ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. : డీజీపీ సవాంగ్

ABN , First Publish Date - 2020-09-13T17:27:43+05:30 IST

అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని తెలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా కొలుస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. : డీజీపీ సవాంగ్

విజయవాడ : అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని తెలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులు ఎంత ప్రీతిపాత్రంగా కొలుస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇంతటి ప్రసిద్ధి ఉన్న అంతర్వేదిలో రథం దగ్ధం కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన పెను సంచలనమైంది. ఇప్పటికే ఈ ఘటనపై జగన్ సర్కార్‌ సీబీఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీస్, సబ్ డివిజన్, యూనిట్ రేంజ్ అధికారులతో ఇవాళ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించిన వివరాలు వెల్లడించారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల దగ్గర భద్రత చర్యలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. 


డీజీపీ సూచనలివీ..

ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఆలయాల జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. నేరచరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా పెట్టాలి. నిర్వాహకులు పోలీసులు సూచనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక పోలీసులు అక్కడ ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనలు పాటించేలా చూడాలి. ఆలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలి. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలి. ప్రజలు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి దేవాలయం దగ్గర పాయిట్‌ బుక్‌ ఏర్పాటు చేయాలి. పరిసరాల్లో అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాలిఅని పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.


ఎంతటి వారైనా సరే వదిలేది లేదు..!

అనుకోని ఘటనలు జరిగితే వాటికి సంబందించిన నిర్వాహకులు బాధ్యత వహించాలి. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకునేలా పీస్ కమిటీలు వేయాలి. గతంలో ఉన్న పీస్ కమిటీలు తరహాలో నేటి పరిస్థితికి అనుగుణంగా విధానాలు మార్చుకోవాలి. ఉద్దేశపూర్వకంగా బయటి నుంచి వచ్చి అరాచకాలకు పాల్పడే వారు కూడా ఉంటారు. కావాలనే మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎటువంటి ఉత్సవాలు వచ్చినా స్థానికులతో కమిటీ లు‌ వేసి వారే నిర్వహించేలా చూసుకోవాలి. స్థానికంగా ఉండే పరిస్థితులు, అంశాలను బట్టి కూడా ఎస్పీలు నిర్ణయాలు తీసుకోవాలి. దాడులను పూర్తిగా నియంత్రణ చేసే ఆలోచనలు ఇంకా ఏమైనా ఉంటే మాతో పంచుకోవచ్చు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా మందిరాల వద్ద భద్రతా చర్యలు పెంచాలి. ఎటువంటి ఘటనలు జరిగినా కారకులు ఎంతటి‌వారైనా వదిలే ప్రసక్తే లేదు. అదే విధంగా ‌విధుల్లో అలక్ష్యం వహిస్తే పోలీసు సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం అని డీజీపీ తేల్చిచెప్పారు.

Updated Date - 2020-09-13T17:27:43+05:30 IST