కరోనా సోకిందని భార్యకు చెప్పి.. లవర్‌తో సైలెంట్‌గా..

ABN , First Publish Date - 2020-09-17T19:45:31+05:30 IST

‘ఇదిగో.. నాకు కరోనా సోకింది.. ఇక నేను బతకను...’ ఇవీ ఓ భర్త తన భార్యకు ఫోన్‌లో చెప్పిన చివరి మాటలు. ఆమె తేరుకునే లోపలే అతడు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. పాపం.. ఆ సమయంలో ఆ ఇల్లాలికి భవిష్యత్తులో ఏం జరగబోతోందో అసలే మాత్రం తెలీదు. దీంతో గాబరా పడిపోయిన ఆమె.. తన పతి దేవుడు ఏ అఘాయిత్యం చేసుకున్నాడో అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కరోనా సోకిందని భార్యకు చెప్పి.. లవర్‌తో సైలెంట్‌గా..

ముంబై: ‘ఇదిగో.. నాకు కరోనా సోకింది.. ఇక నేను బతకను...’ ఇవీ ఓ భర్త తన భార్యకు ఫోన్‌లో చెప్పిన చివరి మాటలు. ఆమె తేరుకునే లోపలే అతడు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. పాపం.. ఆ సమయంలో ఆ ఇల్లాలికి భవిష్యత్తులో ఏం జరగబోతోందో అసలే మాత్రం తెలీదు. దీంతో గాబరా పడిపోయిన ఆమె.. తన పతి దేవుడు ఏ అఘాయిత్యం చేసుకున్నాడో అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అతడు స్విచ్ఛాఫ్ చేయక మునుపు ఫోన్ చివరి లొకేషన్‌ను గుర్తించారు. అక్కడికెళ్ళి చూస్తే.. అతడి బైక్, ఇతర వస్తువులు కనిపించాయి. ఆ పక్కనే ఉన్న సరస్సులో మునిగిపోయాడేమో అనే అనుమానంతో వారు జాలర్ల సాయంతో ముమ్మర తనిఖీలు చేశారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో అతడు చనిపోలేదని పోలీసులకు నమ్మకం కుదిరింది. 


దీంతో స్థానికంగా రికార్డైన సీసీటీవీ ఫుటేజీలను వారు జల్లెడ పట్టారు. వివిధ రాష్ట్రాల పోలీసులకు అతడి ఫొటో, ఇతర వివరాలను పంపించారు. ఈ క్రమంలో ఒకానొక సీసీటీవీ ఫుటేజీలో అతడి ఆచూకీ దొరికింది. ఓ మహిళతో పాటూ కారులో మనోడు షికారు కొడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే..అతడికి వివాహేతర సంబంధం కూడా ఉందన్న విషయం పోలీసుల విచారణలో బయటపడింది. 


ఇంకేముంది.. పెద్ద మిస్టరీగా కనిపించిన కేసు ఆ తరువాత క్షణాల్లో సాల్వైపోయింది. సదరు భర్త తన ప్రేయసితో ఇండోర్‌లో కులాసాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని ముంబైకి తీసుకొచ్చి భార్య వద్ద వదిలిపెట్టారు. కరోనాను అడ్డం పెట్టుకుని ఇంతటి పకడ్బందీ ప్లాన్ వేసిన ఆ ప్రబుద్దుడి పేరు మనీష్ మిశ్రా! ముంబైలో ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్‌లా పనిచేస్తున్నాడు. జూన్ 24న భర్త కనబట్లేదని భార్య ఫిర్యాదు చేయగా ఇటీవలే పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు.

Updated Date - 2020-09-17T19:45:31+05:30 IST