గోదావరిలోయలో కూలిన శిఖరం
ABN , First Publish Date - 2020-10-04T08:23:16+05:30 IST
విప్లవ పోరాట యోధుడు ఎస్.కె.ముఖ్తార్ పాషా కొవిడ్ వ్యాధితో ఇటీవల కన్నుమూశారు. 58 సంవత్సరాల జీవితంలో 40 సంవత్సరాల పాటు పూర్తిగా విప్లవోద్యమ...
విప్లవ పోరాట యోధుడు ఎస్.కె.ముఖ్తార్ పాషా కొవిడ్ వ్యాధితో ఇటీవల కన్నుమూశారు. 58 సంవత్సరాల జీవితంలో 40 సంవత్సరాల పాటు పూర్తిగా విప్లవోద్యమ నిర్మాణమే కర్తవ్యంగా ఆయన జీవించారు. విప్లవం తప్ప మరే వ్యాపకం గానీ, ఆలోచన గానీ లేని విప్లవకారుడైన పాషా మరణం ఒక్క సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీకే కాకుండా మొత్తం విప్లవోద్యమానికే తీరని లోటు.
దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన అనంతరం గోదావరి లోయలో గొప్ప ప్రజా ఉద్యమం వెల్లువెత్తింది. ఇల్లందుకు పొరుగునే ఉన్న గుండాలలో జన్మించిన పాషా విప్లవ భావాలకు ఆకర్షితుడయ్యారు. ఆనాటి ఖమ్మం జిల్లాలో భాగమైన ఇల్లందులోని హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే ముఖ్తార్ పాషా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు)లో పని చేశారు. ఇల్లందులోనే ఇంటర్మీడియట్ పూర్తిచేసి, ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బిజెఎన్‌ఆర్ కాలేజీలో డిగ్రీలో చేరారు. మొదటి సంవత్సరంలోనే డిగ్రీ విద్యను వదిలేసి విప్లవ కార్మికోద్యమానికి అంకితమై ఆంధ్రప్రదేశ్ టైల్స్ యూనియన్‌ను స్థాపించారు. నాటి నుంచి మొన్నమొన్నటి వరకూ ఆ యూనియన్‌ను ముందుకు నడిపించారు. విప్లవ కార్మికోద్యమం నిర్మాణంలో భాగంగా సింగరేణిలో ఆవిర్భవించిన గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(జిఎల్‌బికెఎస్), ఇతర కార్మిక సంఘాల ఏర్పాటుకు, వాటి పురోభివృద్ధికి పాషా చేసిన కృషి అనన్యమైనది. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టియు) రాష్ట్ర నాయకుడిగా మూడున్నర దశాబ్దాల పాటు ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. సిపిఐ(ఎం-ఎల్) ప్రజాపంథా ఏర్పాటయ్యాక ఆనాటి ఖమ్మం-–వరంగల్ ఏరియా కమిటీలో ముఖ్య భూమిక పోషించారు. రెవెన్యూ జిల్లాలుగా పార్టీ నిర్మాణం జరిగిన తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా, అటవీ ప్రాంత ఉద్యమానికి బాధ్యత వహించారు. కొత్తగూడెం డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిజేశారు. ఈ క్రమంలోనే సహచర కామ్రేడ్ జ్యోతితో మతాంతర వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె జన్మించింది. ఖమ్మం జిల్లా పార్టీ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి ఐఎఫ్‌టియు కార్మికనేతగా ఎదిగారు.
పార్టీలో తలెత్తిన రివిజనిజం, మితవాద భావాలు, ఆచరణకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో సాగిన అంతర్గత పోరాటంలో సాదినేని వెంకటేశ్వరరావు (ఎస్‌వి)తో కలిసి పాషా ముఖ్యపాత్ర పోషించారు. 2013లో చంద్రన్న నాయకత్వంలో జరిగిన రివిజనిస్టు వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర వహించారు. అనంతరం కొత్తగా ఏర్పాటైన పార్టీ రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యుడిగా కీలకపాత్ర పోషించారు. 2014లో జరిగిన సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ అఖిల భారత మహాసభలో కేంద్రకమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
తన జీవిత కాలమంతా గోదావరి లోయ పరీవాహక ప్రాంతంలో విప్లవోద్యమ నిర్మాణానికి పాషా ఎనలేని కృషి చేశారు. ఆదివాసీ ఉద్యమాలకు కొండంత అండగా నిలిచారు. పోడు కొట్టుకుని బతుకుతున్న బీదసాదలకు పార్టీని అండగా నిలిపారు. పెంకు (టైల్స్), హమాలి, సింగరేణి తదితర సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులను సంఘటితం చేయడంలో, ఆ సంఘాలను నడిపించడంలో ఆయన పాత్ర సాటిలేనిది.
నాలుగు దశాబ్దాలుగా ముఖ్తార్ పాషా సాగించిన విప్లవ కృషి ఎన్నదగినది, స్ఫూర్తిదాయకమైనది. దేశ స్థాయిలో వివిధ విప్లవ సంస్థల మధ్య సత్సంబంధాలు, ఐక్య కార్యాచరణ కొనసాగుతున్న సందర్భంలో పాషా అకాల మరణం విప్లవోద్యమానికి, ప్రజా ఉద్యమానికీ ఎంతో నష్టదాయకం. పార్టీ నిర్మాణానికి, ఉద్యమ విస్తరణకు, అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న విప్లవోద్యమానికి ఆయన లేని లోటు భర్తిచేయలేనిది. ముఖ్తార్ పాషా విశ్వసించి, జీవిత పర్యంతం ఆచరించిన రాజీలేని పోరాట మార్గంలో పురోగమించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుంది.
కె.గోవర్థన్
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,
సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