ఒక బెల్జియం అద్దం

ABN , First Publish Date - 2020-03-21T05:30:00+05:30 IST

‘శాపాలతోటి కాళ తమోరాశి తూలదు/ఏపాటిదైన వెల్గు ప్రసారించుతూ పద...’ అని వెలుతురు దారుల్లోకి నడిపించి; ‘కొవ్వొత్తిలాగ కాలి ప్రదీపించు వారికీ/చెయ్యెత్తి లాల్ సలాం సమర్పించుతూ పద...’

ఒక బెల్జియం అద్దం

ఎంత చక్కని రోజులవి! రాంభట్లని కలిస్తే చాలు... సోల్జినిత్సిన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంపు నుంచి సోమర్ సెట్ మామ్ శృంగారం దాకా, మైకలేంజిలో ‘డేవిడ్’ నుంచి విన్సెంట్ వాంగో ‘సన్ ఫ్లవర్స్’ దాకా , మిరుమిట్లు గొలిపే కొమురం భీం సాహసం నుంచి తలవంచని దొడ్డి కొమరయ్య త్యాగం దాకా, మయకోవస్కీ ‘లెనిన్’ కావ్యం నుంచి పాబ్లో నెరూడా అరుణారుణ కవితా చరణాల దాకా, బాబిలోనియా మెసపుటేమియా నాగరికతల నుంచి మొఘల్ సామ్రాజ్యపు అంతిమ ఘడియల దాకా... ఆయన చిటికెన వేలు పట్టుకుని నడిస్తే చాలు... Around the world with only chai... ఎందుకంటే రాంభట్ల కవి, రచయిత, విమర్శకుడు, ఆర్టిస్టు, కార్టూనిస్టు, హిస్టోరియన్... ఇంకా ఎన్నో... కళా సౌందర్య తత్వ జ్ఞాన నిధి తాళం చెవిని జేబులో వేసుకు తిరిగే మాంత్రికుడు... తాంత్రికుడు రాంభట్ల.


‘శాపాలతోటి కాళ తమోరాశి తూలదు/ఏపాటిదైన వెల్గు ప్రసారించుతూ పద...’ అని వెలుతురు దారుల్లోకి నడిపించి; ‘కొవ్వొత్తిలాగ కాలి ప్రదీపించు వారికీ/చెయ్యెత్తి లాల్ సలాం సమర్పించుతూ పద...’ అంటూ ఉత్తేజ పరిచినవాడు రాంభట్ల కృష్ణమూర్తి. ‘సనాతనాల బూజుపై కులం మతం రివాజుపై/పురాణ నమ్మకాలపై తుఫాను రేగుతోందిరా...’ అని గొప్ప ఆశావహ దృక్పథాన్ని ఇచ్చినవాడూ ఆయనే. రాంభట్లగారి నెపంతో కొన్ని జ్ఞాపకాలూ... కొంత నా సొంత సొద..


1960వ దశకం... హైదరాబాద్: హిమాయత్ నగర్ కావచ్చు. ఒక సాయంకాలం. మఖ్దూం మొహియుద్దీన్, రాంభట్ల కృష్ణమూర్తి, మరికొందరు స్నేహితులతో కూర్చుని ఉన్నారు. ‘‘నేనొక కొత్త పద్యం రాశాను, చదువుతాను వినండి’’ అన్నారు మఖ్దూం. అది ఉర్దూ కవిత. అందరూ శ్రద్ధగా విన్నారు. మంచి కవిత్వం. గొప్ప రిథమ్. బాగా నచ్చింది. ‘వహ్వా..’ అన్నారంతా. ‘‘దాన్ని నేను తెలుగులోకి అనువాదం చేస్తాను’’ అన్నారు రాంభట్ల. మఖ్దూం సందేహించారు. ‘‘ఆ కవిత ఉర్దూ సంప్రదాయానికి సంబంధించినది. తెలుగులోకి ఒదగదేమో’’ అన్నారు. దాన్ని తెలుగు చేయడం అసాధ్యం అనుకున్నారాయన. ‘‘నేను చేస్తాను. దానికి తగిన ఛందస్సు తెలుగులో ఉంది’’ అన్నారు రాంభట్ల పట్టుదలగా. రెండు మూడు రోజుల్లోనే రాంభట్ల ఆ కవితను తర్జుమా చేశారు. మఖ్దూంకి వినిపించారు. ఆయన ఆశ్చర్యపోయారు. చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. మఖ్దూం పద్యానికి రాంభట్ల అనువాదం... శీర్షిక ‘నృత్తం’..


