పెళ్లయిన 20 రోజులకే ఘోరం.. భర్తను చంపిన భార్య

ABN , First Publish Date - 2020-09-12T12:12:09+05:30 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

పెళ్లయిన 20 రోజులకే ఘోరం.. భర్తను చంపిన భార్య

హైదరాబాద్ : తాగుడు అలవాటు మానడం లేదని.. మద్యం మత్తులో తనను వేధిస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను రోకలిబండతో కొట్టిందో భార్య. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జిర్రా ముజాహీద్‌నగర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. తాళ్లగడ్డ మహబూబ్‌ కాలనీకి చెందిన సమ్రీన్‌(22)కు తల్లిదండ్రులు లేరు. ఆమె బాధ్యత మేనమామే చూస్తున్నాడు. 20 రోజుల క్రితం సమ్రీన్‌ వివాహాన్ని జిర్రా ముజాహీద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అస్లాం(25)తో జరిపించారు. 


పెళ్లినాటి నుంచే అస్లాం రోజూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగొద్దని సమ్రీన్‌ ఎంత చెప్పినా వినిపించుకోకుండా వేధింపులకు గురిచేసేవాడు. గురువారం రాత్రి అస్లాం మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఈ విషయమై శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో అస్లాం, సమ్రీన్‌ మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో సమ్రీన్‌ రోకలి బండతో అస్లాంపై దాడిచేయగా కుప్పకూలాడు. స్థానికులతో కలిసి అస్లాం తండ్రి బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అస్లాం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. టప్పాచబుత్ర సీఐ సంతో‌ష్‌ కుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు.

Updated Date - 2020-09-12T12:12:09+05:30 IST