వంట చేయలేదని భార్యను చంపిన భర్త

ABN , First Publish Date - 2020-12-06T11:49:02+05:30 IST

చెప్పిన వంట చేయలేదన్న కోపంతో

వంట చేయలేదని భార్యను చంపిన భర్త

హైదరాబాద్ : చెప్పిన వంట చేయలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను హత్య చేశాడు భర్త. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. లెనిన్‌నగర్‌లోని ప్రశాంత్‌నగర్‌ బస్తీకి చెందిన బొడిగె శ్రీను(45), జయమ్మ(40) దంపతులు. శ్రీను లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా, జయమ్మ బీడీఎల్‌లో స్వీపర్‌గా పని చేస్తోంది. వారికి సంతానం లేకపోవడంతో శ్రీను సోదరుడు సత్తయ్య కుమారుడు వినయ్‌(16)ని దత్తత తీసుకొన్నారు. శుక్రవారం జయమ్మ, వినయ్‌ కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్‌ గ్రామానికి బంధువుల వివాహానికి వెళ్లగా, శ్రీను సంస్థాన్‌నారాయణపురం మండలంలోని సర్వేల్‌లో జరిగిన మరో వివాహానికి వెళ్లాడు. సాయంత్రం వారంతా ఇంటికి చేరుకున్నారు. 


కుమారుడు వినయ్‌ ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. లారీ డ్రైవింగ్‌కు వెళ్లాల్సి ఉన్నది తొందరగా వంట తయారు చేయాలని భార్య జయమ్మకు భర్త శ్రీను చెప్పాడు. ఆమె వంట చేయకుండా అలాగే కూర్చోవడంతో ఆగ్రహానికి గురైన శ్రీను ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో శ్రీను కోపంతో చీరను జయమ్మ మెడకు చుట్టి గట్టిగా బిగించడంతో ఊపిరి ఆడక మృతి చెందింది. శ్రీను అక్కడి నుంచి ఉడాయించాడు.


గంట సేపటికి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు వినయ్‌ తమ తల్లి మృతి చెంది ఉండడాన్ని గమనించి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పాడు. వారు మీర్‌పేట్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు శ్రీను పరారీలో ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. 


Read more