ఆర్థిక వ్యవస్థల బలహీనతలు బయటపడ్డాయ్‌

ABN , First Publish Date - 2020-12-11T08:12:58+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల లోపాలు, బలహీనతలను కొవిడ్‌ మహమ్మారి బయట పెట్టిందని, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఈ వైరస్‌ అవకాశం ఇచ్చిందని నోబెల్‌ బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్‌ సామాజిక

ఆర్థిక వ్యవస్థల బలహీనతలు బయటపడ్డాయ్‌

మళ్లీ పూర్వ స్థితి రావాలని ఎందుకు కోరుకోవాలి?

 కొవిడ్‌పై నోబెల్‌ గ్రహీత మహ్మద్‌ యూనస్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రపంచ ఆర్థిక వ్యవస్థల లోపాలు, బలహీనతలను కొవిడ్‌ మహమ్మారి బయట పెట్టిందని, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఈ వైరస్‌ అవకాశం ఇచ్చిందని నోబెల్‌ బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్‌ సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్‌ మహ్మద్‌ యూనస్‌ అన్నా రు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వాణిజ్యపరం చేయడంలో అమానవీయ కోణాలు వెలుగు చూస్తున్నాయని టై గ్లోబల్‌ సదస్సులో పేర్కొన్నారు. ‘పోస్ట్‌-కరోనా రీకన్‌స్ట్రక్షన్‌ ప్రోగ్రామ్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌కు ముందున్న జీవితానికి భిన్నం గా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం, ఆలోచించడం ఇప్పడు పెద్ద సవాలని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో సంపద ఒకే చోట కేంద్రీకృతమై ఉందని, కొవిడ్‌కు ముందు మనం చేయలేని దాన్ని చేయడానికి కొవిడ్‌ ఒక గొప్ప అవకాశం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కొత్త దిశగా కొత్తగా ప్రయాణం ప్రారంభించడానికి ఇది తగిన సమయమన్నారు. ప్రజల్లో ఒత్తిడి, ఆందోళనలు ఉన్నాయి. కొవిడ్‌కు ముందు పరిస్థితులు రావాలని ప్రభుత్వాలు, కంపెనీలు కోరుకుంటున్నాయి. అయితే మళ్లీ అదే స్థితికి ఎందుకు వెళ్లాలి. వెనక్కి వెళ్లడానికి ఏముందని ప్రశ్నించారు. 


ఏఐ ఉపద్రవం ముంచుకొస్తోంది: కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం ఇప్పటికే ప్రారంభమైంది. మానవ వనరులకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. మీరు రచయిత అయితే.. మీ కంటే బాగా ఏఐ రచనలు చేస్తుంది. చివరకు మన స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుంది. 15 ఏళ్లలో సగానికి సగం మంది ఉద్యోగాలు పోతాయి. వారి స్థానంలో మెషి న్లు వస్తాయి. ఎందుకంటే మెషిన్లు చౌకగా, మరింత మెరుగ్గా పని చేస్తాయి. పనిలేని ప్రజలు ప్రపంచంలో పనికిరాని చెత్తగా మిగిలిపోతారని యూనస్‌ అన్నారు. బహుశా అప్పుడు ఈ చెత్తను తొలగించడానికి ఏఐ క్రిమి నియంత్రణ కంట్రోలర్‌ను పంపుతుందని వ్యాఖ్యానించారు. 

 

మూడేళ్లలో ‘క్లౌడ్‌’లో 24 లక్షల ఉద్యోగాలు : స్టార్ట్‌పల వ్యవస్థకు ఇజ్రాయెల్‌ ఎలానో డిజిటల్‌ టెక్నాలజీల నిపుణులకు భారత్‌ అలా గుర్తింపు సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్‌ సాహ్నీ అన్నారు. 2023 నాటికి పబ్లిక్‌ క్లౌడ్‌ పరిశ్రమలో 24 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, 73.7 లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం క్లౌడ్‌-ఫస్ట్‌ విధానాన్ని అనుసరిస్తోందని అజయ్‌ అన్నారు.

 

టెక్నాలజీ లీడర్‌గా భారత్‌ : విదేశీ సాంకేతికతను అనుసరించడానికి బదులు భారత్‌ టెక్నాలజీ లీడర్‌గా ఎదగాలనుకుంటోందని రక్షణ శాఖ ఆర్‌ అండ్‌ డీ విభాగ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ జీ సతీష్‌ రెడ్డి అన్నారు. టై గ్లోబల్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రక్షణ రంగంలో దాదాపు 2,000 ప్రథమ, ద్వితీయ శ్రేణి పరిశ్రమలు డీఆర్‌డీఓతో కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. 


 భారత్‌లోని వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసైక్లింగ్‌ రంగానికి చెందిన 4 కంపెనీల్లో 19 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సర్క్యులేట్‌ క్యాపిటల్‌ తెలిపింది. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన శ్రీచక్ర పాలీప్లాస్‌, రాపిడ్యూ టెక్నాలజీ స్‌ (రెసికాల్‌)తో పాటు దీయ ప్యానెల్‌ ప్రొడక్ట్స్‌(రిక్రాన్‌), దాల్మి యా పాలీప్రో ఇండస్ట్రీస్‌ కూడా ఉన్నాయి. 


  వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలను 1-3 శాతం మేర పెంచుతున్నట్లు ఫోర్డ్‌ ఇండియా ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.5,000-35,000 వరకు పెంపు ఉంటుందని తెలిపింది.  


 తిరుపతిలో ఉబర్‌ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఉబర్‌ ప్రీమియర్‌ సహా ఉబర్‌ ఆటో, రెంటల్‌ సేవలను ఇక్కడ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఉబర్‌ ఇప్పటికే ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో సేవలందిస్తోంది. 


Updated Date - 2020-12-11T08:12:58+05:30 IST