కరోనా ఔషధంపై మూడో దశ క్లినికల్ పరీక్షలు: గ్లెన్‌మార్క్
ABN , First Publish Date - 2020-05-13T06:41:37+05:30 IST
కొవిడ్-19 చికిత్సలో సమర్థవంతంగా పని చేస్తుందని భావిస్తున్న ఫావిపిరావిర్ యాంటీ వైరల్ ఔషధంపై మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభించినట్టు ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. మూడో దశ క్లినికల్ పరీక్షలకు గత నెలలోనే...

న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో సమర్థవంతంగా పని చేస్తుందని భావిస్తున్న ఫావిపిరావిర్ యాంటీ వైరల్ ఔషధంపై మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభించినట్టు ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. మూడో దశ క్లినికల్ పరీక్షలకు గత నెలలోనే భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీఐ) కార్యాలయం అనుమతి లభించినట్టు తెలిపింది. దేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు వచ్చిన తొలి కంపెనీ తమదేనని వెల్లడించింది. ఈ దశలో జరిగే పరీక్షలపై అధ్యయనానికి 10 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఎంపిక చేస్తున్నామని, జూలై లేదా ఆగస్టు నాటికి ఈ అధ్యయనం పూర్తవుతుందని తెలిపింది. కరోనా లక్షణాలు ఒక మోస్తరుగా ఉన్న 150 మందిని ఎంపిక చేసి ప్రామాణికమైన వైద్య సహాయం అందిస్తూ గరిష్ఠంగా 14 రోజుల పాటు చికిత్స ఇవ్వనున్నట్టు తెలియచేసింది. చికిత్స మొదలు పెట్టిన నాటి నుంచి మొత్తం 28 రోజుల్లో ఈ అధ్యయనం పూర్తి చేస్తామని పేర్కొంది.