‘సురూప రంగ రాగ సంచయాల వార్త తెచ్చెనూ సుమాయుధేక్షు ధన్వుసీధు పాత్రగొంచు వచ్చెనూ నిశాతపాల లేతలేత కాకతో తపించుతూ’ ఇదీ మకుటం ‘మహేశనృత్తమంటపం దిశాప్తమై రహించనీ ప్రసిద్ధశిల్ప శీర్ణమద్దిగంతముల్ రణించనీ జయించనీ శిలోచ్ఛయ ప్రభేదన శ్రమాప్తినీ జయించనీ విశుద్ధ స్నిగ్ధ ముగ్ధ ప్రేమ ప్రాప్తినీ’ అని- పంచ చామరంలో పకడ్బందీగా, లయబద్ధంగా నడిపించారు. ‘‘ఏక్ చమేలీకీ మండువే తలే...దో బదన్ ప్యార్ కీ ఆగ్ మే జల్ గయే...’’ అనే మఖ్దూం ప్రసిద్ధ గీతాన్ని కూడా రాంభట్ల అనువదించారు. ‘మఖ్దూం కవిత’ అనే సంకలనంలో ఈ రెండు కవితలూ ఉన్నాయి. 


1973-74విజయవాడ..విశాలాంధ్ర..చుట్టుగుంట: అప్పట్లో విశాలాంధ్ర దినపత్రిక ఆఫీసంటే ఒకటి కాదు, వంద..లిటరల్‌గా దిన, వార, మాస పత్రికలూ, కొన్ని టాబ్లాయిడ్లూ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (వీపీహెచ్) పుస్తకాలూ, నవలలు, కథా, కవితా సంకలనాలూ, సావనీర్లు, పోస్టర్లు, ఇన్విటేషన్లు, కరపత్రాలూ వందలు వేలల్లో ప్రింటవుతుండేవి. చండ్ర రాజేశ్వరరావు, నీలం రాజశేఖరరెడ్డి, వేములపల్లి శ్రీకృష్ణ, రాజ్ బహదూర్ గౌర్, విజయకుమార్, కె.ఎల్.మహేంద్ర, సురవరం సుధాకరరెడ్డి లాంటి నాయకులు తరచూ వచ్చిపోతుండేవారు. ఇటు విశాలాంధ్రలో... ఎడిటర్ రాఘవాచారి, తుమ్మల వెంకట్రామయ్య, నిడమర్తి ఉమారాజేశ్వరావు, ఏటుకూరి బలరామ్మూర్తి, కంభంపాటి సత్యనారాయణ సీనియర్, వీపీహెచ్ బాస్ పీసీ జోషి, సొదుం రామ్మోహన్, కె.రాజేశ్వరరావు ఇలా ఎంతో మంది ప్రసిద్ధులు. ఇక రచయితలు మహీధర రామ్మోహనరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కవి రవి (రామలింగ శాస్త్రి), బొల్లిముంత శివరామకృష్ణ, చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, అదృష్ట దీపక్ ఇంకా అనేకులు వచ్చి వెళుతుండేవారు. రాంభట్ల, మల్లారెడ్డిగార్లను అక్కడే కలిసేవాళ్లం. వీళ్లంతా మోహన్‌కి మిత్రులూ, సన్నిహితులు. నేనెప్పుడూ మోహన్ వెంటే. మోహన్ వెనుక ఉండటమే పెద్ద ఎడ్యుకేషన్ అని చాలా ఏళ్ల తర్వాత నాకు తెలిసొచ్చింది. ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్ హౌజ్ మేడ మీద చిన్న గదిలో అరసం సమావేశాలు జరిగేవి. గుంటూరు శేషేంద్ర శర్మ, ఇందిరాదేవి ధన్ రాజ్‌గిర్‌ లాంటి ఎందరో కవుల్నీ రచయితల్నీ కలిసింది అక్కడే. సమావేశాల్లో రాం భట్ల, మల్లారెడ్డి మాట్లాడేవారు. వాళ్లిద్దరూ ఇద్దరే. ప్రవాహంలా పేట్రేగిపోతారు. సరదాగా... ఈజీగా... హాయిగా... హాస్యంతో, జోకులతో నవ్విస్తూ... రెడీ విట్టూ, క్విక్ రిపార్టీ... చటుక్కున ఒక గొప్ప పొయెం కోట్ చేయడం... ఒక్క మాటలో చెప్పాలంటే... చంపేస్తారంతే!! 1973లోనే అనుకుంటా... నరసరావుపేటలో జరిగిన ఆఫ్రో ఏషియన్ రచయితల సమావేశానికి వెళ్లాను. సాయంత్రం అందరూ ఊరేగింపుగా బయల్దేరారు. పులుపుల శివయ్య లీడ్ చేస్తూ ముందు నడుస్తుంటే, ఆయనతోపాటు రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జల మల్లారెడ్డి, గంగినేని వెంకటేశ్వరరావు... వాళ్లతో కుర్రకుంకని నేనూ... ఇంకా ఎంతో మంది. ఎంత చక్కని రోజులవి! రాంభట్లని కలిస్తే చాలు... సోల్జినిత్సిన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంపు నుంచి సోమర్‌సెట్ మామ్ శృంగారం దాకా, మైకలేంజిలో ‘డేవిడ్’ నుంచి విన్సెంట్ వాంగో ‘సన్ ఫ్లవర్స్’ దాకా, మిరుమిట్లు గొలిపే కొమురం భీం సాహసం నుంచి తలవంచని దొడ్డి కొమరయ్య త్యాగం దాకా, మయకోవస్కీ ‘లెనిన్’ కావ్యం నుంచి పాబ్లో నెరూడా అరుణారుణ కవితా చరణాల దాకా, బాబిలోనియా మెసపుటేమియా నాగరికతల నుంచి మొఘల్ సామ్రాజ్యపు అం తిమ ఘడియల దాకా.... ఆయన చిటికెన వేలు పట్టుకుని నడిస్తే చాలు... Around the world with only chai... ఎందుకంటే రాంభట్ల కవి, రచయిత, విమర్శకుడు, ఆర్టిస్టు, కార్టూనిస్టు, హిస్టోరియన్... ఇంకా ఎన్నో... కళా సౌందర్య తత్వ జ్ఞాన నిధి తాళం చెవిని జేబులో వేసుకు తిరిగే మాంత్రికుడు, తాంత్రికుడు రాంభట్ల. ఒక రోజు విజయవాడలో ఆయన కనిపించగానే- ‘‘హా.. హు... హీ... రాం భీం క్రీం భట్ ల...’’ అన్నాడు కవి అదృష్ట దీపక్. అంటే సాహితీ సంజీవనీ సిద్ధం శాయరా డింగరీ అని అర్థం. రాంభట్ల ఎంత ఆనందంగా నవ్వారో చెప్పలేను. వేగుంట మోహన ప్రసాద్... బతికిన క్షణాలు అన్నది ఇలాంటి రోజుల గురించే.


