జపాన్‌లో ‘ట్విటర్ కిల్లర్’.. మరణశిక్ష విధించిన కోర్టు

ABN , First Publish Date - 2020-12-15T21:09:48+05:30 IST

జపాన్‌లోని ఓ కిల్లర్ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని తర్వాత వారిని ఏకంగా పైకే పంపించేస్తున్న ఓ సీరియల్ కిల్లర్‌కు మంగళవారం టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. తకాహిరో షిరాయిషి(30).. జపాన్‌లోని ఓ సీరియల్ కిల్లర్. ట్విటర్‌లో...

జపాన్‌లో ‘ట్విటర్ కిల్లర్’.. మరణశిక్ష విధించిన కోర్టు

టోక్యో: జపాన్‌లోని ఓ కిల్లర్ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని తర్వాత వారిని ఏకంగా పైకే పంపించేస్తున్న ఓ సీరియల్ కిల్లర్‌కు మంగళవారం టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. తకాహిరో షిరాయిషి(30).. జపాన్‌లోని ఓ సీరియల్ కిల్లర్. ట్విటర్‌లో ఆత్మహత్యకు సంబంధించిన పోస్టులు పెట్టే యువతే ఇతడి టార్గెట్. వారిని నెమ్మదిగా బుట్టలో దించి ఫ్రెండ్ షిప్ చేస్తాడు. వారి బాధను తాను పోగొడతానంటూ నమ్మబలుకుతాడు. లేదా ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగిస్తాడు. ఆ తరువాత వారిని కలిసి కిరాతకంగా హతమారుస్తాడు. వారి శరీరాన్ని ముక్కముక్కలు చేసి పైశాచిక ఆనందం పొందుతాడు. 


తకాహిరో న్యాయవాది మాత్రం తన క్లయింటుకు మద్దతుగా వాదించాడు. తన క్లయింటు చంపిన వారందరూ తమంతతాముగా చనిపోవాలనుకున్నారని, అందువల్ల ఇతడికి కనీసం యావజ్జీవ శిక్ష విధించాలని, మరణశిక్షను తొలగించాలని విన్నవించాడు. అయితే ధర్మాసనం మాత్రం ఇందుకు అంగీకరించలేదు. చనిపోయిన వారు ఎవరూ కూడా మరణించాలని కచ్చితంగా నిర్ణయించుకోలేదని, అందుకే ఇతడికి మరణశిక్షే సరైదని తీర్పు వెలువరించింది. తకాహిరోకు టోక్యో కోర్టు మరణ శిక్ష విధించడంపై బాధితుల కుటుంబాలు హర్ష వ్యక్తం చేశాయి. ఇలాంటి దుర్మార్గుడికి ఎన్నిసార్లు మరణశిక్ష విధించినా తప్పులేదని నినదించాయి. ఇదిలా ఉంటే మరణశిక్షను పునరుద్ధరించిన అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. ఇక్కడి ప్రజలు కూడా ఈ శిక్షను స్వాగతిస్తున్నారు. 

Updated Date - 2020-12-15T21:09:48+05:30 IST