బీ కేర్‌ఫుల్.. జియో కస్టమర్‌ కేర్‌ పేరుతో మోసం!

ABN , First Publish Date - 2020-12-15T14:32:50+05:30 IST

రోజు రోజుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలో

బీ కేర్‌ఫుల్.. జియో కస్టమర్‌ కేర్‌ పేరుతో మోసం!

  • రూ. 2.70 లక్షలు 
  • కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు
  • పలువురి నుంచి రూ. 14.50 లక్షలు దోచిన సైబర్‌ ఛీటర్స్‌

హైదరాబాద్‌ : రోజు రోజుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కువ వినియోగదారులున్న జియో కస్టమర్లను టార్గెట్‌ చేస్తూ నయా మోసానికి తెరలేపారు. జియో నెట్‌వర్క్‌ వినియోగదారులకు ‘‘మీ బ్యాలెన్స్‌ పూర్తయింది. నిరంతర సేవల కోసం రీచార్జ్‌ చేసుకోండి’’ అంటూ మెసేజ్‌ రావడం సహజమే. దీనినే తమ అస్త్రంగా మలుచుకున్న సైబర్‌ చోరులు ‘‘మీరు రీచార్చ్‌ చేసుకోకపోతే మీ సిమ్‌ బ్లాక్‌ అవుతుంది. వెంటనే రీచార్చ్‌ చేసుకోండి’’ అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. రీచార్జ్‌ చేసేందుకు వారిని సంప్రదిస్తే బాధితులతో రిమోట్‌ యాక్సిస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించి మాటలతో మభ్యపెట్టి ఖాతా ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఇద్దరు మహిళలు వారు చెప్పిన విధంగా చేసి రూ. 2.70 లక్షలు పోగొట్టుకున్నారు. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


మరికొన్ని కేసుల్లో రూ. 11.36 లక్షలు

కస్టమర్లను ఇప్పిస్తామంటూ ఓ ఎల్‌ఐసీ ఏజెంట్‌ను మభ్యపెట్టిన సైబర్‌ నేరగాళ్లు అతడి నుంచి రూ. 86 వేలు కాజేశారు. అదేవిధంగా డబ్బులు పంపుతాము, క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేయమంటూ మరో ఆరుగురు వ్యక్తుల నుంచి రూ. 4.50 లక్షలను తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. మరో మహిళ తనకు తెలియకుండా తనప్రమేయం లేకుండా తన ఖాతాలోని రూ. 6 లక్షలు మాయమయ్యాయని, దానిపై విచారణ జరపాలంటూ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. వీరందరి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2020-12-15T14:32:50+05:30 IST