లాక్‌డౌన్‌లోనూ సంపాదిస్తున్నది ఒక్క టెలికం రంగమే: సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-06-18T23:49:07+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో సంపాదిస్తున్నది ఒక్క టెలికం కంపెనీలేనని, ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి

లాక్‌డౌన్‌లోనూ సంపాదిస్తున్నది ఒక్క టెలికం రంగమే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో సంపాదిస్తున్నది ఒక్క టెలికం కంపెనీలేనని, ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి డబ్బులు ఎంతో అవసరమని కాబట్టి వెంటనే బకాయిలు చెల్లించాలంటూ టెలికం కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, గత పదేళ్ల అకౌంటు పుస్తకాలు సమర్పించాలని ఆదేశించింది. టెలికం కంపెనీల చెల్లింపు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని ఈ విషయంపై తిరిగి రావాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది.


‘‘కరోనా వైరస్ మహమ్మారి సమయంలోనూ డబ్బులు సంపాదిస్తున్న ఒకే ఒక్క రంగం టెలికం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల్లో కొంత చెల్లించండి. ఈ మహమ్మారి సమయంలో ఇప్పుడు డబ్బులు ఎంతో అవసరం’’ అని తిసభ్య ధర్మాసనం టెలికం కంపెనీలకు సూచించింది.


గత కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉండడంతో కొత్త గ్యారెంటీలకు నిధులు తమ వద్ద లేవని వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనానికి తెలిపింది. స్ప్రెక్ట్రం, లైసెన్స్ ఫీజుల కోసం ప్రభుత్వానికి ఇప్పటికే రూ.15 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీలను  వొడాఫోన్ సమర్పించింది. గెయిల్ ఇండియా, ఆయిల్ ఇండియా, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ వంటి టెలికం యేతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉపశమన చర్యల్లో భాగంగా 4 లక్షల కోట్ల బకాయిల్లో 96 శాతం ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు టెలికం విభాగం (డీవోటీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.


అంతకుముందు ఇచ్చిన తీర్పును ప్రభుత్వ టెలికం విభాగం దుర్వినియోగం చేసిందని గత వారం సుప్రం కోర్టు ఆరోపించింది. ప్రభుత్వ సంస్థల నుంచి రూ .4 లక్షల కోట్లు డిమాండ్ చేసినందుకు, అధికారులపై ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘‘ప్రభుత్వ రంగ సంస్థలు టెలికం సేవల వ్యాపారం లేనందు వల్ల బకాయిల డిమాండ్లను ఉఫసంహరించుకుంటున్నాం’’ అని  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు.  


Updated Date - 2020-06-18T23:49:07+05:30 IST