1977 జులై 15 హైదరాబాద్, ఖైరతాబాద్: విజయవాడ విశాలాంధ్రలో పని చేస్తున్న మోహన్‌కి హైదరాబాద్ నుంచి ఫోనొచ్చింది. సీనియర్ జర్నలిస్టు మోటూరి వెంకటేశ్వరరావు నుంచి. ‘‘ఇక్కడ ఈనాడులో పని చేయడానికి రాయడం వచ్చిన కుర్రాడినెవరినైనా పంపగలవా?’’ అని. తప్పకుండా అన్నాడు మోహన్. ‘‘నాకు ఇం గ్లీషు రాదు. అనువాదం అంతకంటే రాదు’’ అని చెప్పాను. ‘‘.....అదే వస్తుంది... వెళ్లరా’’ అని హైదరాబాద్ బస్సెక్కించాడు మోహన్. జూలై 19 ఈనాడు ఆఫీసుకు వెళితే... చాలా ఏళ్ల నుంచి తెలిసినట్టు మోటూరి పలకరింపు. మొదటి అంతస్తులో ఈనాడు ఎడిటోరియల్ సెక్షన్. పరిచయాలు అయ్యాక రెండో అంతస్తుకి తీసుకెళ్లారాయన. అక్కడ రాంభట్ల కృష్ణమూర్తి ఉన్నారు. అరె... నాకు తెలిసినాయనే కదా అనుకున్నా. ఇటు చూస్తే గజ్జెల మల్లారెడ్డి. ప్లజంట్ సర్‌ప్రైజ్. ఈయనా తెలుసు కదా. మరో టేబుల్ దగ్గర ఒక పెద్దాయన తెల్లని దుస్తులతో బట్టతలతో హుందాగా పేపరు చదువుకుంటున్నారు. ఈయన రాచమల్లు రామచంద్రారెడ్డి అని పరిచయం చేశారు. ఓ నమస్కారం పెట్టి మామూలుగా ఉండటానికి తెగ తిప్పలు పడ్డాను. ఆనందంతో కాళ్లు వణికాయి. రాంభట్ల చాలా లిబరల్, వెరీ ఫ్రెండ్లీ. సాహిత్య రాజకీయ కబుర్లు, జర్నలిజం ఎనక్‌డోట్స్ అలా చెబుతూనే ఉండేవారు. వీళ్లంతా పెద్దవాళ్లు. ఎస్టాబ్లిష్డ్ సూపర్ స్టార్లు. నాకు అప్పుడు 19 ఏళ్లు. వీళ్లతో ఉండటం, చదవడం, రాయడం, నేర్చుకోవడం... అదో గొప్ప అదృష్టం అనీ, దేవతలు దోసిట్లో నింపిన అమృతమనీ కొంచెం లేటుగా అర్థమైంది. రాంభట్ల గారికి గురజాడ కన్యాశుల్కం ఒక అబ్సెషన్. గిరీశాన్నో, మధురవాణినో కోట్ చేయకుండా ఆయనకి రోజు గడవదు. ‘‘నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్ గిరీ చెలాయించడం’’ అని బుచ్చమ్మకు వెంకటేశం చేత చెప్పించిన మాట ఎంత సత్యం. గురజాడ మోకాలును తాకగల రచయితలు కూడా కన్పించడం లేదు అంటారాయన. కొంత స్వీపింగ్‌గా అనిపించినా అలా నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన స్టైల్. మెరిసే కళ్లజోడూ, జీన్ ప్యాంటూ గళ్ల చొక్కా టక్ చేసుకుని, నుదుటి మీద పడుతున్న పెప్పర్ అండ్ సాల్ట్ హెయిర్‌ని సవరించుకుంటూ హుషారుగా మాట్లాడేవారు. భుజమ్మీద చెయ్యేసి ఏం ఫ్రెండూ అంటూ ఆత్మయమైన పలకరింపు. గురువూ, తండ్రీ, స్నేహితుడూ, మందలించేవాడూ, ప్రేమించేవాడూ జ్ఞానాన్ని దోసిళ్లతో పంచి ఇచ్చేవాడూ ఆ ఒక్కడే... రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం. Pinnacle of Perfection. ఆ flawless అద్దంలో మనల్ని మనం నిండుగా చూసుకోగలం. తెలుసుకోగలం. నేర్చుకోగలం. మురిసిపోగలం కూడా. -రాంభట్ల స్వచ్ఛంగా స్వేచ్ఛగా నిర్భీతిగా అలా ఎలా బతగ్గలిగారు అనుకుంటే...పూలదండలూ, సన్మానాలూ, సాహిత్య అకాడమీల లౌల్యం లేదు. ప్రభుత్వ పద్మశ్రీలు, పరమ వీర సాహితీ చక్ర బిరుదుల మోజూ లేదు. చదువుకోవడమే, తెలుసుకోవడమే, జ్ఞాన సముపార్జనే మానవుని కర్తవ్యం అని మనసా వాచా నమ్మినవాడిలా కనిపించేవాడు. పాత తరం కమ్యూనిస్టుల్లాగే ఆకలి, కన్నీళ్లూ లేని లోకం కోసం ఆశించాడు. కలలు కన్నాడు. కవిత్వం రాశాడు. ‘లేవండి వంచితులారా... పురిటాకలి వరకము నుంచీ/ ఘోషించె మోచన లావా... గగనాలన్ ముంచెత్తించీ...’ అంటూ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ (యూజినీ పాటియర్) గీతాన్ని తెలుగులోకి అనువదించింది రాంభట్టే. రెపరెపలాడే ఎర్ర జెండాల అంగార స్వప్నాల్ని మా గుండెల్లోకి నేరుగా ప్రేమగా బట్వాడా చేసినవాడు రాంభట్ల. ఆయన చాలా మందికి మానవుడూ... మార్గదర్శకుడూ... గురుతుల్యుడూ కావొచ్చు. నాకైతే అంతకంటే ఎక్కువే.

తాడి ప్రకాష్ (జర్నలిస్టు)

9704541559

(24న రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి)

Updated Date - 2020-03-21T05:30:00+05:30 IST