ముంబై మెట్రోలో ప్రమాదం..ఒకరి మృతి,ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2020-10-31T16:39:36+05:30 IST
ముంబై మెట్రోరైలు పిల్లరును ఓ క్రేన్ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....

ముంబై (మహారాష్ట్ర): ముంబై మెట్రోరైలు పిల్లరును ఓ క్రేన్ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాండ్రా నుంచి జోగేశ్వరి వెళుతున్న క్రేన్ అంధేరి గుండవలి బస్టాపు వద్ద శనివారం ఉదయం మెట్రోపిల్లరును ఢీకొట్టింది. క్రేన్ మెట్రో పిల్లరును బలంగా ఢీకొట్టడంతో క్రేన్ కాస్తా రెండు భాగాలుగా ముక్కలైంది. ఈ ప్రమాద ఘటనలో బస్టాపులో నిలబడి ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. బస్టాపులో నిలబడి ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన క్రేన్ డ్రైవరు పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. క్రేన్ డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు.