ఇష్టం లేదన్నందుకు యువతి గొంతు పిసికి చంపిన నిందితుడు.. అరెస్టు

ABN , First Publish Date - 2020-04-26T22:00:55+05:30 IST

తనను ఇష్టపడడం లేదన్న అక్కసుతో ఓ దుర్మార్గుడు నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. యువతి గొంతు పిసికి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం.....

ఇష్టం లేదన్నందుకు యువతి గొంతు పిసికి చంపిన నిందితుడు.. అరెస్టు

ఫిరోజాబాద్: తనను ఇష్టపడడం లేదన్న అక్కసుతో ఓ దుర్మార్గుడు నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. యువతి గొంతు పిసికి అత్యంత  కిరాతకంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఫిరోజాబాద్‌లో ఓ 18 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివశిస్తోంది. అయితే పవన్(25) అనే యువకుడు కొన్ని రోజులుగా ఆమె వెంట పడుతున్నాడు. అయినా ఆమె పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పోలంలో ఉన్న తల్లిదండ్రులకు భోజనం ఇచ్చి తిరిగి వస్తుండగా పవన్ ఆమెకు అడ్డు తగిలాడు. బలవంతం చేయబోయాడు. ప్రతిఘటించిన ఆమె విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన పవన్ ఆమెను గొంతు పిసికి చంపేశాడు. వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. శనివారం తెల్లవారుజాము వరకు కూతురు తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలించడం ప్రారంభించారు. అయితే ఆమె శరీరాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో ఘటనా స్థలానికి తిరిగి వచ్చిన పవన్‌ను స్థానికులు గుర్తించారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  


ఇదిలా ఉంటే అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కన్న బిడ్డ జీవం లేకుండా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఇక తాము ఎవరికోసం బతకాలంటూ కన్నీరు పెట్టుకున్న తీరు స్థానికులను కలచివేసింది.

Updated Date - 2020-04-26T22:00:55+05:30 IST