విప్రో రూ.9,500 కోట్ల బైబ్యాక్
ABN , First Publish Date - 2020-10-14T06:35:35+05:30 IST
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రూ.9,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ (తిరిగి కొనుగోలు)ను ప్రకటించింది. ఈ భారీ ప్రణాళికలో భాగంగా.. కంపెనీ పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 4.16 శాతం వాటాకు సమానమైన 23.75 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది...

- మొత్తం 23.75 కోట్ల షేర్ల కొనుగోలుకు సన్నాహాలు
- ఒక్కో షేరుకు రూ.400 చెల్లించనున్న సంస్థ
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రూ.9,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ (తిరిగి కొనుగోలు)ను ప్రకటించింది. ఈ భారీ ప్రణాళికలో భాగంగా.. కంపెనీ పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 4.16 శాతం వాటాకు సమానమైన 23.75 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.400 చొప్పున మొత్తం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది.
మంగళవారం బీఎ స్‌ఈ ట్రేడింగ్‌లో విప్రో షేరు ముగింపు ధర రూ.375.50తో పోలిస్తే బైబ్యాక్‌లో చెల్లించనున్న ధర 6.4 శాతం అధికం. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమో దం తెలిపారని స్టాక్ ఎక్స్ఛేంజీలకు విప్రో తెలిపింది. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ గతవారంలో రూ.16 వేల కోట్ల భారీ బైబ్యాక్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కో షేరును రూ.3,000కు కొనుగోలు చేసేందుకు టీసీఎస్ ముందుకొచ్చింది.
తాజాగా విప్రో కూడా టీసీఎస్ బాటను అనుసరిస్తూ భారీ బైబ్యాక్ ప్రకటించడం గమనార్హం. ఈ ప్రణాళికలో భాగంగా కంపెనీకి తమ వాటా షేర్లనూ విక్రయించాలనుకుంటున్నట్లు విప్రో ప్రమోటర్లు సంకేతాలిచ్చారు. ఈ నెల 9 నాటికి ప్రమోటర్, ప్ర మోటర్ గ్రూప్‌నకు విప్రోలో 74.02 శాతం వాటా ఉంది. కంపెనీ షేర్ల తిరిగి కొనుగోలు ప్రణాళికకు వాటాదారులు ఇంకా అనుమతి తెలపాల్సి ఉంది. ప్రత్యేక తీర్మానం ద్వారా పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన కంపెనీ వారి ఆమోదాన్ని కోరనుంది.
క్యూ2 లాభం రూ.2,465 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి విప్రో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,465.7 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గడించిన రూ.2,552.7 కోట్ల లాభం తో పోలిస్తే 3.4 శాతం తగ్గింది. ఈ జూలై-సెప్టెంబరు కాలానికి కంపెనీ ఆదాయం రూ.15,114.5 కోట్లుగా నమోదైంది. డిసెంబరుతో ముగియనున్న మూడో త్రైమాసికంలో ఐటీ సేవల వ్యాపారం ద్వారా 202.2-206.2 కోట్ల డాలర్ల ఆదా యం సమకూరవచ్చని విప్రో అంచనా. అంటే, త్రైమాసిక ప్రాతిపదికన రాబడి 1.5-3.5 శాతం వృద్ధి చెందవచ్చని కంపెనీ భావిస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి ఐటీ సేవల వ్యాపార ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 3.7 శాతం పెరిగి 199.24 కోట్ల డాలర్లకు చేరుకుంది.
విప్రో గూటికి ఎక్సిమియస్ డిజైన్
ఇంజనీరింగ్ సేవల కంపెనీ ఎక్సిమియస్ డిజైన్ అనే కంపెనీని 8 కోట్ల డాలర్లకు (రూ.586.30 కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు విప్రో ప్రకటించింది. కొత్త మార్కెట్లకు విస్తరించడంతోపాటు కనెక్టెడ్ ప్రొడక్ట్స్, ఎంబెడెడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెక్యూరిటీ వంటి భవిష్యత్ తరం సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ కొనుగోలు దోహదపడనుందని పేర్కొంది. అమెరికా.. శాన్‌జోస్ కేం ద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎక్సిమియస్‌కు ఇండియా, మలేషియాలో డిజైన్ సెంటర్లు ఉన్నాయి.
