నవ దంపతులతో వ్రతం చేస్తుండగా హిజ్రాలు ఇంట్లోకి చొరబడి..

ABN , First Publish Date - 2020-12-27T12:45:10+05:30 IST

నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తుండగా

నవ దంపతులతో వ్రతం చేస్తుండగా హిజ్రాలు ఇంట్లోకి చొరబడి..

 హైదరాబాద్/నిజాంపేట్‌ : పెళ్లి ఇంట్లోకి చొరబడి డబ్బులు డిమాండ్‌ చేసి ఇవ్వకపోవడంతో, దూషించిన 8 మంది హిజ్రాలు, ఇద్దరు ఆటో డ్రైవర్లను బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రగతినగర్‌లోని ఆర్‌కే లేఅవుట్‌లో నివాసముండే పంచాంగం చలపతి ఈనెల 24న తన కుమారుడి వివాహం చేశాడు. 25వ తేదీన నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తుండగా 8మంది హిజ్రాలు ఆటోలో చలపతి ఇంటికి వచ్చి తమకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హిజ్రాలకు డబ్బులు ఇచ్చేందుకు వారు నిరాకరించడంతో అసభ్యకర పదజాలంతో దూషిస్తూ... పెద్ద పెద్దగా కేకలు వేస్తూ...  వికృత చేష్టలతో నానా హైరానా చేశారు. 


దీంతో భయపడిన చలపతి రూ.16,500 వారికి ఇవ్వడంతో వారు వచ్చిన ఆటో (నెంబర్‌ టీఎస్‌ 15యూడీ 0298)లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం చలపతి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఆటో నెంబర్‌ ఆధారంగా ప్రగతినగర్‌లోని ఆలిప్‌ ఎక్స్‌రోడ్డులో నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న 8మంది హిజ్రాలు సాక్షి అలియాస్‌ సహాన(ఏ1), మల్కాపూర్‌ రాకే్‌ష(ఏ2), మునావత్‌ రాకేష్‌ (ఏ3), రాములు గగనం(ఏ4), బప్పర బాబయ్య(ఏ5), తురపతి నర్సింహులు(ఏ6), తురపతి లింగం(ఏ7), తురపతి యాదయ్య(ఏ8) ఆటో డ్రైవర్లు కరణ్‌ గుప్తా(ఏ9), మహ్మద్‌ మసి(ఏ10)గా కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 7సెల్‌ఫోన్లు, రూ.16,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.  ఇటువంటి వారు ఎవరైనా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే 100కు డయల్‌ చేయడం లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ సురేందర్‌రావు తెలిపారు.

Updated Date - 2020-12-27T12:45:10+05:30 IST