మహిళలపై అసభ్య వాఖ్యలు.. యువకుడి దారుణ హత్య..

ABN , First Publish Date - 2020-11-21T16:22:40+05:30 IST

తాగిన మత్తులో హైదరాబాద్‌ మహిళలను అసభ్యకరంగా దూషిస్తూ.. వ్యాఖ్యలు చేసిన యువకుడిని హత్య చేసిన నిందితుడిని బాలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. షాహిన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ అనే వ్యక్తి స్ర్కాప్‌ వ్యాపారం చేస్తుంటాడు.

మహిళలపై అసభ్య వాఖ్యలు.. యువకుడి దారుణ హత్య..

హైదరాబాద్‌ : తాగిన మత్తులో హైదరాబాద్‌ మహిళలను అసభ్యకరంగా దూషిస్తూ.. వ్యాఖ్యలు చేసిన యువకుడిని హత్య చేసిన నిందితుడిని బాలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. షాహిన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ అనే వ్యక్తి స్ర్కాప్‌ వ్యాపారం చేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఇమ్రాన్‌ తరచూ చాంద్రాయణగుట్టలో బార్‌కు వెళ్లేవాడు. రెండు నెలల క్రితం అదే బార్‌లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆనంఖాన్‌ అనే యువకుడు పరిచయయ్యారు. ఇద్దరూ కలిసి తరచూ మద్యం తాగేవారు. తాగిన మత్తులో ఉన్న ఆనంఖాన్‌ హైదరాబాదీ మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడేవాడు. అలా మాట్లాడొద్దని ఇమ్రాన్‌ పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆనంఖాన్‌ తన పద్ధతి మార్చుకోలేదు. గురువారం రాత్రి ఇద్దరూ కలిసి చంద్రాయణగుట్టలో మద్యం సేవించారు. అప్పుడు కూడా ఆనంఖాన్‌ అసభ్యకరంగా మాట్లాడాడు. కోపోద్రిక్తుడైన ఇమ్రాన్‌ అతన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. చంద్రాయణగుట్ట నుంచి ఆటోలో బాలాపూర్‌ వైపు వెళ్లారు. మార్గమధ్యంలో దిగి బీఫ్‌ (గొడ్డు మాంసం) కొనుగోలు చేశారు. అక్కడ మరోసారి ఆనంఖాన్‌ ఇష్టానుసారంగా మాట్లాడడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఇమ్రాన్‌ మాంసం దుకాణంలోని కత్తితో ఆనంఖాన్‌ను పొడిచి పారిపోయాడు. చికిత్స పొందుతూ ఆనంఖాన్‌ మృతి చెందాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్టు చేశారు. హైదరాబాదీ మహిళను వేశ్యలంటూ దూషించి, అసభ్యంగా మాట్లాడినందుకే ఆనంఖాన్‌ను హత్యచేశానని నిందితుడు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు.

Read more