ఎన్‌పీఏల పోటు తప్పదు

ABN , First Publish Date - 2020-12-29T06:27:23+05:30 IST

కరోనా మహమ్మారి బ్యాంకుల ఆర్థిక స్థితిని తలకిందులు చేయనుంది. వచ్చే మార్చి నాటికి బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్‌పీఏ)

ఎన్‌పీఏల పోటు తప్పదు

ఇక్రా అంచనా


ముంబై: కరోనా మహమ్మారి బ్యాంకుల ఆర్థిక స్థితిని తలకిందులు చేయనుంది. వచ్చే మార్చి నాటికి బ్యాంకుల  మొండి బకాయిలు (ఎన్‌పీఏ) పతాక స్థాయికి చేరుకోనున్నట్టు ఇక్రా తాజా నివేదికలో అంచనా వేసింది. స్థూల ఎన్‌పీఏలు 10.1-10.6 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.1-3.2 శాతానికి చేరవచ్చునని తెలిపింది. అయితే 2022 మార్చి నాటికి నికర ఎన్‌పీఏలు 2.4-2.6 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. రుణ మారటోరియం ముగిసిపోయి ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.


2020 సెప్టెంబరు నాటికి స్థూల ఎన్‌పీఏలు 7.9 శాతం, నికర ఎన్‌పీఏలు 2.2 శాతం స్థాయిలో ఉన్నాయి. అయితే బ్యాంకులు రుణ వసూళ్లు బలంగా ఉన్నాయని, 90 శాతం మేరకు వసూళ్లు జరిగాయని ప్రకటిస్తున్న నేపథ్యంలో 2021-22 నాటికి ఈ ఒత్తిడి తగ్గవచ్చని ఆంచనా వేసింది. అలాగే ఊహలకు అతీతంగా ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవడంతో పాటు ప్రభుత్వ లిక్విడిటీ మద్దతుతో రుణ పునర్నిర్మాణ దరఖాస్తులు కూడా అనుకున్న స్థాయి కన్నా చాలా తక్కువగా ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. రుణ పునర్నిర్మాణ దరఖాస్తులు 5 నుంచి 8 శాతం మధ్యన ఉండవచ్చని గతంలో వేసిన అంచనాను ఇప్పుడు 2.5 నుంచి 4.5 శాతానికి కుదించింది. 


వసూళ్లు స్థిరంగా ఉండడంతో పాటు పునర్నిర్మాణం తక్కువగా ఉండడం, నికర ఎన్‌పీఏలు కూడా అదుపులోనే ఉండడం వల్ల రాబోయే కాలంలో ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడే ఆస్కారం ఉన్నట్టు ఇక్రా ఆర్థిక రేటింగ్స్‌ విభాగం హెడ్‌ అనిల్‌ గుప్తా అన్నారు. 




ముఖ్యాంశాలు...


బ్యాంకుల రుణ ప్రొవిజనింగ్‌ 2021-22 నాటికి 1.8 నుంచి 2.4 శాతానికి తగ్గవచ్చు. ఇది వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మాత్రం 2.2 నుంచి 3.1 శాతం మధ్యన ఉండవచ్చు. దీని వల్ల బ్యాంకుల ఈక్విటీపై రాబడి మెరుగు పడుతుంది.

వరుసగా ఆరు ఆర్థిక సంవత్సరాల (2016-2021 ఆర్థిక సంవత్సరాలు) నష్టాల నుంచి బ్రేక్‌ ఈవెన్‌ సాధించి 2022 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ఆర్‌ఓఈ 0.0 శాతం నుంచి 5.4 శాతానికి మెరుగు పడవచ్చు. ప్రైవేటు బ్యాంకుల ఆర్‌ఓఈ మాత్రం 9.5 నుంచి 10.5 శాతం మధ్యన ఉండవచ్చు. 

పెద్ద ప్రైవేటు బ్యాంకుల మూలధన పరిస్థితి బలంగా ఉంది. ఈ ఏడాది ఆ బ్యాంకులు రూ.54,400 కోట్లు సేకరించినందువల్ల ఎలాంటి ఒత్తిడులైనా ఎదుర్కొని నిలదొక్కుకునే ఆస్కారం ఉంది. వచ్చే ఏడాదితో పాటు 2023 ఆర్థిక సంవత్సరపు కాల్‌ ఆప్షన్లను చెల్లించగల స్థాయిలో ఇవి ఉన్నాయి.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.23,300 కోట్ల విలువైన ఏటీ-1 బాండ్ల చెల్లింపులను తట్టుకోవాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.43 వేల కోట్ల అదనపు మూలధనం సమీకరించుకోవలసి ఉంటుంది. 

తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన వ్యాపార రాబడులు, మంచి ఉద్యోగావకాశాలు, ఆదాయ స్థాయిల పెరుగుదల  ఊతంతో వచ్చే ఏడాది రుణ డిమాండ్‌ కూడా పెరుగుతుంది.  




క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్లతో ముప్పు

క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్లు అదనపు రిస్క్‌ కొని తెస్తాయని, 2021లో వీటిని నియంత్రించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగవచ్చని ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ సుజిత్‌ కుమార్‌ వర్మ అన్నారు. ఆయన వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్లు కొత్త కాకపోయినా వాటిని మనీ లాండరింగ్‌కు ఉపయోగించుకోవచ్చని, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయానికి వీటిని ఉపయోగించుకునే ప్రమా దం ఉన్నదని ఆయన హెచ్చరించారు.


అలాగే క్రిప్టో కరెన్సీల యజమానులెవరో తెలిసే ఆస్కారం లేకపోవం కూడా ఉగ్రవాదుల ఫైనాన్సింగ్‌కు ఆ నిధులు ఉపయోగించేందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. విలువైన లోహాలు, వజ్రాల వాణిజ్యంలో ఉన్న వారిపై కూడా పర్యవేక్షణ వచ్చే ఏడాది నుంచి పెరగవచ్చని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థ లు తనిఖీలు పెంచినప్పటికీ సుశిక్షితులైన అధికారుల కొరత కారణంగా బ్యాంకులు ఉత్తమ ప్రతిభావంతులను నియమించుకునేందుకు ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సిరావచ్చునని వర్మ చెప్పారు. 


Updated Date - 2020-12-29T06:27:23+05:30 IST