హాథ్రాస్‌ గ్యాంగ్‌ రేప్‌ నిజమే

ABN , First Publish Date - 2020-12-19T06:41:28+05:30 IST

హాథ్రాస్‌ సామూహిక అత్యాచార ఘటన, మూడు నెలల తర్వాత కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొదట్నుంచీ విపక్షాలు, ప్రజా సంఘాలు,

హాథ్రాస్‌ గ్యాంగ్‌ రేప్‌ నిజమే

తేల్చిన సీబీఐ.. 3నెలల తర్వాత కేసులో కీలక మలుపు 


న్యూఢిల్లీ, డిసెంబరు 18: హాథ్రాస్‌ సామూహిక అత్యాచార ఘటన, మూడు నెలల తర్వాత కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొదట్నుంచీ విపక్షాలు, ప్రజా సంఘాలు, కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలే నిజమయ్యాయి. పందొమ్మిదేళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని సీబీఐ నిర్ధారించింది. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులు సందీప్‌, లవకుశ్‌, రవి, రాముపై అత్యాచారం, హత్య అభియోగాలను మోపుతూ శుక్రవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, హాథ్రాస్‌ కోర్టు ముందు అభియోగపత్రాన్ని ఉంచింది. సెప్టెంబరు 14న ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రా్‌సలో పశువులకు మేత తెచ్చేందుకు ఓ వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన దళిత యువతిని ఉన్నత కులానికి చెందిన సందీప్‌, లవకుశ్‌, రవి, రాము అడ్డుకున్నారు. ఆమె చున్నీతోనే మెడచుట్టూ బిగించి తోటలోకి లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆమె వెన్నెముకకు తీవ్రగాయమైంది.


అనంతరం నలుగురూ చిత్రహింసలకు గురిచేస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె నాలుకను కోసేసి.. గొంతు పిసికారు. చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేనెల 29న ప్రాణాలు విడిచింది. అదేరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహానికి ఆమె ఇంటి సమీపంలో పోలీసులు దహనక్రియలు పూర్తి చేశారు. యువతిపై సామూహిక అత్యాచారం, గుట్టు చప్పుడు కాకుండా మృతదేహానికి అర్ధరాత్రి తర్వాత పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదిత్యనాథ్‌ సర్కారు  కేసును సీబీఐకి అప్పగించింది. కాగా హాథ్రాస్‌ నిందితులపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత ప్రియాంకా.. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Read more