నుండి ప్రజలను దౌర్జన్యపూరితంగా వెళ్లగొట్టి భూస్వాములకు భూములు అప్పగించమని సైన్యానికి ఎవరు చెప్పారు?; మిలటరీ సహకారంతో సాగిన మత మారణకాండకు బాధ్యులెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు నిష్పాక్షికంగా చెప్పుకోవాలి. విలీనానికి ముందు, విలీనం తర్వాత మతోన్మాదం, భూస్వాములు సాగించిన ఆగడాల నుంచి సరియైన గుణపాఠాలు నేర్చుకోవాలి. బీజేపీ ఉచ్చులో పడి తెలంగాణ మరోసారి మతకలహాల కుంపటిగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. అందుకు రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడడమే ఏకైక మార్గం. ఆ దిశగా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు కదలాలి.

మహమ్మద్ అబ్బాస్

Updated Date - 2020-09-16T05:36:43+05:30 IST