బీరు బాటిల్‌తో కానిస్టేబుల్‌పై తలపై దాడి.. అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-18T01:58:46+05:30 IST

బీరు బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడిచేసిన 19 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ముగ్గురు వ్యక్తులు సబర్బన్

బీరు బాటిల్‌తో కానిస్టేబుల్‌పై తలపై దాడి.. అరెస్ట్

ముంబై: బీరు బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడిచేసిన 19 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ముగ్గురు వ్యక్తులు సబర్బన్ గోవండిలోని టాటానగర్ ప్రాంతంలో బైక్‌పై వేగంగా దూసుకెళ్తున్నారు. పెట్రోలింగులో ఉన్న నగరంలోని డియోనార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వినోద్ మాత్రే (50) వారిని గమనించాడు. బైక్‌పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు కత్తులు తిప్పుతూ కనిపించారు. దీంతో కానిస్టేబుల్ వారిని వెంబడించాడు. చివరికి గోవండి రైల్వే స్టేషన్ వద్ద వారిని అడ్డగించాడు. దీంతో అప్రమత్తమైన ఇద్దరు యువకులు నిందితుడు హస్మతాలి షేక్‌ను అక్కడే వదిలేసి బైక్‌పై పరారయ్యారు. 


కానిస్టేబుల్‌ను చూసిన షేక్ పరుగు లంకించుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ అతడిని వెంబడించి అతడి వద్దనున్న కత్తిని లాక్కునే ప్రయత్నం చేశాడు. అయితే, మరో చేతితో బీరుబాటిల్ పట్టుకున్న నిందితుడు దానితో కానిస్టేబుల్ తలపై కొట్టాడు. గమనించిన స్థానికులు రావడంతో షేక్ దొరికిపోయాడు. బీరుబాటిల్ బలంగా తాకడంతో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. నుదటిపై మూడు కుట్లు పడ్డాయి. షేక్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2020-12-18T01:58:46+05:30 IST