మహిళల అక్రమ రవాణా కేసులో ట్రావెల్‌ ఏజెంట్‌ అరెస్టు

ABN , First Publish Date - 2020-12-26T11:59:07+05:30 IST

గల్ఫ్‌దేశాల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి

మహిళల అక్రమ రవాణా కేసులో ట్రావెల్‌ ఏజెంట్‌ అరెస్టు

హైదరాబాద్‌ : గల్ఫ్‌దేశాల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి మహిళలను అక్రమంగా తరలించిన ట్రావెల్‌ ఏజెంటును శాలిబండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏజెంట్‌ దుబాయ్‌లో సూపర్‌మార్కెట్‌లో పని చేయడానికి వీసా ఉందని... నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు సంపాదించవచ్చని నమ్మించి మహిళలను అక్కడికి పంపించాడు. అరబ్‌ షేక్‌ల ఇళ్లల్లో పాచిపని చేయించసాగారు. తిండి, వసతి సౌకర్యాలు లేకుండా మహిళలను మానసికంగా, భౌతికంగా వేదనకు గురి చేశారు. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఇక్కడి పోలీసులను, స్థానిక నేతలను ఆశ్రయించారు.


వారిని భారత్‌కు రప్పించాలంటూ విదేశాంగ శాఖ మంత్రికి లేఖలు రాశారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన పాతబస్తీ అలియాబాద్‌ నివాసి రహీమాబేగం సోదరి సమీనాబేగం ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరిని మాయమాటలు చెప్పి షఫీ అనే ఏజెంటు ద్వారా అక్కడికి తీసుకెళ్లారని... అక్కడ చిత్రహింసలకు గురి చేస్తున్నారని సమీనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరిగి రప్పించడానికి ఏజెంటు వద్దకు వెళ్లగా డబ్బులు చెల్లిస్తేనే తిరిగి రప్పిస్తానని చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడు షఫీని అరెస్టు చేశారు.


నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 20మంది మహిళలను వర్కింగ్‌ వీసా పేరిట గత సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో దుబాయ్‌ పంపించినట్లు బాధితులు చెబుతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత రూ.2లక్షలకు అరబ్‌ షేక్‌లకు విక్రయించి... వారింట్లో పని చేయిస్తున్నట్లు అక్కడి నుంచి బాధితులు వివిధ మాధ్యమాల ద్వారా సంబంధీకులకు సమాచారం ఇచ్చారు. బాధితుల్లో ఒకరి బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Updated Date - 2020-12-26T11:59:07+05:30 IST