కనీవినీ ఎరుగని ప్రపంచ మాంద్యం
ABN , First Publish Date - 2020-10-14T06:19:39+05:30 IST
కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక పరిస్థితులపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముమ్మాటికీ ఇది తీవ్రమైన ఆర్థిక మాంద్యమని పేర్కొంది. 2020 సంవత్సరంలో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు ఏకంగా మైనస్ 4.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ పేరుతో రూపొందించిన నివేదికలో ఐఎంఎఫ్ వెల్లడించింది...

- 2020లో వృద్ధి రేటు మైనస్ 4.4 శాతానికి
- భారత ఆర్థిక వ్యవస్థదీ అదేబాట
- మైనస్ 10.3 శాతంగా నమోదయ్యే అవకాశం
- 2021లో 8.8 శాతానికి చేరే చాన్స్: ఐఎంఎఫ్
వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక పరిస్థితులపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముమ్మాటికీ ఇది తీవ్రమైన ఆర్థిక మాంద్యమని పేర్కొంది. 2020 సంవత్సరంలో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు ఏకంగా మైనస్ 4.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ పేరుతో రూపొందించిన నివేదికలో ఐఎంఎఫ్ వెల్లడించింది.
కొవిడ్ మహమ్మారికి కేంద్రమైన చైనా ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ సాధించినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రం కరోనా ముందున్న స్థాయిలకు చేరుకోవటానికి మరికొంత సమయం పట్టొచ్చని తెలిపింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక మాంద్యం (డీప్ రెసిషన్)లో కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపినాథ్ వెల్లడించారు. జూన్ త్రైమాసికంతో పోల్చితే స్వల్పంగా 0.8 శాతం వృద్ధి కనిపించినప్పటికీ ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మైనస్ 4.4 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. అయితే సెప్టెంబరు త్రైమాసికంలో పటిష్ఠమైన రికవరీ సంకేతాలు కన్పించాయని, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు ఇంకా మందగమన బాటలోనే సాగుతున్నాయని గోపినాథ్ వివరించారు. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే 2021 లో మాత్రం 5.2 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది.
భారత్‌కు తిప్పలే
భారత ఆర్థిక వ్యవస్థకూ కరోనా కష్టాలు తప్పవని ఐఎంఎఫ్ మరోసారి హెచ్చరించింది. ఈ మహమ్మారితో ఈ ఏడాది భారత వృద్ధి రేటు మైనస్ 10.3 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కన్నా ఎక్కువగా పతనమైందని, దీంతో వృద్ధి అంచనాలను సవరించాల్సి వచ్చిందని తెలిపింది. అయితే 2021లో మాత్రం 8.8 శాతం వృద్ధి రేటుతో వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధి రేటు సాధించవచ్చని పేర్కొంది.
నివేదికలోని ఇతర ప్రధానాంశాలు
- పెరుగుతున్న భూతాపంతో 2100నాటికి 60-80 శాతం తగ్గనున్న భారత జీడీపీ
- ఇంకా అదుపులోకి రాని కొవిడ్ మహమ్మారి
- దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు
- ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోని ఉపాధి రంగం
- కటిక పేదరికానికి చేరువులో 9 కోట్ల మంది
- సేవలు, ముడి చమురు ఎగుమతి దేశాలకు మరిన్ని ఆర్థిక కష్టాలు