భార్యాభర్తల అనుమానాస్పద మృతి.. సూసైడ్ లేఖలో..

ABN , First Publish Date - 2020-03-28T19:02:43+05:30 IST

రాజమహేంద్రవరంలో భార్యాభర్తలు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం ఏవీ ఏ రోడ్డు

భార్యాభర్తల అనుమానాస్పద మృతి.. సూసైడ్ లేఖలో..

ఆర్థిక, అనారోగ్య సమస్యలు,  కరోనా భయమంటూ సూసైడ్‌ లేఖ

రాజమహేంద్రవరం సిటీ(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో భార్యాభర్తలు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం ఏవీ ఏ రోడ్డు సమీపంలో నివసిస్తున్న రాజమండ్రి సతీష్‌(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల వరకు వారి ఇంటి వద్దే వున్న సతీష్‌, వెంకటలక్ష్మి(35) దంపతులు తెల్లవారేసరికి కాలిపోయి మృతి చెందారు. స్థానికులు ఈ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటీన చేరుకుని పరిసరాలను పరిశీలించగా సమీపంలో బ్యాగ్‌తో పాటు సెల్‌ఫోన్‌, ఓ లెటర్‌ లభ్యమైంది. గురువారం రాత్రి వారిద్దరు స్పృహలో లేనప్పుడు ఎవరైనా పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టి హత్య చేసి ఉంటారా...అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.


 పోలీసులకు లభించిన సూసైడ్‌ నోట్‌లో తన భార్యకు కిడ్నీ వ్యాధి ఉందని, తనకు నరాల బలహీనత తదితర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అందులో తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రస్తుతం కరోనా భయం ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ లెటర్‌లో పేర్కొన్నారు. తమ మరణానికి ఎవ్వరూ బాధ్యులు కారని రాసి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని సతీష్‌ బావమరిది కూడా చెబుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. భార్యాభర్తల మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.  ఎస్‌ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-28T19:02:43+05:30 IST