భారత్ పెట్టుబడుల గమ్యస్థానం
ABN , First Publish Date - 2020-12-20T06:52:29+05:30 IST
గడిచిన ఆరేళ్లలో అన్ని రంగాల్లోనూ చేపట్టిన సంస్కరణల ఫలితంగా భారత్‌పై ప్రపంచ పెట్టుబడిదారుల వైఖరిలో సానుకూల మార్పు వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో భారత్ ఎందుకు..? అనుకున్న వారే ప్రస్తుతం భారత్ ఎందుకు కాకూడదు...

- ఆరేళ్లలో చేపట్టిన వరుస సంస్కరణలతో
- భారత్‌పైకి మళ్లిన ప్రపంచ ఇన్వెస్టర్ల దృష్టి
- అసోచామ్ సదస్సులో ప్రధాని మోదీ
గడిచిన ఆరేళ్లలో అన్ని రంగాల్లోనూ చేపట్టిన సంస్కరణల ఫలితంగా భారత్‌పై ప్రపంచ పెట్టుబడిదారుల వైఖరిలో సానుకూల మార్పు వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో భారత్ ఎందుకు..? అనుకున్న వారే ప్రస్తుతం భారత్ ఎందుకు కాకూడదు..? అన్న అభిప్రాయానికి వచ్చారన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లలో భారత్‌పై నమ్మకం పెరిగిందనడానికి కరోనా సంక్షోభ కాలంలో తరలి వచ్చిన విదేశీ పెట్టుబడులే సాక్ష్యమని అసోచామ్ సదస్సులో మోదీ పేర్కొన్నారు. ఈ ఆరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇంకా ఏమన్నారంటే..
- పెట్టుబడుల తీరులో వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ ప్రభుత్వం 1,500 కాలం చెల్లిన, పాత చట్టాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టింది. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ప్రభుత్వ వైఖరికిదే ఉదాహరణ.
- ప్రస్తుతం భారత్ స్వావలంబన దిశగా పయనిస్తోంది. స్వయం సమృద్ధి కోసం ఇండస్ట్రీ అన్ని విధాలా కృషి చేయాలి.
- భారత ఆర్థిక వృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా సానుకూలత నెలకొంది. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ సరఫరాలోనూ భారత్ కీలక పాత్ర పోషించనుంది.
- ఇండస్ట్రీ అత్యుత్తమ కార్పొరేట్ పాలన, లాభాల పంపిణీ విధానాలను అనుసరించాలి.
- పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, ఈ విభాగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడుల వాటా గణనీయంగా పెరగాల్సి ఉంది. అన్ని రంగాల్లోనూ ఆర్ అండ్ డీకి కేటాయింపులు పెరగాలి.
- దేశీయ అవసరాలతో పాటు ప్రపంచం కోసమూ తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు భౌగోళిక రాజకీయ పరిణామాలపై త్వరితగతిన స్పందించాలి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిన సందర్భాల్లో, వెంటనే స్పందించి, ఎగుమతులు పెంచడం ద్వారా లబ్ధి పొందేందుకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకు విదేశాంగ, వాణిజ్య మంత్రిత్వ శాఖల మధ్య పరస్పర సహకారం మరింత మెరుగుపడాలి.
- ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రభుత్వం అవసరమైన వసతులు, సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ప్రోత్సాహకాలు అందించగలదు. కానీ, ప్రభుత్వ మద్దతును విజయంగా మార్చాల్సింది ఇండస్ట్రీయే.
- సమర్థవంతమైన, స్నేహపూర్వక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతాయి. ప్రపంచం నాలుగో తరం పారిశ్రామిక విప్లవం దిశగా వేగంగా పయనిస్తోంది. కొత్త సాంకేతికతల రూపంలో సవాళ్లు ఎదురవుతాయి. చాలా పరిష్కారాలూ లభిస్తాయి. పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాల్సిన సమయమిది.
దేశ ఆభివృద్ధిలో టాటా గ్రూప్‌ది కీలక పాత్ర: మోదీ
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు అసోచామ్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ది సెంచురీ అవార్డు లభించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రతన్ టాటా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన టాటా గ్రూప్‌ను మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. కరోనా సంక్షోభ కాలంలో దేశాన్ని ముందుండి నడిపిస్తున్నందుకు గాను మోదీకి టాటా అభినందనలు తెలిపారు. ఆయ న బలమైన నాయకత్వ ప్రయోజనాలను పారిశ్రామిక రంగం మరింత ముందుకు తీసుకెళ్లుతుందని నమ్ముతున్నట్లు రతన్ టాటా పేర్కొన్నారు.
