ట్రేడింగ్ పేరుతో.. 34 కోట్లకు టోకరా
ABN , First Publish Date - 2020-12-06T08:22:16+05:30 IST
షేర్‌మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో.. మూడు నగరాల్లో 850 మందిని బురిడీకొట్టించి రూ. 34కోట్లు కొల్లగొట్టిన ఘరానా ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

మూడు నగరాల్లో 850 మందికి టోపీ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): షేర్‌మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో.. మూడు నగరాల్లో 850 మందిని బురిడీకొట్టించి రూ. 34కోట్లు కొల్లగొట్టిన ఘరానా ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేటకు చెందిన ఖయ్యూమ్‌ఖాన్ షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటాడు. మూడు నెలల క్రితం అతడికి ఇంట్రాడేలో ట్రేడింగ్ కాల్స్ ఇస్తానంటూ కొందరు ఫోన్ చేశారు. దీంతో బాధితుడు లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. మొదట్లో లాభాలు వచ్చినట్లు నమ్మించడంతో.. మరింత పెట్టుబడి పెట్టాడు. తర్వాత అవతలి వ్యక్తులు ఫోన్ స్విచాఫ్ చేశారు. దాంతో బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించారు. సైనిక్‌పురికి చెందిన కౌశిక్ బెనర్జీ, రేఖా జాదవ్‌లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా హైదరాబాద్‌తోపాటు.. కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో 850 మందిని మోసం చేసిందని రూ. 34 కోట్లు కొల్లగొట్టిందని గుర్తించారు.