రీఫైనాన్సింగ్‌కు మంచి తరుణమిదే
ABN , First Publish Date - 2020-10-31T07:58:30+05:30 IST
ఆర్థిక మందగమనం, కరోనాతో ప్రపంచ దేశాలన్నీ కకావికలవుతున్నాయి. వ్యక్తుల ఉద్యోగాలు,

ఆర్థిక మందగమనం, కరోనాతో ప్రపంచ దేశాలన్నీ కకావికలవుతున్నాయి. వ్యక్తుల ఉద్యోగాలు, ఆదాయాలూ గణనీయంగా తగ్గిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది గత వందేళ్లలో ఎన్నడూ కనీవిని ఎరుగని ఆర్థిక సంక్షోభం. ఈ కష్టం నుంచి బయటపడేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులూ రంగంలోకి దిగాయి. కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించేశాయి. భారత్‌లోనూ వడ్డీ రేట్లు ప్రస్తుతం పదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇలాంటి సమయంలో ఇప్పటికే ఉన్న గృహ రుణాలను రీఫైనాన్సింగ్ చేసుకోవటం ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందటమే కాకుండా ఊరట పొందవచ్చంటున్నారు ఫిన్‌ట్ర్‌స్ట అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు అనురాగ్ జన్వార్. ఆ వివరాలు..
కరోనా నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలకమైన రెపో రేట్లు తగ్గించింది. గత ఏడాది ఏప్రిల్‌లో 6 శాతం ఉన్న రెపో రేటు ప్రస్తుతం 4 శాతానికి దిగొచ్చింది. ద్రవ్యోల్బణం భయం లేకపోతే ఈ నెలలో జరిగిన ఎంపీసీ భేటీలోనూ ఆర్‌బీఐ రెపో రేటు ఎంతో కొంత తగ్గించేది. రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులూ గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేశాయి. ఏడాది క్రితం వరకు ఈ రుణాలపై వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి 8 శాతం మధ్య ఉండేవి. ఇప్పుడు 6.7 శాతం వడ్డీకే హోమ్ లోన్లు లభిస్తున్నాయి.
రీఫైనాన్స్
సొంతిల్లు కొనుగోలు చేసే వేతన జీవుల్లో నూటికి 90 మంది గృహ రుణాలతో కొనేవారే. వీరు లోను తీసుకున్నప్పుడు ఉన్న వడ్డీ రేటుకి, ఇప్పుడున్న వడ్డీ రేట్లకు చాలా తేడా ఉంది. ఇలాంటి వ్యక్తులు హోమ్ లోన్ రీఫైనాన్స్‌కు పోవడం ద్వారా ఈఎంఐల భారం తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కనీసం 60 నుంచి 80 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) వడ్డీ భారం తగ్గించుకోవచ్చు. గత నెల వరకు ఎంసీఎల్‌ఆర్ ఆధారిత గృహ రుణాలపై బ్యాంకులు 8 శాతం వరకు వడ్డీ వసూలు చేసేవి.
తగ్గిన వడ్డీ రేట్లు
అక్టోబరు 1 నుంచి చాలా బ్యాంకులు 7.2-7.4 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలకు రీఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం ద్వారా 20 ఏళ్లలో చెల్లించేలా రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తి తన ఈఎంఐ భారాన్ని రూ.2,000 వరకు తగ్గించుకోవచ్చు. ఈ లెక్కన 20 ఏళ్లలో అతడికి రూ.5 లక్షల భారం తగ్గుతుంది.
ఎవరి వద్ద?
కొద్దిపాటి కన్వర్షన్ ఫీజు చెల్లించడం ద్వారా ఇప్పుడు హోమ్ లోన్ ఉన్న బ్యాంకు లేదా గృహ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ) నుంచే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదా ఇంకో బ్యాంకు లేదా హెచ్‌ఎ్‌ఫసీ ఇంత కంటే తక్కువ వడ్డీ రేటుకు రీఫైనాన్స్ కల్పిస్తుంటే వాటిని ఎంచుకోవచ్చు. కాకపోతే ఇందుకు కొన్ని డాక్యుమెంట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి చేస్తే పాత బ్యాంక్ లేదా హెచ్‌ఎ్‌ఫసీకి అప్పటి వరకు చెల్లించాల్సి ఉన్న బకాయి మొత్తాన్ని కొత్త బ్యాంకు లేదా హెచ్‌ఎ్‌ఫఈ చెల్లించేస్తుంది. అక్కడి నుంచి ఈఎంఐలను కొత్త బ్యాంకు లేదా హెచ్‌ఎ్‌ఫసీకి చెల్లించాలి.
బదిలీ ప్రక్రియ
ముందుగా ప్రస్తుత హోమ్ లోన్ ఉన్న బ్యాంకు లేదా హెచ్‌ఎ్‌ఫసీకి మీ వద్ద నుంచి గృహ రుణ ఖాతా క్లోజ్ చేస్తున్నట్లు నోటీసు ఇవ్వాలి. అదే సమయంలో వారి నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కోసం దరఖాస్తు చేయాలి. ఈ రెండు పనులు చేసేటప్పుడే మీ రుణ చెల్లింపుల చరిత్ర, బ్యాంకు కస్టడీలో ఉన్న మీ ఇంటికి సంబంధించిన పత్రాల వివరాలు తెలియజేయాలి. ఆ తర్వాత రీఫైనాన్స్‌కు పోతున్న బ్యాంకు లేదా హెచ్‌ఎ్‌ఫసీకి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే కొత్త రుణం మంజూరవుతుంది.
లోన్ రీఫైనాన్స్ అంటే ?
ప్రస్తుతమున్న రుణాన్ని కొత్త షరతులు, వడ్డీ రేటుతో కొత్త రుణం ద్వారా చెల్లించడాన్నే రుణ రీఫైనాన్స్ అంటారు. ప్రస్తుత రుణం తీసుకున్నపుడు ఉన్న వడ్డీ రేట్ల కంటే ఇప్పుడున్న వడ్డీ రేట్లు తక్కువగా ఉండి, భవిష్యత్‌లో ఇంకా తగ్గుతాయనిపించినప్పుడు చాలా మంది రుణ రీఫైనాన్స్‌కు వెళతారు. స్థిర (ఫిక్స్‌డ్) వడ్డీ రేటుతో గృహ రుణాలు తీసుకున్న వ్యక్తులు ఎక్కువగా రీఫైనాన్స్ కోసం చూస్తుంటారు.
