హేమంత్ కేసు: ఆరుగంటల సుదీర్ఘ విచారణలో అవంతి చెప్పిన విషయాలివే!

ABN , First Publish Date - 2020-09-29T23:04:18+05:30 IST

తనకు ప్రాణ హాని ఉందని అవంతి వాపోయింది. తన భద్రతపై పోలీసులు చూసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. హేమంత్ హత్య కేసులో నిందితులకు

హేమంత్ కేసు: ఆరుగంటల సుదీర్ఘ విచారణలో అవంతి చెప్పిన విషయాలివే!

హైదరాబాద్ : హేమంత్ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో గంటకో ట్విస్ట్, సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం నాడు అవంతిని పోలీసులు విచారించారు. ఆరుగంటల పాటు జరిగిన సుధీర్ఘ విచారణలో ఆమె పలు కీలక విషయాలను చెప్పారు. తనకు ప్రాణ హాని ఉందని అవంతి పోలీసులు ఎదుట వాపోయారు. తన భద్రతపై పోలీసులు చూసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. హేమంత్ హత్య కేసులో నిందితులకు బెయిల్ రాకుండా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.


గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో అవంతి విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు అవంతి, హేమంత్ కుటుంబసభ్యులను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. బాధితులిచ్చిన స్టేట్‌మెంట్‌ను గచ్చిబౌలి పోలీసులు రికార్డ్ చేశారు. విచారణ అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పినట్టు తెలిపారు. తనకు సైబరాబాద్ పోలీసులు రక్షణగా ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన భర్త హేమంత్ హత్య కేసుపై ఉదయం నుండి పోలీసులు విచారణ చేసి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, తనకు ఉన్న అనుమానాలును పోలీసులు దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు.


హేమంత్ తండ్రికి బెదిరింపు కాల్స్ వచ్చాయని వెల్లడించారు. బెదిరింపు కాల్స్ ఆడియోలు పోలీసులకు ఇచ్చామని తెలిపారు.  హేమంత్‌ను చంపతారని తాము ఊహించలేదని, అందుకే చందానగర్ నుండి గచ్చిబౌలి వచ్చిన విషయం పోలీసులకు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని అవంతి ప్రకటించారు.


చందానగర్‌కు చెందిన అవంతి, హేమంత్‌ చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉండేవారు. ఈ క్రమంలోనే అవంతి, హేమంత్ తల్లికి దగ్గరైంది. ఆ తర్వాత ఆమె హేమంత్‌తో ప్రేమలో పడింది. అవంతి, హేమంత్‌ల ప్రేమ విషయం తెలుసుకున్న అవంతి తల్లిదండ్రులు గతేడాది నవంబరు నుంచి ఆమెను సుమారు 8 నెలలపాటు ఇంటినుంచి బయటకు రాకుండా చేశారు. 2020 జూన్‌ 9న అవంతిరెడ్డి రహస్యంగా బయటకు వచ్చింది. హేమంత్‌ను కలిసి జూన్‌ 10న బీహెచ్‌ఈఎల్‌లోని సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించక సుపారీ ఇచ్చి, ఆమె భర్తను తల్లిదండ్రులు చంపించారు.

Updated Date - 2020-09-29T23:04:18+05:30 IST